
ఈ సంవత్సరం తమిళనాట బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల జాబితా విడుదలైంది. శుక్రవారం విడుదలైన `మధరాసి` సినిమా తొలి రోజు ధనుష్ `కుబేర` సినిమా కంటే ఎక్కువ వసూళ్లు సాధించి తన రేంజ్ చూపించింది. ఈ జాబితాను సినీట్రాక్ వెబ్‌సైట్ విడుదల చేసింది. ఆ జాబితాలో ఏ సినిమాలు ఉన్నాయో చూద్దాం.
ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమా ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఏప్రిల్ నెలలో విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ.21.86 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ సినిమా బద్దలుకొట్టలేదు.
రజనీకాంత్ - లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన `కూలీ` సినిమా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ.21.63 కోట్లు వసూలు చేసింది. మొదటి స్థానాన్ని చేజార్చుకుని రెండో స్థానానికే పరిమితమయ్యింది.
ఈ జాబితాలో మూడో స్థానంలో కూడా అజిత్ సినిమానే ఉంది. ఎకె నటించిన `విడముయర్చి` సినిమా ఫిబ్రవరిలో విడుదలైంది. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తొలి రోజు రూ.19.3 కోట్లు వసూలు చేసింది.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన సూర్య చిత్రం `రెట్రో` ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. 2D నిర్మించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే రూ. 11.61 కోట్లు వసూలు చేసింది.
మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన `థగ్ లైఫ్` ఐదవ స్థానంలో ఉంది. శింబు, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్ వంటి భారీ స్టార్ తారాగణం నటించిన ఈ చిత్రం మొదటి రోజు రూ. 10.62 కోట్లు వసూలు చేసింది.
ఈ జాబితాలో శివ కార్తికేయన్ మూవీ `మదరాసి` కూడా చేరింది. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొదటి రోజు రూ. 9.92 కోట్లు వసూలు చేసి ఈ జాబితాలో 6వ స్థానంలో ఉంది.
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `డ్రాగన్`. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది విడుదలైన మొదటి రోజే తమిళనాడులో రూ. 4.52 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం 7వ స్థానంలో ఉంది.
ఈ జాబితాలో ధనుష్ `కుబేర` చిత్రం 8వ స్థానంలో ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నాగార్జున ప్రధాన పాత్రలో నటించగా, ఈ మూవీ తెలుగులో విజయవంతమైంది. కానీ తమిళనాట ఫ్లాప్ అయ్యింది. అక్కడ ఈ మూవీ మొదటి రోజే రూ. 3.46 కోట్లు వసూలు చేసింది. అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో 8వ స్థానంలో ఉంది.
ఆర్య నిర్మాణ సంస్థ, సంతానం ప్రధాన పాత్రలో నటించిన `DD నెక్స్ట్ లెవెల్`, ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. మేలో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రూ. 2.54 కోట్లు వసూలు చేసింది.
ఈ జాబితాలో `మదగజరాజా` చిత్రం 10వ స్థానంలో ఉంది. విశాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. ఈ సంవత్సరం పొంగల్ కు విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే రూ. 2.50 కోట్లు వసూలు చేసింది.