
కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో చాలా రోజుల తర్వాత నా కూతురి మొహంలో సంతోషం చూశాను. తన తల్లే మనుమరాలి రూపంలో తన ఇంట్లో పుట్టబోతోందనే ఆనందంలో ఉంది కాంచన. ఆ సంతోషాన్ని ఈ ప్రమాదం ఎక్కడ దూరం చేస్తుందోనని భయంగా ఉందిరా అంటాడు శివన్నారాయణ.
నువ్వు ఏం భయపడకు తాత. అన్నీ నేను చూసుకుంటాను. నీ భయాలన్నీ నాకు వదిలెయ్. నా బిడ్డను, మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నువ్వు ఏం జరగనట్లే సంతోషంగా ఉండు అని శివన్నారాయణకు ధైర్యం చెప్తాడు కార్తీక్. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియదు. కానీ ఈ ఇంట్లోనే జ్యోత్స్న రూపంలో పెద్ద ప్రమాదం ఉందని మనసులో అనుకుంటాడు కార్తీక్.
జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకుంటూ రగిలిపోతుంది జ్యోత్స్న. మీ అమ్మ నిన్ను కొట్టినందుకు నువ్వు బాధపడుతున్నావు కానీ.. కొట్టడంలో తప్పు లేదు అంటుంది పారు. కోపంతో పారు మెడపై కత్తి పెడుతుంది జ్యోత్స్న. ఇప్పుడు చెప్పు ఆ మాట అంటుంది. మళ్లీ మళ్లీ చెప్తాను. నిన్ను కొట్టడంలో తప్పులేదు అంటుంది పారు. మా మమ్మీ నన్ను సపోర్ట్ చేయకపోతే నాకు ప్రాబ్లం లేదు. కానీ నీకేమైంది గ్రానీ.. అంటుంది జ్యోత్స్న.
దీప కడుపు గురించి కాకుండా.. ఇంకా వేరే ఏం మాట్లాడినా నేను నిన్ను సపోర్ట్ చేసేదాన్ని అంటుంది పారు. దీప కడుపు గురించి మాట్లాడితేనే తప్పు చేసినట్లు చూశారు. ఆ కడుపులో బిడ్డను కడుపులోనే చంపేస్తే ఏమవుతారో అంటుంది జ్యోత్స్న. ఆ తప్పు మాత్రం చేయకు జ్యోత్స్న అంటుంది పారు. కచ్చితంగా చేస్తాను గ్రానీ.. బావ వారసత్వం దీప కడుపులో పెరగడానికి వీల్లేదు అంటుంది జ్యోత్స్న. దీప ప్రెగ్నెంట్ అయితే నీకు వచ్చే నష్టం ఏముంది? వదిలెయ్ అంటుంది పారు. నష్టం నాకే ఉంది గ్రానీ కానీ.. నేను చెప్పలేను అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
జ్యోత్స్న మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది దీప. ఓదార్చే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. ఇంతలో సుమిత్ర అక్కడికి వస్తుంది. దీప మొహం చూసి నువ్వు జరిగిన దాని గురించి ఆలోచిస్తావని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. నా కూతురు తప్పు చేసింది. అది కోరుకున్నది.. నీకు దక్కిందని దానికి నీపై ఈర్ష్య ఉంది. అందుకే నిన్ను ఏదో ఒకటి అనాలని ఎదురు చూసింది. నాకోసం తనని క్షమించు. అంటుంది సుమిత్ర.
కడుపుతో ఉన్న ఆడపిల్ల గర్భగుడిలో దేవతతో సమానం. నిన్ను మాటలతో బాధపెట్టడం అది చేసిన తప్పే అంటుంది సుమిత్ర. వదిలెయ్ అత్త. మేము దాని గురించి ఎప్పుడో మర్చిపోయాము. నువ్వు కూడా మర్చిపో అంటాడు కార్తీక్. ఇక్కడ జరిగిన గొడవ గురించి వదినతో చెప్పకు కార్తీక్ అంటుంది సుమిత్ర. కుటుంబం కలిసి ఉండాలని కోరుకునేవాన్ని. అలా ఎలా చెప్తాను అత్త అంటాడు కార్తీక్. థాంక్స్ చెప్పి వెళ్లిపోతుంది సుమిత్ర.
ఫైల్స్ పట్టుకొని శివన్నారాయణ ఇంటికి వస్తాడు శ్రీధర్. ఆఫీస్ పని మీద వచ్చాను మామయ్య గారు అని చెప్తాడు. జ్యోత్స్నను పిలవండి.. తనతో మాట్లాడాలి అంటాడు శ్రీధర్. జ్యోత్స్నను విష్ చేస్తాడు శ్రీధర్. పట్టించుకోదు జ్యోత్స్న. మీ మామయ్య నిన్ను విష్ చేశారు వినిపించలేదా అని దశరథ కోపంగా అంటాడు.
ఇంట్లో ఏదో గొడవ జరిగినట్లు ఉంది. మనకెందుకులే.. వచ్చిన పని చూస్కొని పోతే సరిపోతుంది అని మనసులో అనుకుంటాడు శ్రీధర్. కంపెనీ అకౌంట్స్ చూశాను మామయ్య. కొంత అమౌంట్ తక్కువ పడింది అని చెప్తాడు శ్రీధర్. ఎంత బావ అంటాడు దశరథ. 2 కోట్ల 34 లక్షల రూపాయలు అంటాడు శ్రీధర్. అంతా షాక్ అవుతారు. అవి జ్యోత్స్న పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ అయినట్లు చూపిస్తోంది. ఏం చేసిందో తనే చెప్పాలి అంటాడు శ్రీధర్.
పర్సనల్ ఖర్చులకు వాడుకుందేమో అంటాడు కార్తీక్. అంత డబ్బును పర్సనల్ ఖర్చులకు ఎలా వాడుకుంటుందిరా.. ఏదో ఒక ట్రస్ట్ కి దానం చేసి ఉంటుంది అంటుంది పారు. కంపెనీ డబ్బులు వాడుకుంటే ఊరుకోరు పారు. కేసు పెడతారు తెలుసా అంటాడు కార్తీక్. మామూలుగా అయితే ఈ విషయం బోర్డ్ మెంబర్స్ కి చెప్పాలి. కానీ ఛైర్మన్ గారి పరువు పోవద్దని నేను ఇక్కడికి వచ్చాను అంటాడు శ్రీధర్.
అంతా అలా మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉన్నావేంటే.. డబ్బులు ఏం చేశావో చెప్పు అని జ్యోత్స్నను గట్టిగా వీపుపై తడుతుంది పారిజాతం. నేనేమి డబ్బులు వేస్ట్ చేయలేదు. మమ్మీ కోసం ల్యాండ్ కొన్నాను.. మ్యారేజ్ డే గిఫ్ట్ గా ఇద్దామనుకున్నాను అంటుంది జ్యోత్స్న.
మరి ఎందుకు ఇవ్వలేదో అంటాడు కార్తీక్. అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు అంటుంది జ్యోత్స్న. మరి తర్వాత అయినా ఇవ్వొచ్చు కదా అంటాడు కార్తీక్. అంత మంచి టైం నాకు మళ్లీ రాలేదు అంటుంది జ్యోత్స్న. నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం అంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.