
రామరాజు భోజనం కూడా చేయకుండా ఒంటరిగా కూర్చొని ఉంటాడు. భోజనం చేయడానికి రమ్మని భాగ్యం పిలుస్తుంది. కానీ.. తాను తన భార్య వచ్చిన తర్వాతే తింటాను అని రామరాజు అంటాడు. ఇక.. భాగ్యం తన నాటకం మొదలుపెడుతుంది. ఫోన్ రాకుండానే వచ్చినట్లు మాట్లాడుతుంది. ఆ ఫోన్ లో రామరాజు వినేలాగా.. సాగర్ డబ్బులు ఇచ్చి ఉద్యోగం కొన్నాడా? ఆధారాలు కూడా ఉన్నాయా అని మాట్లాడుతుంది. అది విన్న రామరాజు కాస్త కంగారుపడతాడు. ఏమైంది అని అడుగుతాడు. తన స్నేహితురాలు శాంతలక్ష్మి ఫోన్ చేసిందని... సాగర్ రూ.25లక్షలు పెట్టి ఉద్యోగం కొన్నాడని.. ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతోందని అంటుంది. ఆ వీడియో ని భాగ్యం రామరాజుకి చూపిస్తుంది. అది చూసి రామరాజు షాకౌతాడు. ఏమీ మాట్లాడకుండా నిలపడతాడు. ఇక.. పక్కనుండి.. భాగ్యం, ఆమె భర్త ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెడతారు. అంత డబ్బు సాగర్ ఎలా వచ్చి ఉంటాయి అని ఇడ్లీ బాబాయి అంటే.. ‘ ఆ వనజ గారు ఇచ్చిన రూ.20లక్షలు, మరో 5 లక్షలు ఎక్కడో నొక్కేసి కట్టి ఉంటాడు. అందుకే.. ఆ డబ్బులు అడిగినప్పుడల్లా.. సాగర్ గజగజా వణికిపోయేవాడు’ అని భాగ్యం అంటుంది. మాటలు రామరాజుకి కూడా నిజం అనిపిస్తాయి. ఇక పక్కనుండి రామరాజుకి నర్మద, సాగర్ లమీద బాగా ఎక్కిస్తారు. లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించాడు కాబట్టి.. లంచాలు తీసుకొని సంపాదిస్తాడు అని అంటారు. నర్మద పైకి నీతులు చెబుతూ..పుట్టింట్లో పార్టీలు చేసుకుంటుందని అంటారు. ఈ మాటలకు రామరాజుకి విపరీతంగా కోపం వస్తుంది. ఆవేశంగా బండి తీసుకొని బయలుదేరతాడు. రామరాజు వెళ్లిపోగానే.. భాగ్యం, మాణిక్యం సంబరాలు చేసుకుంటారు.
మరోవైపు నర్మద వాళ్ల పుట్టింట్లో పార్టీ ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉంటాయి.పెద్దోడు వచ్చి కంగ్రాట్స్ చెబుతాడు. తర్వాత.. ప్రేమ, ధీరజ్ కూడా వస్తారు. అయితే.. నర్మద డల్ గా ఉందని.. ప్రేమ ఏమైందని అడుగుతుంది. తర్వాత చెబుతాను అని నర్మద అంటుంది. ఈ లోగా.. వల్లికి.. భాగ్యం ఫోన్ చేస్తుంది. రామరాజు ఇక్కడ బయలుదేరాడు అని చెబుతుంది. ఆ మాట విని వల్లి సంబరపడిపోతుంది. ఇక.. సాగర్ కి కేక్ కటింగ్ ఏర్పాట్లు చేస్తారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుంటారు. ఇక మ్యూజిక్ పెట్టుకొని అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మరోవైపు రామరాజు ఆవేశంగా వస్తూనే ఉంటాడు.
ఈ లోగా.. ఏజెంట్ కి భాగ్యం ఫోన్ చేస్తుంది.‘ మాకు రావడం కుదరడం లేదు.. వేరే వ్యక్తిని పంపుతున్నాం. అతని దగ్గర రూ.5లక్షలు తీసుకో.. ఫోటో పంపిస్తున్నాను’ అని భాగ్యం చెబుతుంది. రామరాజు ఫోటో కూడా పంపుతుంది. సరిగ్గా రామరాజు అక్కడికి వెళ్లే సరికి.. ఏజెంట్ వచ్చి.. డబ్బులు తెచ్చావా అని అడుగుతాడు. దీంతో.. రామరాజు లాగిపెట్టి కొడతాడు.డ్యాన్స్ వేస్తున్నవాళ్లంతా ఆగిపోయి చూస్తూ ఉంటారు. రామరాజు సాగర్ వైపు చాలా కోపంతో చూస్తూ ఉంటాడు. ఈ లోగా ఆ ఏజెంట్ అక్కడి నుంచి పారిపోతాడు. సింహం వచ్చింది అని వల్లి సంబరపడుతుంది. అక్కడ జరిగేదంతా వాళ్ల అమ్మ కి ఫోన్ చేసి వీడియో కాల్ లో చూపిస్తుంది.
