తెలుగు జంట నందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ చాలాకాలంగా యూకేలో ఉంటున్నారు. ‘Nandu’s World’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు నందన.. ఇందులో తమ కుటుంబ విశేషాలు, లైఫ్‌స్టైల్ కంటెంట్ అందిస్తూ తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఛానల్‌కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు… మిలియన్స్ కొద్ది వ్యూస్ ఉన్నాయి. ఇలా యూట్యూబ్ ద్వారా వచ్చిన గుర్తింపుతో నందన ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్' సినిమాలో ఛాన్స్ పొందారు… తనదైన డైలాగ్స్ లో కామెడీ పండించారు
అయితే నందన, మధుకర్ దంపతులు తమకు యూట్యూబ్ ద్వారా వచ్చిన గుర్తింపును అమాయకులను మోసగించేందుకు కూడా వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతను యూకే ఉద్యోగాలు, వీసా రెన్యూవల్స్, Certificate of Sponsorship (CoS) ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఈ వ్యవహారంలో పోలీస్ కేసులు నమోదయ్యాయి... కీలకంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు ఉంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి యూకే వీసా రెన్యూవల్, తన భార్యకు CoS, ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ ద్వారా మధుకర్‌ను సంప్రదించినట్లు ఫిర్యాదు చేశారు. ఇందుకోసం సుమారు రూ.15 లక్షలు చెల్లించినట్లు ఆయన ఆరోపించారు. అయితే హామీ ఇచ్చిన సేవలు అందలేదని, తనకు ఇచ్చిన CoS కూడా నకిలీదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో మధుకర్‌తో పాటు రమా నందన, మధుకర్ తండ్రి మోహన్‌రావు పేర్లు కూడా ప్రస్తావించారు.
ఇదే సమయంలో ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ మరికొందరు వ్యక్తులు ఇదే తరహాలో డబ్బులు చెల్లించి మోసపోయామని ఆరోపణలు చేశారు. ఒక్కొక్కరి వద్ద రూ.15-20 లక్షలు వసూలు చేసినట్లు.. మొత్తంగా కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల దర్యాప్తులో భాగంగా నందన, మధుకర్‌పై లుక్‌అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. విదేశాల్లో ఉండే నిందితులు భారత్‌కు వచ్చినప్పుడు వారిని గుర్తించి సంబంధిత దర్యాప్తు సంస్థలకు అప్పగించేందుకు LOC ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలోనే నందన హైదరాబాద్‌కు చేరుకున్న సమయంలో విమానాశ్రయంలో ఆమెను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.