
మీనా తాను పోటీలో ఓడిపోయానని తన ఫ్రెండ్స్ తో చెబుతుంది. అయితే.. వాళ్లు మగవాళ్లంతా అంతే అంటూ భర్తలందరినీ తిడతారు. కానీ, మీనా మాత్రం బాలు అందరిలా కాదు అని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీంతో, వాళ్లు మీనాకి మరో ఛాన్స్ ఇస్తారు. బాలుకి ఫోన్ చేసి దోశ ఎలా ఉందో అడగమని చెబుతారు. బాలు మెచ్చుకుంటే పోటీలో గెలిచినట్లే అని అంటారు. వెంటనే మీనా ఫోన్ చేస్తుంది. కానీ.. బాలు డ్రైవింగ్ లో ఉండటం వల్ల ఫోన్ ఎత్తడు. మళ్లీ మీనా ఫోన్ చేయడంతో... బాలు కసురుకుంటాడు. దీంతో.. పోటీలో ఓడిపోయానని డబ్బులు ఇచ్చి మీనా వెళ్లిపోతుంది.
ఇక.. బాలు మధ్యాహ్నం లంచ్ చేయడానికి వచ్చేస్తాడు. తన ఫ్రెండ్ తో కలిసి తిందాం అని... లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే.. అందులో దోశ పిండి, పల్లీలు, పచ్చి మిరపకాయలు ఉంటాయి. దీంతో.. వాళ్ల ఫ్రెండ్ సెటైర్ వేస్తాడు. తాను ఏదో పొరపాటు చేసి ఉంటాను అని బాలు రియలైజ్ అవుతాడు. చాలా సేపు ఆలోచించిన తర్వాత.. తాను చేసిన దోశ ఎలా ఉందో చెప్పకపోవడం వల్లే మీనా హర్ట్ అయ్యిందనే విషయం బాలుకి అర్థం అయ్యేలా అతని ఫ్రెండ్ చెబుతాడు. తర్వాత మీనాని ఎలా కూల్ చేయాలో కూడా చెబుతాడు. వెంటనే బాలు అక్కడి నుంచి ఇంటికి బయలు దేరతాడు.
ఇక ప్రభావతి.. తన ఫ్రెండ్ కామాక్షి ఇంటికి వెళ్తుంది.అయితే, ప్రభావతి తన కొడుకుల గురించి చెబుతూ బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ సంపాదిస్తున్నారని.. అది తన వల్ల కావడం లేదు అని, తాను డ్యాన్స్ క్లాస్ ద్వారా సంపాదిద్దామని చూస్తే ఎవరూ రావడం లేదని ప్రభావతి చెబుతూ ఉంటుంది. దీంతో.. కామాక్షి ఒక ఐడియా వస్తుంది.మొదటి నెల డ్యాన్స్ క్లాస్ నేర్చుకున్న వాళ్లకు ఫ్రీ అని అనౌన్స్ చేయమని ఐడియా ఇస్తుంది.దాని వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏముంది అని ప్రభావతి అంటే.. డ్యాన్స్ క్లాస్ కి వచ్చే పిల్లలకు డ్రెస్సులను మనం తక్కువ ధరకు కొని.. ఎక్కువ ధరకు అమ్ముదాం అని సలహా ఇస్తుంది. దీంతో..ఐడియా బాగుందని ప్రభావతి పొంగిపోతుంది. ఈ రోజు మంచిరోజని.. వెంటనే షాపింగ్ కి వెళ్దాం అని ప్రభావతి కంగారుపెడుతుంది.
