
కచ్చితంగా కారు కొనాల్సిందేనని.. ఇప్పుడు అయితే తనకు డిస్కౌంట్ లో తక్కువ ధరకు వస్తుందని బాలు పట్టుపడతాడు. కానీ.. ఇంట్లో గొడవలు తగ్గే వరకు కారు కొనొద్దని మీనా అంటుంది. దానికీ దీనికీ ఏంటి సంబంధం అని బాలు ఎంత చెప్పినా మీనా వినిపించుకోదు. అత్తయ్య, మామయ్య మాట్లాడుకున్న తర్వాతే కారు కొనాలని కండిషన్ పెడుతుంది. అయితే.. వాళ్ల నాన్న తగ్గి అమ్మతో మాట్లాడితే.. మళ్లీ వాళ్ల అమ్మకు లోకువ అయిపోతాడని.. బాధగా ఉన్నా కూడా వాళ్లిద్దరూ మాట్లాడుకోకుండా ఉండటమే మంచిదని బాలు తన అభిప్రాయాన్ని చెబుతాడు. కానీ మీనా అంగీకరించదు.
‘ నిజానికి మనం పెట్టిన పంచాయతీ కారణంగానే ఇలా జరిగింది. నిజానికి మీ అన్నయ్య ఇలా చేసినందుకు రోహిణీకి కోపం రావాలి. కానీ వాళ్లిద్దరూ దులిపేసుకొని బాగానే ఉన్నారు. ఎటొచ్చి అత్తయ్య, మామయ్య ల మధ్య యుద్ధం మొదలైంది. నాకేదో తప్పు చేసినట్లుగా ఉందండి’ అని మీనా చెబుతుంది. ‘ సరే... నువ్వు చెప్పింది కూడా నిజమే, వాళ్లిద్దరూ మళ్లీ ఎప్పటిలాగా మాట్లాడుకోవాలి అంతే కదా.. ఆ విషయం నాకు వదిలేయ్’ అని బాలు.. మీనా చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. ఈ కార్లు ఎప్పటికైనా తానే కొంటానని..ఓనర్ కి చెప్పమని తన ఫ్రెండ్ రాజేష్ కి చెబుతాడు.
సీన్ కట్ చేస్తే... శ్రుతి.. డబ్బింగ్ చెబుతూ ఉంటుంది. అది కూడా హీరోయిన్ డెలివరీ పెయిన్స్ కి డబ్బింగ్ చెప్పాలి. చాలా ఎమోషనల్ గా ఉండే ఆ సీన్స్ కి డబ్బింగ్ చెబుతూ శ్రుతి ఏడ్చేస్తుంది. బిడ్డకు జన్మనివ్వడానికి ఒక తల్లి చాలా ఇబ్బంది పడుతుందని శ్రుతి బాధపడుతుంది. వెంటనే.. తన తల్లి గుర్తుకు వచ్చి ఫోన్ చేస్తుంది. ‘ మమ్మీ.. సారీ మమ్మీ’ అని అంటుంది. ‘ ఎప్పుడూ లేనిది సారీ ఎందుకు?’ అని వాళ్ల అమ్మ అడిగితే.. ‘ ముందు క్షమించాను అని చెప్పు’ అని అడుగుతుంది. ‘ నువ్వు ఏం తప్పు చేశావ్’ అని అడిగితే... ‘ నేను నీ పొట్ట లో నుంచి బయటకు వచ్చేటప్పుడు.. నువ్వు నన్ను కంటూ చాలా నొప్పిని భరించి ఉంటావ్ కదా, అప్పుడు నిన్ను బాధ పెట్టినందుకు ఇప్పుడు నీకు సారీ చెప్పాలని అనిపించింది’ అని చెబుతుంది. వాళ్ల అమ్మ ఏమైందని అడిగితే... డబ్బింగ్ విషయం చెబుతుంది. ‘ బిడ్డను కనేటప్పుడు నొప్పులు రావడం చాలా సహజం. కానీ.. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఆ నొప్పిని మర్చిపోతుంది. ఇవన్నీ మాట్లాడుతున్నావ్.. ఏదైనా గుడ్ న్యూస్ ఉందా?’ అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదని శ్రుతి చెబుతుంది.
రోహిణీ అలసటగా ఇంటికి వచ్చి.. కూర్చొంటుంది. మీనా వచ్చి ఒంట్లో బాలేదా.. కాఫీ ఇస్తాను అని అంటుంది. ఈ లోగా శ్రుతి కూడా ఇంటికి వస్తుంది. తొందరగా వచ్చావ్ ఏంటి అని రోహిణి అడుగుతుంది. శ్రుతి మరీ డల్ గా ఉండటంతో ఏమైందని రెట్టించి అడగడంతో... ‘ నేను వెళ్లి నొప్పులు పడాలి... వెరీ పెయిన్ ఫుల్ ’ అని సమాధానం ఇస్తుంది. ఆ మాటలకు షాక్ అయిన రోహిణీ, మీనా... వెంటనే శ్రుతిని కూర్చోపెట్టి... ‘ ఏం మాట్లాడుతున్నావ్?’ అని అడుగుతారు.
‘ నాకు భయంగా ఉంది’ అని శ్రుతి చెబుతుంది. ‘ ఎందుకు?’ అని మీనా అడిగితే.. ‘ ఆడ జన్మకు ఎన్ని కష్టాలో..’ అని బాధగా మాట్లాడుతుంది. మీనా గట్టిగా అరవడంతో... శ్రుతి నార్మల్ అయిపోతుంది. తర్వాత.. అసలు విషయం చెబుతుంది. సీరియల్ లో సీన్ కోసం.. డెలివరీ పెయిన్స్ కి డబ్బింగ్ చెప్పాను అని.. తాను చాలా ఇబ్బంది పడ్డాను అని చెబుతుంది. డెలివరీ టైమ్ లో ఇంత నొప్పులు ఉంటాయని ఇప్పుడే తెలిసిందని... ఇలా అయితే తాను పిల్లలను కనడం చాలా కష్టం అన్నట్లుగా శ్రుతి మాట్లాడుతుంది.
