
కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌పై నిర్మించిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ మూవీకి తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామా మంచి విజయాన్ని అందుకుంది. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నటుడు ప్రదీప్ కొట్టె తన సినీ జర్నీ గురించి విశేషాలను పంచుకున్నారు. ఆయన ఇందులో టీవీ కొనుక్కొచ్చిన రాజప్ప పాత్రలో నటించాడు. ఆయన పాత్ర బాగా హైలైట్ అయ్యింది. ఆయన పాత్ర హీరోకి ఏమాత్రం తక్కువ కాదని చెప్పొచ్చు.
ఈ సినిమా సక్సెస్‌తో ప్రదీప్ కి మంచి పేరొచ్చింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్రదీప్ మాట్లాడుతూ, మాది చిత్తూరు జిల్లా పళమనేరు. చెన్నైలో జాబ్ చేశాను. హైదరాబాద్‌కి వచ్చాక షార్ట్ ఫిల్మ్స్ అంటూ యాక్టింగ్ వైపు వచ్చాను. బీ స్టూడియోలో బషీర్ మాస్టర్ నేతృత్వంలో నాటకాలు వేశాను. ఆ నాటకాల్ని మా డైరెక్టర్ వి.మునిరాజుగారు చూసి `తిమ్మరాజుపల్లి టీవీ` మూవీలో రాజప్ప పాత్ర ఇచ్చారు. దీనికి కిరణ్ అబ్బవరం నిర్మాత అని తెలియగానే చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. సినిమాలో రాజప్ప పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. అందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. నాకు తొలి సినిమా, అవకాశం అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ సినిమాలు చేశాను కానీ.. తొలి ఫీచర్ ఫిల్మ్, మొదటి సారిగా స్క్రీన్ మీద కనిపించింది ఈ చిత్రంలోనే.
నేను నా జాబ్ చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాను. `వర్క్ ఫ్రమ్ హోం`, `లీవ్స్` అనే సినిమాని కూడా మ్యానేజ్ చేశాను. నేను పూర్తి స్థాయిలో ప్రయత్నించలేకపోవడంతోనే ఇంత ఆలస్యం అయి ఉంటుందని భావిస్తున్నాను. గత పదేళ్ల నుంచి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నాను. అలాగే నా కుటుంబం నుంచి మంచి సపోర్ట్ దొరికింది. ముఖ్యంగా నా భార్య ఇచ్చిన మద్దతు మరచిపోలేను. ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఆమె చూసుకోవటం వల్ల నేను కెరీర్‌లో ఓ వైపు జాబ్ చేస్తూ మరో వైపు సినిమాలపై ఫోకస్ పెట్టాను.
నాకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. కానీ నాకు ఇదొక ప్యాషన్ అని తెలీదు. ఇంజనీరింగ్ టైంలో ఓ షార్ట్ ఫిల్మ్ చేశాను. నాకు నటన మీద ఇంట్రెస్ట్ ఉందని అప్పుడు అర్థమైంది. అయితే మేం షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలోనే కిరణ్ అబ్బవరం గారు నాకు తెలుసు. నేను ఒక ఆర్టిస్ట్ అని ఆయనకు కూడా తెలుసు. ఆయన ప్రతీ ఒక్క క్రాఫ్ట్ మీద పట్టు సాధించి ఈ స్థాయికి వచ్చారు. నాకు ఈ పదేళ్ల అనుభవంలో కెమెరా భయం అనేది పోయింది. కెమెరా ముందు ఎలా నటించాలి అన్న విషయం తెలిసింది. డైలాగ్ డెలివరీ, డిక్షన్ అనేది థియేటర్ డ్రామాలో తెలిసింది. ఒకే నాటకంలో గంటన్నర పాటుగా ఐదు పాత్రలను పోషించాను.
ఈ మూవీలో సాయి తేజ్, లతీష్ ఇలా చాలా మంది నటించిన పాత్రలు నాకు ఇష్టం. చాలా వరకు అందరూ సింగిల్ టేక్స్‌లోనే నటించారు. ప్రతీ ఒక్క పాత్ర ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అదొక మెమొరబుల్ మూమెంట్. నేను యాక్టింగ్ సైడ్ ఉన్నానని మా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. కాస్తో కూస్తో మా అక్కకి తెలుసంతే. మా అమ్మనాన్నలకు చెప్పకుండా షూటింగ్‌కి తీసుకు వచ్చింది మా అక్క. అలా మా పేరెంట్స్‌ని అలా చూడటం, వారు నన్ను అలా చూడటం అదొక మెమరబుల్ మూమెంట్. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నాను. కాస్త ఇంపార్టెంట్ ఉన్న పాత్రలే పోషించాలని వెయిట్ చేస్తున్నాను. అవకాశాలు వస్తున్నాయి కదా? అని ఏదో ఒకటి చేయాలని అనుకోవడం లేదు` అని తెలిపారు ప్రదీప్.