వేదవతి వచ్చి.. ఏమైంది? ఎందుకు ఇంత ఆవేశం అని అడుగుతుంది. అంతే.. రామరాజు వెళ్లి సాగర్ ని కొట్టడం మొదలుపెడతాడు. ‘ సిగ్గు లేదారా.. రూ.25లక్షలు ఇచ్చి ఉద్యోగం కుంటావా?’ అని అడుగుతాడు. ఆ మాటకు అందరూ షాక్ అవుతారు. ‘ మీ నాన్న చెప్పేది నిజమా? మాట్లాడరా..?’ అంటూ వేదవతి నిలదీస్తుంది. దీంతో.. అదే నిజం అని నర్మద ఒప్పుకుంటుంది. ‘ ఈ విషయం మీకు ఎలా తెలిసింది..?’ అని సాగర్ అడిగితే.. రామరాజు రెచ్చిపోతాడు. ఇంకా దారుణంగా తిడతాడు. మధ్యలో నర్మద తండ్రి దూరి.. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అని అంటాడు. కానీ రామరాజు ఆగడు. ‘అసలు నా కొడుకుని చెడగొట్టింది నువ్వే.. ఇలా డబ్బులు ఇచ్చి ఉద్యోగం కొనుక్కునే సలహా నా కొడుకుది కాదు. నాకు తెలుసు.. ఇదంతా చేసింది నువ్వే’ అంటూ నర్మద తండ్రి ప్రసాదరావుపై కోపం చూపిస్తాడు.
దీంతో.. అందరూ ఏం జరిగిందని నర్మదని ప్రశ్నిస్తారు. అసలు వీడికి రూ.25లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అని ధీరజ్ అడిగితే.. ‘ వనజ గారి డబ్బులు దొబ్బేశాడు.. కన్న తండ్రి పరువు తీసి ఉద్యోగం కొనుక్కున్నాడు’ అని రామరాజు అంటాడు. ఇక.. దొరికింది ఛాన్స్ అని వల్లి అందుకుంటుంది.‘ వనజ గారు మామయ్య పరువు ఎలా తీశారో తెలిసి కూడా మీరు ఇలా ఎలా చేశారు?’ అని అడుగుతుంది. ‘ వాడిది ఏం పోయిందమ్మా.. పరువు పోయేది నాది కదా.. వాడికి వాడి స్వార్థం నెరవేరితే చాలు’ అని రామరాజు అంటాడు. ఇక వల్లీ.. నర్మదను ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడం మొదలుపెడుతుంది. అత్తయ్యగారినీ, మామయ్య గారినీ మోసం చేస్తావా అని అంటుంది. ఇక.. వేదవతి, రామరాజు కూడా నర్మదను తిట్టడం మొదలుపెడతారు. ‘ లేదు మామయ్య.. మీరు అంటే మా నాన్న గారెకంటే ఎక్కువ. మీ పరువు పోయే పని నేను ఎప్పటికీ చేయను. అందుకే.. డబ్బు తీసుకొని వనజ గారు వాళ్లకు పొద్దున్నే ఇచ్చేశాం’ అని నర్మద చెబుతుంది.
అంత డబ్బు ఎలా ఇచ్చావ్..? అని వేదవతి అడిగితే.. ‘ నా నగలు తాకట్టుపెట్టాను మామయ్య’ అని నర్మద చెబుతుంది.‘ అసలు ఇలా చేసి ఉద్యోగం కొనుక్కోవాల్సిన అవసరం ఏం వచ్చింది మీకు?’ అని రామరాజు అంటాడు. ‘ ఆ విషయం నేను అడగాలి రామరాజు... నీ కొడుకు నీకు తెలీకుండా ఉద్యోగం కొనుక్కోవాల్సిన ఖర్మ ఎందుకు పట్టింది? ఇంట్లో కోడలి నగలు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏం వచ్చింది? ఇవన్నీ నీకు తెలీవా? అసలు మీ కొడుకు ఉద్యోగం వచ్చిన విషయం మీకు చెప్పడానికి ఇష్టపడలేదు అంటేనే అర్థమౌతోంది.. నీ పెంపకం ఎలా ఉందో.. ఒక్కడినైనా సరిగా పెంచావా? ఒక్కడినైనా సరిగా చదివించావా? నేను ఇక గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తే థ్యాంక్స్ చెప్పడానికి బదులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? అసలు నీకు పరువు ఉందా?’ అని ప్రసాదరావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. తండ్రిని ఆపడానికి నర్మద ప్రయత్నిస్తుంది. కానీ.. ప్రసాదరావు వినడు. అమూల్య కూడా అందుకే లేచిపోయింది అంటాడు. ఆ మాటకు కోపం వచ్చిన ధీరజ్... ప్రసాదరావు కాలర్ పట్టుకుంటాడు. వీళ్ల గొడవను మధ్యలో నర్మద ఆపేస్తుంది.‘ అసలు పిలవని పేరంటానికి రావడానికి సిగ్గు లేదా? ముందు నా ఇంట్లో నుంచి అందరూ వెళ్లిపోండి’ అని ప్రసాదరావు అరుస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.