దానికి రోహిణి... ‘ నువ్వు కేవలం డెలివరీ పెయిన్స్ గురించే మాట్లాడుతున్నావ్.. కానీ ఆ 9 నెలలు కష్టంగానే ఉంటుంది. మొదటి 3 నెలలు వాంతులు చేసుకుంటూ ఉంటాం. కడుపులో వికారంగా ఉంటుంది. పోపు వాసన చూసినా వాంతు అయిపోతుంది. మాటి మాటికీ ఆకలి వేస్తుంది. పుల్లగా తినాలనిపిస్తుంది. కానీ, ఏదీ సహించదు. 6 నెలలు దాటితే నడవడం కూడా కష్టం. నడుము నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక నొప్పులు మొదలైతే మాత్రం.....’ అని చెబుతూ... మీనా, శ్రుతిలు అనుమానంగా చూడటం చూసి ఆపేస్తుంది. ఎందుకు అలా చూస్తున్నారు అని రోహిణి అడుగుతుంది. ‘ నువ్వేంటి? ఇవన్నీ నువ్వే ఎక్స్ఫీరియన్స్ చేసినట్లు.. నువ్వే నొప్పులు పడి బిడ్డను కన్నట్లు చెబుతున్నావ్’ అని శ్రుతి అడుగుతుంది. ‘ అంతక ముందు నువ్వు బిడ్డను కనలేదు కదా?’ అని మీనా కూడా అడుగుతుంది. వెంటనే రోహిణి తేరుకొని.. కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. శ్రుతి మాత్రం బిడ్డను కనాలి అంటేనే భయం వేస్తుంది అని చెబుతుంది.
దానికి మీనా.. ‘ అవన్నీ వదిలేయ్ శ్రుతి. తల్లి కావడం ఒక వరం. భయపడే విషయం కాదు. అది ఒక అందమైన అనుభూతి. బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఆ బిడ్డ బయటకు వస్తుందా అని.. ఆ తల్లి ఆరాటపడుతుంది. ఆ బిడ్డను చూసిన తర్వాత.. ఆ తృప్తి ముందు నొప్పులు ఒక లెక్క కాదు అని తల్లి అనుకుంటుంది. ఆ అనుభూతి గురించి బిడ్డను కన్న తల్లి మాత్రమే చెప్పగలదు’ అని చాలా గొప్పగా చెబుతుంది.
కట్ చేస్తే.... బాలు ఇంటికి వచ్చేస్తాడు. వస్తూ వస్తూ వాళ్ల నానమ్మ సుశీలమ్మను తీసుకొని వస్తాడు. వాళ్ల అమ్మ, నాన్నలను కలపడానికి ఆమెను తీసుకురావడం విశేషం. ఆమె లోపలికి వస్తుండగానే మీనా ఎదురు వస్తుంది.. ఆమె చాలా సంతోషిస్తుంది. తర్వాత లోపలికి వెళ్లి ప్రభావతిని పిలుస్తుంది. ఇలా సడెన్ గా ఎందుకు వచ్చారు? అని ప్రభావతి అడిగితే... ఇంట్లో సమస్యలు ఉన్నాయని తెలిసి వచ్చానని... అవి తీరే వరకు వెళ్లను అని చెబుతుంది. తన అత్తగారికి ఈ విషయం మీనా నే చెప్పింది అనుకొని ప్రభావతి కోపంగా చూస్తుంది... చెప్పింది తానే అని బాలు ఒప్పుకుంటాడు. ఇక సుశీలమ్మ రావడం రావడమే.... మనోజ్ బుద్ధి బయట పెట్టి ప్రభావతిని తిట్టి పెడుతుంది. తర్వాత తన కొడుకు సత్యం గురించి ఆరా తీస్తుంది. మేడపైన ఉన్నారు అని ప్రభావతి చెబితే... పిలవమని చెబుతుంది. ఆమె కదలకపోవడంతో... సుశీలమ్మ తానే మాట్లాడతాను అని డైరెక్ట్ గా మేడపైకి వెళ్తుంది.
మేడ మీద సత్యం చాలా బాధగా నిలపడి ఉంటాడు. సుశీలమ్మ వచ్చి పలకరించగానే.. ఆనందంతో పలకరిస్తాడు. వెంటనే ఆమె... ఇంట్లో జరిగిన గొడవ గురించి అడుగుతుంది. భార్యతో అలా మాట్లాడకుండా ఉంటే ఎలా అని ఆమె సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ సత్యం వినడు. ‘ నగలు తీసినందుకు కూడా నాకు బాధ వేయలేదు. కానీ, ఆ నిందను మీనా మీద, వాళ్ల అమ్మ మీద వేసింది.. అది నాకు నచ్చలేదు. తను తప్పు చేసి ఇంకొకరి మీద నింద వేస్తే ఎలాగమ్మా ’ అని సత్యం తన బాధను చెబుతాడు. అయితే.. భార్యతో సర్దుకుపోమ్మని నచ్చచెబుతుంది. అయితే.... పెళ్లి అయినప్పటి నుంచి భార్య కారణంగా తాను పడుతున్న బాధను సత్యం బయటపెడతాడు. మీనా కి ప్రభావతి క్షమాపణ చెబితేనే... ఆమెతో మాట్లాడతాను అని చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. కమింగ్ ఎపిసోడ్ లో ఈ సమస్యకు సుశీలమ్మ తీర్పు చెబుతుంది..