
ఈ వారం థియేటర్లోకి పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి. అయితే ఈ వారం పెద్ద సినిమాలు లేవు. మిడిల్ బడ్జెట్ చిత్రాలే ఉన్నాయి. వాటిలో రష్మిక మందన్నా నటించిన మూవీ హడావుడి ఎక్కువగా ఉంది. ఆమెతోపాటు సుధీర్ బాబు బాలీవుడ్ లో నటించిన సినిమా అదే రోజు తెలుగు, హిందీలో రిలీజ్ కాబోతుంది. వీటితోపాటు మరో మూడు చిన్న సినిమాలు ఈ వారం ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నాయి. ఆ సినిమాల వివరాలు తెలుసుకుందాం.
ఈ నవంబర్ 7న మెయిన్‌గా రాబోతున్న సినిమా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన `ది గర్ల్ ఫ్రెండ్` ఉంది. ఇది లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందింది. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దీన్ని రూపొందించారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఇందులో `దసరా` ఫేమ్ దీక్షిత్ శెట్టి రష్మిక మందన్నాకి జోడీగా నటించారు. వీరిద్దరు ప్రేమలో పడటం, విడిపోయేందుకు స్ట్రగుల్ అవడం అనే కాన్సెప్ట్ తో రూపొందినట్టుగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే లవర్స్ ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదనేది చెప్పే మూవీ అవుతుందని, ఆ మధ్య ట్రైలర్ ఈవెంట్‌లో టీమ్ తెలిపింది. దీంతో ఈ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి సంయుక్తంగా నిర్మించారు. పాన్ ఇండియా సినిమాలతో సందడి చేసిన రష్మిక మందన్నా ఈ మూవీతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న మరో ప్రామిసింగ్ మూవీ `జటాధర`. సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రమిది. ఇందులో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించింది. మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రంతో సోనాక్షి సిన్హా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. హిందీ, తెలుగులో సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ గా `జటాధర`ని రూపొందించారు. పాన్-ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాకి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ నెల 7న ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. కంటెంట్ పరంగా ఆకట్టుకునేలా ఉంది. కానీ సినిమాకి బజ్ లేకపోవడం గమనార్హం.
వీటితోపాటు మరో రెండు చిన్న సినిమాలున్నాయి. వాటిలో ప్రధానంగా ఆసక్తిని క్రియేట్ చేస్తోన్న మూవీ `ది గ్రేటెస్ట్ ప్రీ వెడ్డింగ్ షో`. `మసూద` ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రమిది. ఆద్యంతం కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపొందింది. ఇందులో టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటించింది. రాహుల్ శ్రీనివాస్ దర్శకుడు. 7పీఎం ప్రొడక్షన్స్, పప్పెట్ షోస్ పతాకాలపై అగరం సందీప్, అష్మిత రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు ట్రెండ్ అయ్యింది. ఆ షూట్ విషయంలో చోటు చేసుకున్న కామెడీనే ఈ మూవీగా ఉంటుందని తెలుస్తోంది. ఈ నెల 7న చిన్న చిత్రాల్లో ఇది ఆసక్తికరంగా మారింది. మరి ఏ మేరకు నవ్విస్తుందో చూడాలి.
అనేక సినిమాల్లో బాల నటుడిగా నటించిన సాత్విక్ వర్మ హీరోగా నటిస్తోన్న మూవీ `ప్రేమిస్తున్నా`. ఇందులో ప్రీతి నేహా హీరోయిన్‌గా నటించింది. భాను దర్శకత్వంలో వరలక్ష్మి పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మించిన చిత్రమిది. సరికొత్త టీనేజ్ లవ్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కింది. ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీ ఈ నెల 7న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
ఇదే రోజు రాబోతున్న మరో మూవీ `ఆర్యన్`. తమిళంలో రూపొందిన చిత్రమిది. ఇందులో విష్ణు విశాల్ హీరోగా నటించారు. ప్రవీణ్ కె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, మానస చౌదరీ హీరోయిన్లుగా నటించారు. విష్ణు విశాల్ స్టూడియో నిర్మించిన ఈ మూవీ ఈ నెల 31న తమిళంతో విడుదల అయ్యింది. అక్కడ మిశ్రమ స్పందన రాబట్టుకుంది. సీరియల్ కిల్లర్ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాని ఈ నెల 7న తెలుగులో విడుదల చేయబోతున్నారు. మరి తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా అనేది చూడాలి. ఇలా ఈ వారం ఐదు సినిమాలు ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేయబోతున్నాయి. ఐదు డిఫరెంట్ జోనర్ మూవీస్ ఉండటం విశేషం.