కట్ చేస్తే... రోహిణీ తన కొడుకు చింటూ బర్త్ డే కి డ్రెస్ కొనడానికి ఒక షాప్ కి వెళ్తుంది. అదే షాప్ కి ప్రభావతి, కామాక్షి వస్తారు. ఇక రోహిణీ.. చింటూ కి ఫోన్ చేసి ఏ డ్రెస్ కావాలని అడుగుతుంది. నీకు నచ్చింది కొను మమ్మీ అని అని చింటూ చెబుతాడు. మరోవైపు.. ప్రభావతి, కామాక్షి.. కొన్ని డ్రెస్సులు కొంటారు. అదే సమయంలో.. వీరిద్దరూ ఒకరికొరు ఎదురుపడతారు. ‘ అత్తయ్య... మీరు ఏంటి ఇక్కడ’ అని రోహిణీ అడుగుతుంది. డ్రెస్సులు కొనడానికి వచ్చిన విషయం ప్రభావతి చెబుతుంది.‘ నువ్వు ఏంటమ్మా ఇలా వచ్చావు..’ అని ప్రభావతి అడిగితే.. ‘ నా క్లైంట్ కి డ్రెస్ కొనడానికి వచ్చాను. నా సెలక్షన్ బాగుంటుందని వాళ్లు నాకే చెబుతారు’ అని రోహిణీ అంటే.. ‘ అందుకే కదా నువ్వు నా మనోజ్ ని సెలక్ట్ చేసుకున్నావ్’ అని ప్రభావతి సంతోషంగా చెబుతుంది. సరిగ్గా అదే సమయానికి షాప్ అతను వచ్చి.. ‘ మేడమ్... మీ కొడుక్కి చాలా మంచి డ్రెస్ తీసుకున్నారు.. చాలా బాగున్నాయి’ అని అంటాడు. రోహిణీ తెగ కంగారుపడుతుంది. ఆ మాట విని ప్రభావతి, కామాక్షి కూడా కంగారు పడతారు. ‘ ఏయ్ అబ్బాయి.. నా కోడలికి పిల్లలే లేరు.. కొడుకు అంటావేంటి?’ అని ప్రభావతి అంటే.. అతను పొరపాటుగా అన్నాడులే అని.. రోహిణీ కవర్ చేస్తుంది. వెంటనే బిల్లు కట్టేస్తుంది. ప్రభావతి కొన్న దానికి కూడా రోహిణీనే బిల్లు కడతాను అని చెబుతుంది. తన దగ్గర డబ్బులు లేకపోయినా అత్త నుంచి తప్పించుకోవడానికి ఈ బిల్లు కట్టడంతో పాటు.. హోటల్ బిల్లు కూడా కడతాను అని ఒప్పుకుంటుంది.
రాత్రికి బాలు ఇంటికి వచ్చి..మీనాని పిలుస్తాడు.బాలు ఎంత ప్రేమగా పిలిచినా మీనా చిరాకుగా చిటపటలాడుతూ బదులిస్తుంది. కావాలని బాలు కాసేపు మీనాను ఏడిపిస్తాడు. తర్వాత... మీనా కోసం పట్టుచీర తెచ్చాను అని చెప్పి ఇస్తాడు. మీనా పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే.. ఆపేసి..ఎలా ఉందో మెచ్చుకోవాలి అని అంటాడు. అయితే.. తాను ఉదయం బీట్రూట్ దోశ గురించి, పందెం వేసి ఓడిపోయాను అని మొత్తం చెబుతుంది.మిమ్మల్ని నమ్మినందుకు నాకు 500 నష్టం వచ్చిందని మీనా బాధపడుతుంది. కాసేపు ఇద్దరూ చిర్రుబుర్రులాడుకుంటారు. అయినా మీనా పట్టించుకోదు. దీంతో.. తాను అక్కడి నుంచి వెళ్లిపోతాను అని బాలు అంటే.. మీనా వెళ్లి.. ఆ చీర కట్టుకొని వస్తుంది. చీరలో మీనా చాలా అందంగా ఉందని బాలు పొగిడేస్తాడు.అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక కమింగప్ లో రోహిణీ తన కొడుకు బర్త్ డేకి వెళ్తుంది. అదే బర్త్ డేకి బాలు, మీనా కూడా రావడం విశేషం. మరి.. రోహిణీ ఎలా తప్పించుకుంటుందో చూడాలి.