
మీనా కోపం పోగొట్టాలని ఆమె కోసం బాలు చీర తీసుకొని వస్తాడు. ఆ చీరను అప్పుడే మీనా కట్టుకొని వస్తుంది. అది చూసి.. నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావని బాలు పొగుడుతాడు. అంతేకాదు.. మీనా చేసిన వంటను ప్రతిరోజూ మెచ్చుకుంటాను అని చెబుతాడు. తర్వాత ఇద్దరూ కలిసి సెల్ఫీ దిగుతారు.తర్వాత.. చింటూ కోసం కూడా డ్రెస్ కొన్నానని చెబుతాడు. మంచి పని చేశారు అని మీనా మెచ్చుకుంటుంది.
సీన్ కట్ చేస్తే... శ్రుతి వాళ్ల అమ్మ.. రవి పనిచేసే రెస్టారెంట్ కి వస్తుంది. ‘ ఎలా ఉన్నారు..నువ్వు శ్రుతి’ అని అడుగుతుంది. ‘మేం బాగున్నాం’ అని రవి చెబుతాడు. ‘మీరు బాగుండాలని కోరుకునేవారిలో మేం ముందుంటాం. మీకు ఏదైనా కావాలంటే మిమ్మల్ని అడగడండి. మీకు ఏది కావాలన్నా మేం ఉన్నాం కదా, మేం చూసుకుంటాం కదా’ అని శ్రుతి అమ్మ శోభన అంటుంది.దానికి రవి.. ‘ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావడం లేదు’ అని అంటాడు. దానికి ఆవిడ ‘ కూతురికి పెళ్లి అయ్యిందంటే.. ఎప్పుడు తల్లి అవుతుందా అని ఎదురుచూస్తూ ఉంటాం. కానీ దానికి రెస్టారెంట్ అడ్డు వస్తోందని తెలుస్తోంది’ అని అంటుంది. ‘ ఏ రెస్టారెంట్’ అని రవి అడిగితే... ‘ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటున్న రెస్టారెంట్. దానిని ప్రారంభించిన తర్వాతే పిల్లలను కనడం ప్లాన్ చేసుకున్నారు అంట కదా..చూడండి రవి.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. పిల్లలకు, కెరీర్ ని ముడి పెట్టకూడదు.రెస్టారెంట్ మొదలుపెట్టడం పెద్ద విషయం కాదు. దానికి కావాల్సిన ఎమౌంట్ ని ఇవ్వడానికి మేం ఉన్నాం కదా..’ అని శోభన అంటుంది. అయితే.. ‘ నేను లోను తీసుకుంటాను’ అని రవి చెబుతాడు. ‘ డబ్బులు ఇవ్వడానికి మేం ఉన్నప్పుడు నువ్వు లోన్ తీసుకోవడం ఎందుకు? ’ అంటూ రవికి బ్లాంక్ చెక్ ఇస్తుంది. ఇది దేనికి అని రవి అడిగితే.. ‘ నీ రెస్టారెంట్ కి ఎంత కావాలో నీకే బాగా తెలుసు. నీకు ఎంత అవసరమో అంత రాసుకో’అని ఆమె ఆఫర్ ఇస్తుంది. ‘ నేను అడగలేదు కదా’ అని రవి అంటే.. ‘ నువ్వు అడగాలా.. నీ అవసరం తెలుసుకోవడం నా బాధ్యత.. త్వరగా రెస్టారెంట్ ప్రారంభిస్తే.. మా శ్రుతిని బాగా చూసుకుంటావు కదా’ అని అంటుంది. ‘ అంటే.. ఇప్పుడు నేను శ్రుతిని బాగా చూసుకోవడం లేదని శ్రుతి మీకు చెప్పిందా?’ అని రవి అడిగితే.. ‘ ఛీ ఛీ.. మీ ఇద్దరి విషయాలు శ్రుతి అస్సలు చెప్పదు.. మీరిద్దరూ బాగుండాలనే చెబుతున్నాను. ఇంకా ఎన్నాళ్లు వేరే వాళ్ల దగ్గర పని చేస్తావ్? సొంత రెస్టారెంట్ ప్రారంభించు’ అని చెబుతుంది. అలా కాదని రవి ఏదో చెప్పబోతుంటే..అతనిని చెప్పనివ్వదు.. శ్రుతిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి వెళ్లిపోతుంది.
