
దర్శకధీరుడు రాజమౌళి భారతీయ సినిమా దశ దిశని మార్చిన దర్శకుడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేవుడిని నమ్మను అని ఆయన చాలా సందర్భాల్లో బహిరంగంగానే స్టేట్‌మెంట్ ఇచ్చారు. కానీ `వారణాసి` ఈవెంట్‌లో ఆయన చేసిన ఈ కామెంట్స్ వివాదంగా మారాయి. `వారణాసి` ట్రైలర్‌ని ప్రదర్శించడానికి టెక్నికల్‌గా సమస్యలు రావడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. నాన్న (విజయేంద్రప్రసాద్) హనుమంతుడిని నమ్ముతాడు. నా భార్య హనుమంతుడి భక్తురాలు. దేవుడు మన వెనకాల ఉండి నడిపిస్తాడని అంటారు. ఇదేనా నడిపించేదని కోపం వచ్చిందని తెలిపారు రాజమౌళి. ఈ కామెంట్స్ పెద్ద వివాదంగా మారాయి.
వానరసేన వంటి హిందుత్వ సంస్థలు దీన్ని సీరియస్‌గా తీసుకుని రచ్చ చేస్తున్నాయి. రాజమౌళిపై కేసులు కూడా పెట్టారు. పలువురు బీజేపీ నాయకులు రాజమౌళి కి వార్నింగ్ ఇచ్చారు. దేవుడిపై సినిమాలు చేస్తూ దేవుడినే అవమానిస్తావా? అంటూ మండిపడుతున్నారు. దీంతో ఈ వివాదం గట్టిగానే నడుస్తోంది. అయితే ఇది మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తోన్న `వారణాసి`పై ఎలాంటి ప్రభావం పడుతుందనేది చూడాలి. ఈ మూవీ రావడానికి ఇంకా రెండేళ్లు ఉంది. కాబట్టి అప్పటి వరకు జనం ఈ విషయాన్ని మర్చిపోయే అవకాశం ఉంది.
ఈ క్రమంలో దేవుడికి సంబంధించిన గతంలో రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏబీఎన్ రాధాకృష్ణతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో ఆయన దేవుడిపై మాట్లాడుతూ, తాను దేవుడుని నమ్మను అని, కానీ గుడికి వెళ్తానని, అక్కడ ప్రశాంతంగా కాసేపు కూర్చోవాలని అనిపిస్తుందని తెలిపారు. తాను 4 యోగాల్లో భక్తి యోగాన్ని నమ్ముతానని, కర్మయోగంలో చెప్పినట్టుగా తాను పనిచేసుకుంటూ వెళ్తానని పేర్కొన్నారు. ఇందులో ఆయన ఇంకా మాట్లాడుతూ, మా అమ్మ, నాన్నకి దేవుడిపై చాలా నమ్మకం. మా నాన్న ఇలా చేయు, అలా చేయమని ఏవేవో పద్ధతులు చెబుతుంటాడు. కానీ నేను వినను. మా అమ్మ చెబితే చేస్తాను, కానీ అమ్మ చెప్పదు. బాబుని అప్పుడప్పుడు మంత్రాలయంకి తీసుకెళ్లు అని మా వైఫ్‌కి ఒకసారి చెప్పింది. అమ్మ చెప్పింది కాబట్టి అప్పుడప్పుడు మంత్రాలయం వెళ్తుంటాను` అని తెలిపారు రాజమౌళి.
అదే సమయంలో తన మెడలో ఉన్న వినాయకుడి లాకెట్ 15ఏళ్ల క్రితం తనకు వదిన ఇచ్చిందని చెప్పారు. రాజమౌళి ఇంకా చెబుతూ, `హిందూ ధర్మంలోనే మనకు, జంతువులకు మధ్య తేడా ఉంది. మనిషిగా పుట్టామంటే మన జీవితానికి ఒక అర్థం ఉండాలి, ఏదో చేయాలి. మన హిందూ ధర్మంలో సంపూర్ణమైన జీవితానికి నాలుగు యోగాలు సూచించారు. కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞాన యోగం. ఇందులో ఒక్క భక్తియోగంలోనే దేవుడు ఉన్నాడు, మిగిలిన యోగాల్లో దేవుడు లేడు. హిందూ ధర్మంలోనే నాస్తికత్వం ఉందనేది నా ఉద్దేశ్యం. దీంతో కర్మయోగాన్ని నమ్ముకుని మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి. గుడులు కమర్షియల్, అందులో డబ్బులు పెట్టడం, కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు అడగడం, దానికో రేట్, దీనికో రేట్ ఇలా ప్రతిదీ కమర్షియల్ గా నడుస్తుంది. అదొక పెద్ద బిజినెస్ అయ్యింది. అందుకే భక్తి రాదు. ఇప్పుడు కూడా దేవుడిపై నమ్మకం లేకపోయినా ఎవరూ లేనప్పుడు గుడిలో వెళ్లి కూర్చుంటాను, అది చాలా బాగుంటుంది. ఒకసారి మా అన్నయ్య శ్రీశైలం సమీపంలోని బసవేశ్వర ఆలయానికి తీసుకెళ్లారు. సాయంత్రం సమయంలో వెళితే గుడిలో ఎవరూ లేరు, పక్కన నది ప్రవహిస్తుంది, మైక్‌లో మా అన్నయ్య(కీరవాణి) కంపోజ్ చేసిన భక్తి ప్రవచనాలు సన్నగా వినిపిస్తున్నాయి. అవి వింటుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. అలాంటి వాతావరణాన్ని కోరుకుంటాను` అని తెలిపారు రాజమౌళి.
ప్రస్తుతం రాజమౌళిపై వివాదం నడుస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఇందులోనూ ఆయన దేవుడిని నమ్మను అనే చెప్పాడు, గుడి కమర్షియల్‌గా మారిందని, భక్తి అనేది ఇప్పుడు కమర్షియల్‌గా మారిపోయిందనడం గమనార్హం. ఇక మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తోన్న `వారణాసి` నుంచి టైటిల్ గ్లింప్స్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది విజువల్ వండర్‌గా ఉంది. రామాయణంలోని ఒక ఘట్టాన్ని ప్రధానంగా చేసుకున ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు రాజమౌళి తెలిపారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది. ఇందులో నాలుగు కాలాలను చూపించారు. ఈ నాలుగు కాలల్లోకి మహేష్ ప్రయాణిస్తాడని, ఆయన జర్నీ ప్రధానంగా చేసుకుని ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. ఇందులో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. దాదాపు రూ.1200కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు రాజమౌళి. అంతేకాదు కనీవినీ ఎరుగని రీతిలో సినిమాని విడుదలకు కూడా ప్లాన్ చేస్తున్నాడట.