
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు అస్సలు ఊహించలేం, వారు చేసే పాత్రలు కూడా కాస్త విచిత్రంగానే ఉంటాయి. హీరోల సరసన ఆడిపాడిన హీరోయిన్లు.. అదే హీరోకు తల్లి పాత్రలు చేయడం వింతగా ఉంటుంది. కాని కొన్నిసందర్భాల్లో ఒకే హీరోయిన్ ఇద్దరు హీరోలకు తల్లిగా భార్యగా నటించిన సందర్భాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవ, బాలయ్య ఈ ఇద్దరికి అటువంటి రేర్ కాంబినేషన్ ఎదురయ్యింది. అటు చిరంజీవి సినిమాలో, ఇటు బాలకృష్ణ సినిమాలో స్టార్ హీరోలకు తల్లిగా, భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో కాదు టబు.
ముందుగా నటసింహం బాలయ్య విషయానికి వస్తే బాలకృష్ణ ప్రస్తుతం 65 ఏళ్ల వయస్సులో కూడా మాస్ ఇమేజ్ తో, వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య.. డబుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నాడు. మరో రెండు సినిమాలు హిట్ అయితే బాలయ్య కెరీర్ లో డబుల్ హ్యాట్రిక్ రేర్ రికార్డ్ నమోదు అవుతుంది. హిందూపురం ఎమ్మెల్యేగా కూడా బాలయ్య హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి డైరెక్షన్ లో అఖండ పార్ట్ 2 సినిమాను చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి భారీ అప్ డేట్ ను కూడా అందించబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక బాలయ్య కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. బాలకృష్ణ సరసన నటించి స్టార్ హీరోయిన్లు అయినవారు కూడా ఉన్నారు. అయితే ఒక హీరోయిన్ కు మాత్రమే బాలకృష్ణ కు తల్లిగా, భార్యగా నటించే అవకాశం వచ్చింది. ఆమె మరెవరో కాదు టబు. అవును 2002 లో రిలీజ్ అయిన చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. ఫ్యాక్షనిస్ట్ తండ్రి, పోలీస్ కొడుకు పాత్రలో బాలయ్య డబుల్ యాక్టింగ్ అదరగొట్టారు. ఈక్రమంలో సీనియర్ బాలయ్య భార్యగా, జూనియర్ బాలయ్య తల్లిగా టబు అద్భుతంగా నటించారు. ఇక ఈసినిమాలో మరో హీరోయిన్ గా శ్రియా శరణ్ మెప్పించారు. వివి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్య.. బాలయ్య ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది.
ఇక మెగాస్టార్ విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. చిరంజీవి 45 ఏళ్ళ మూవీ కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో ఆడి పాడారు. చిరంజీవితో నటించి ఇండస్ట్రీలో సెటిల్ అయిన హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. రాధిక, విజయశాంతి లాంటి తారలు అయితే ఒక్కొక్కరు 20కి పైగా సినిమాల్లో మెగాస్టార్ జోడీగా నటించి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇలా చిరంజీవి సరసన ఎంతో మంది హీరోయిన్లు నటించినా.. అతి తక్కువ సినిమాలు చేసింది మాత్రం టబునే. అయితే చేసిన ఒక్క సినిమాలో మాత్రం ఆమె చిరంజీవికి భార్యగా, తల్లిగా నటించారు. ఆసినిమా ఏదో కాదు అందరివాడు. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలు మెగాస్టార్ డబుల్ రోల్ చేశారు. తండ్రీ కొడుకులుగా నటించిన ఈమూవీలో తండ్రికి టబుతో రెండో పెళ్లి చేస్తాడు కొడుకు పాత్రలో ఉన్న చిరంజీవి. దాంతో టబు తన తల్లి స్థానంలోకి వస్తుంది. అలా అందరివాడు సినిమాలో సీనియర్ చిరంజీవి భార్యగా, జూనియర్ చిరంజీవి పిన్నిగా టబు నటించిమెప్పించారు.
ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. కొన్నిరోజుల్లో 70వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్న చిరంజీవి, ఈ వయసులో కూడా ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా సినిమాల కోసం కష్టపడుతున్నారు. యాక్టింగ్, యాక్షన్, డాన్స్ అన్ని విషయాలలో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో ఆయన నటించిన విశ్వంభర సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈసినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ఈసినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు టీమ్. ఇక తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కామెడీ యాక్షన్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిరు. ఈసినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. రీసెంట్ గా ఈ విషయంలో అనిల్ రావిపూడి అప్ డేట్ కూడా ఇచ్చారు.