అయితే... శోభన రవితో మాట్లాడిన విషయం అంతా పక్కనే ఉన్న ఇతర చెఫ్ లు వింటారు. వెంటనే వచ్చి రవితో మాట్లాడతారు. ‘ మీ అత్తగారు ఏదో ఆఫర్ చేసినట్లున్నారు.. బ్లాంక్ చెక్?... అదృష్టవంతుడివి. అందరికీ దొరుకుతుందా ఇలాంటి అదృష్టం.. సో త్వరలో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేస్తావన్నమాట. ఎప్పుడు,ఎక్కడ ’ అని అడుగుతారు. ‘నేను ఇంకొకరు డబ్బులతో రెస్టారెంట్ ఓపెన్ చేయాలి అనుకోవడం లేదు’ అని రవి అంటే.. ‘ ఇచ్చింది మీ అత్తగారే కదా’ అని వాళ్లు అంటే... రవి అందుకు ఒప్పుకోడు. వాళ్లు రవిని ఆ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయమని చెబుతారు.. దాని కోసమే కదా డబ్బు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావ్ అని అంటారు. కానీ.. వాళ్ల మీద చిరాకు పడి రవి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక.. శ్రుతి డబ్బింగ్ చెబుతూ ఉంటుంది. అక్కడికి రవి ఆవేశంగా వెళతారు. అక్కడికి వెళ్లి శ్రుతికి ఫోన్ చేస్తాడు. కానీ.. శ్రుతి ఫోన్ పక్కన పెట్టేసి.. డబ్బింగ్ చెబుతూ ఉంటుంది. ఆ డబ్బింగ్ రూమ్ లోకి రవి వెళ్లి.. ఆ బ్లాంక్ చెక్ ముఖాన కొట్టేసి.. మీ డబ్బు ఉన్నోళ్లకి ఎంత పొగరు అనేసి వెళ్లిపోతాడు.
కోపంగా వెళ్తున్న రవి వెనకే.. శ్రుతి కూడా పరుగులు తీస్తుంది.ఏంటిది? అని శ్రుతి అడిగితే.. ‘ మీ అమ్మ నా ముఖం మీద కొట్టింది.. నేను నీ ముఖం మీద కొట్టాను’ అని అంటాడు. మన పర్సనల్ విషయాలు మీ అమ్మకు ఎందుకు చెప్పావ్ అని శ్రుతిని తిడతాడు.‘ రెస్టారెంట్ పెట్టుకోమని మీ అమ్మ నాకు బ్లాంక్ చెక్ ఇచ్చింది.. అత్తగారు ఇంటి డబ్బులు నాకు అవసరం లేదు’ అని రవి సీరియస్ అవుతాడు. శ్రుతి నచ్చచెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ రవి వినడు.‘ నా రెస్టారెంట్ పెట్టుకోవడానికి నేను వేరొకరి డబ్బులు తీసుకోను. నాకు, మనోజ్ కి తేడా లేదా? నేను మా నాన్న దగ్గరే డబ్బులు తీసుకోలేదు.. మీ అమ్మ దగ్గర తీసుకుంటానా?’ అని సీరియస్ అవుతాడు. ‘ అయితే మా అమ్మకే ఇవ్వు.. నా వర్క్ ప్లేస్ కి వచ్చి గొడవ చేస్తావా?’అని శ్రుతి అడిగితే.. రవి వినిపించుకోడు. ఆ చెక్ చింపి పారేసుకోమని చెప్పి శ్రుతి వెళ్లిపోతే... రవి కూడా దానిని చింపేస్తాడు.
