ప్రతి ఒక్క నటుడికి కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి. ఎప్పటికైనా ఆ పాత్రల్లో నటించాలని కలలు కంటుంటారు. కొందరు నటులు తమ కలని సాకారం చేసుకుంటారు. కొందరికి వారి డ్రీమ్ ప్రాజెక్టులు కలగానే మిగిలిపోతాయి. సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించారు. ఆయన చేయని ప్రయోగం, సాహసం అంటూ లేదు. కౌబాయ్, జేమ్స్ బాండ్ , పౌరాణికం, జానపదం ఇలా సూపర్ స్టార్ కృష్ణ అన్ని రకాల జోనర్స్ లో నటించారు.
25
కలగానే మిగిలిపోయిన చిత్రం
కానీ సూపర్ స్టార్ కృష్ణకి కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కలగానే మిగిలిపోయింది. ఆ చిత్రంలో ఎలాగైనా నటించాలని కృష్ణ అనుకున్నారు. ఆ ప్రాజెక్టు ప్రారంభిస్తే చాలా భారీ చిత్రం అవుతుంది. దీంతో వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి ఆ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ నటించలేకపోయారు. సూపర్ స్టార్ కృష్ణ నటించాలనుకున్న డ్రీమ్ రోల్ మరేదో కాదు.. ఛత్రపతి శివాజీ. ఆ చిత్రంలో కనుక సూపర్ స్టార్ కృష్ణ నటించి ఉంటే హిస్టారికల్ మూవీ అయి ఉండేది. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి ఎంతటి అద్భుతం చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
35
ఛత్రపతి శివాజీ పాత్రలో..
అప్పటి బడ్జెట్ పరిమితుల దృష్ట్యా కృష్ణ 'శివాజీ' చిత్రాన్ని వాయిదా వేస్తూ వచ్చారట. ఓ దశకు వచ్చాక ఇక ఈ వయసులో అంత పెద్ద చిత్రంలో నటించడం సాధ్యం కాదని కృష్ణ భావించారు. కృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. నేను చేయాలనుకుని నటించలేకపోయినా పాత్రల్లో ఛత్రపతి శివాజీ ఒకటి. ఈ వయసులో ఆ చిత్రంలో నటించడం ఇక సాధ్యం కాదు అని అన్నారు.
వెంటనే యాంకర్ ప్రశ్నిస్తూ.. మహేష్ బాబు ఛత్రపతి శివాజీ పాత్రలో నటిస్తే ఎలా ఉంటుంది అని సూపర్ స్టార్ కృష్ణని ప్రశ్నించారు. కృష్ణ వెంటనే సమాధానం ఇస్తూ.. అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఆ చిత్రంలో నటించాలనే ఆసక్తి మహేష్ బాబుకి ఉండాలి అని అన్నారు.
55
చారిత్రాత్మక చిత్రాలకు క్రేజ్
చత్రపతి శివాజీ పాత్ర పై బాలీవుడ్ లో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. ఇటీవల హిందీలో శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ పాత్ర నేపథ్యంలో ఛావా అనే చిత్రం రూపొంది ఘన విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ అయింది. ఈ మూవీలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. ప్రస్తుతం చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంలో నటిస్తున్నాడు. భవిష్యత్తులో మహేష్ బాబు ఏదైనా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రంలో నటించే అవకాశం ఉందేమో చూడాలి.