
అక్టోబర్ నెలాఖరుకి రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో ఒక ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఉండటం విశేషం. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన `బాహుబలిః ది ఎపిక్` ఈ వారమే విడుదల కానుంది. దీంతోపాటు మాస్ మహారాజా నటించిన `మాస్ జాతర` సైతం విడుదలవుతుంది. ఈ రెండు చిత్రాలు ఈ నెలాఖరులో వినోదాన్ని పంచేందుకు వస్తున్నాయి. ఆడియెన్స్ కి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని తీసుకురాబోతున్నాయి. వీటితోపాటు ఓ తమిళ మూవీ కూడా రిలీజ్ కానుంది. అయితే ఈ వారం రవితేజ, ప్రభాస్ మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. ఓ రకంగా మాస్ మహారాజాని డార్లింగ్ దెబ్బకొట్టేలా ఉన్నారు. అది ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
ఈ నెల 31న(శుక్రవారం) విడుదల కాబోతున్న సినిమాల్లో `బాహుబలిః ది ఎపిక్` ఉంది. బాహుబలి రెండు పార్ట్ లను కలిపి దీన్ని రూపొందించారు. `బాహుబలిః ది బిగినింగ్`, `బాహుబలిః ది కన్ క్లూజన్` చిత్రాలను ఒక్కటిగా మెర్జ్ చేశారు దర్శకుడు రాజమౌళి. దీంతో ఇది మూడు గంటల 44 నిమిషాలు వచ్చింది. ఇంతటి భారీ నిడివితో సినిమా రావడం ఇటీవల ఇదే మొదటి సారి అని చెప్పొచ్చు. యాడ్స్ తో కలిసి ఇది దాదాపు నాలుగు గంటలు ఉండబోతుంది. ఇక ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, అడవిశేషు వంటి వారు నటించిన విషయం తెలిసిందే. `బాహుబలి 2` ఏకంగా రూ.1800కోట్ల కలెక్షన్లని రాబట్టి ఇండియన్ సినిమాని షేక్ చేసింది. అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ రెండు పార్ట్ లను కలిపి ఒక్క మూవీగా విడుదల చేస్తుండటంతో, దీనిపై క్యూరియాసిటీ నెలకొంది. సినిమా బాగా ఆడితే ఇది `దంగల్` రికార్డులను బ్రేక్ చేయబోతుందని చెప్పొచ్చు. మరి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇక శుక్రవారమే(అక్టోబర్ 31న) మాస్ మహారాజా రవితేజ నటించిన `మాస్ జాతర` విడుదల కానుంది. భాను బోగవరపు అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా చేసింది. `ధమాఖా` తర్వాత మరోసారి ఈ జంట నటించారు. `ధమాఖా` తర్వాత రవితేజకి హిట్ పడలేదు. ఆ హిట్‌ని ఈ మూవీతో రిపీట్ చేయబోతున్నారనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి. ఇది పూర్తి మాస్, కమర్షియల్ మూవీగా రాబోతుందని టీజర్‌ని చూస్తే అర్థమవుతోంది. నేడు(సోమవారం) మధ్యాహ్నం ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంపై మంచి బజ్ ఉంది. ట్రైలర్‌తో ఆ బజ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఏ సర్టిఫికేట్‌ని పొందింది. ప్రధానంగా ఈ శుక్రవారం `బాహుబలిః ది ఎపిక్`, `మాస్ జాతర` మధ్య పోటీ ఉండబోతుంది. అయితే రవితేజని ప్రభాస్ దెబ్బకొడతాడా? అనేది చూడాలి.
ఇక ఇదే రోజు రాబోతున్న మరో మూవీ `ఆర్యన్`. తమిళంలో రూపొందిన చిత్రమిది. విష్ణు విశాల్ హీరోగా నటించారు. ప్రవీణ్ కె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, మానస చౌదరీ హీరోయిన్లుగా నటించారు. విష్ణు విశాల్ స్టూడియో నిర్మించిన ఈ మూవీ ఈ నెల 31న తమిళంతోపాటు తెలుగులో విడుదల కాబోతుంది. సీరియల్ కిల్లర్ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.