ఇక.. చింటూ వాళ్ల అమ్మ రోహిణీ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.సరిగ్గా అప్పుడే రోహిణీ వస్తుంది. ఆనందంగా వెళ్లి వాళ్ల అమ్మను చింటూ హత్తుకుంటాడు. రోహిణీ.. తన కొడుక్కి పై ముద్దుల వర్షం కురిపిస్తుంది. తర్వాత చింటూ.. అందరికీ వాళ్ల అమ్మను పరిచయం చేస్తాను అంటాడు. కానీ.. రోహిణీ అప్పుడే వద్దు అని.. టైమ్ వచ్చినప్పుడు చెప్పాలి అని అంటుంది. తర్వాత డ్రెస్ ఇస్తుంది. చింటూ సంతోషిస్తాడు. తర్వాత.. చింటూ లోపలికి వెళ్లగానే.. చింటూ.. తల్లి ప్రేమకు దూరం అవుతున్నాడు అని వాళ్ల అమ్మ చెబుతుంది. అత్తగారింట్లో నిజం చెప్పమని ఆమె అంటే.. రోహిణీ అందుకు ఒప్పుకోదు.రివర్స్ లో వాళ్ల అమ్మని తిడుతుంది. తర్వాత రోహిణీ.. బర్త్ డేకి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అందరూ బర్త్ డేకి వస్తారు. పిల్లలతో రోహిణీని మొదట అమ్మ అని పిలిచి తర్వాత..అత్త అని కవర్ చేస్తాడు.
ఆ తర్వాత బాలు, మీనా చింటూ బర్త్ డేకి వస్తారు.బర్త్ డే కి విష్ చేస్తారు. అయితే..బాలు, మీనా లను చూసి రోహిణీ , వాళ్ల అమ్మ షాక్ అవుతారు. రోహిణీ కిటికీలో నుంచి వాళ్లను చూసి బయటకు రాకుండా దాక్కుంటుంది.బాలు, మీనాలు ఎందుకు వచ్చారా అని బాధపడుతుంది. రోహిణీ వాళ్ల అమ్మ.. వెళ్లి బాలు, మీనాలను పలకరిస్తుంది. చింటూ బర్త్ డే ఈ రోజే అని ఎందుకు చెప్పలేదు అని బాలు అడుగుతాడు. ‘ మీరు మాకు ఎంతో సహాయం చేశారు. మిమ్మల్ని బర్త్ డేకి పిలవాలనే అనుకున్నాను కానీ.. తను ఒప్పుకుంటుందో లేదో అని ఆగిపోయాను’ అని పెద్దావిడ చెబుతుంది. తను అంటే ఎవరు అని బాలు అడుగుతాడు.. దానికి చింటూ అమ్మ అని చెబుతాడు. దానికి ఆవిడ కవర్ చేస్తూ.. మీ అమ్మ అంటూ ప్రభావతి వైపు నెడుతుంది. ఇక.. బాలు వెంటనే చింటూ కోసం డ్రెస్ తెచ్చాం అని చెప్పి ఇస్తాడు.‘ ఎలాగూ వచ్చాం కదా..మనమే దగ్గర ఉండి కేక్ కట్ చేపిద్దాం’ అని బాలు అంటే.. మీనా కూడా సరే అంటుంది. అది విని.. చింటూ చాలా సంతోషిస్తాడు. రోహిణీ మాత్రం కంగారుపడుతూ ఉంటుంది. వాళ్లను పంపించడానికి రోహిణీ వాళ్ల అమ్మ చాలా ప్రయత్నిస్తుంది. కానీ.. బాలు, మీనా పట్టించుకోరు. చింటూ బర్త్ డే కి ఉంటాం అని బాలు, మీనా చెబుతారు. ఇక.. తప్పక వాళ్లను లోపలికి తీసుకువస్తుంది. ‘ నా కొడుకు కోసం ఉండాలా? నా కాపురం కోసం వెళ్లిపోవాలా?’ అని రోహిణీ ఆలోచనలో పడుతుంది. కిచెన్ లోనే కూర్చొంటుంది. కేక్ కటింగ్ కి ఏర్పాట్లు చేస్తుంటే... అమ్మ ని పిలవమని చింటూ అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక, కమింగప్ లో.. రోహిణీ రెండో పెళ్లి విషయం ఆమె తల్లి..బాలు, మీనాలకు చెబుతుంది.