
నేచురల్ స్టార్ నాని మాస్ లుక్‌లోకి మారి చేసిన చిత్రం `ది ప్యారడైజ్. నానికి జోడీగా కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. `యేషనాగుల` పాటలో కీర్తిసురేష్ మెరిసిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది. అయితే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. ప్రారంభంలో టీజర్ వచ్చింది. కానీ ట్రైలర్ రిలీజ్ చేయలేదు. టైమ్ లేక రిలీజ్ చేయలేదని ఇటీవల తెలిపారు. డైరెక్ట్ గా మూవీని థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయాలని తెలిపారు నాని, దర్శకుడు.
ఈ క్రమంలో సినిమాపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. కంటెంట్ విషయంలో అనుమానంతోనే ట్రైలర్ రిలీజ్ చేయలేదని, సినిమాలో చాలా వరకు రీషూట్లు చేశారనే విమర్శలు వచ్చాయి. అంతేకాదు స్టేజ్‌పై దర్శకుడు శ్రీకాంత్ ఓడెలపై నాని చేసిన కామెంట్స్ కూడా పెద్ద రచ్చ అయ్యాయి. దర్శకుడికి టైమ్ మేనేజ్‌మెంట్ లేదని, తాను రాజమౌళి వద్ద అసిస్టెంట్‌గా జాయిన్ అవ్వాలనుకుంటున్నట్టు దర్శకుడు చెప్పినట్టు తెలిపారు. ఇది దర్శకుడికి పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. ఆయనపై ఈ కామెంట్స్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు శ్రీకాంత్ ఓడెల స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ అన్ని విషయాలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
`ప్యారడైజ్` మూవీకి స్ఫూర్తి అనే విషయంపై మాట్లాడుతూ, ఈ కథకు నిజ జీవిత సంఘటన, కొన్ని పాత్రలు, అలాగే ఫిక్షన్.. ఈ మూడు ఉన్నాయని తెలిపారు. `మా అమ్మగారు ఆడపిల్ల పుడితే బాగుంటుందని భావించారు. కానీ పుట్టలేదు. నాకే జడలు వేసి, గౌన్ వేసి పెంచారు. నా రెండో క్లాస్ వరకు నాకు జడలు ఉండేవి. జడలు అక్కడి నుంచి తీసుకున్నాను. దీని వెనుక కూడా చాలా ఎమోషన్ ఉంటుంది. ఇందులో ఉండే రెవల్యూషన్, ఆ పాత్రలను నేను పుట్టి పెరిగిన గోదావరిఖని ప్రాంతం నుంచి స్ఫూర్తి పొందినవి. ఆదిలాబాద్, గోదావరిఖని ప్రాంతాల మధ్యలో జరిగిన సంఘటనలు తీసుకున్నాను. అలాగే నేను ఎక్కువగా సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్‌లో ఉన్నాను. ఆ పక్కన ఉండే బస్తీలో జరిగే కథలాగా డిజైన్ చేశాను. మా ఊర్లో నేను చూసిన సంఘటనలన్నీ మళ్లీ ఇక్కడ నాకు కనెక్ట్ అయ్యాయి` అని తెలిపారు.
నానితో ఈ మూవీ చేయడంపై రియాక్ట్ అవుతూ, `దసరా`ని ఒక మంచి డ్రామాగా చేయాలనేది నా ఉద్దేశం. కాకపోతే ప్రమోషనల్ కంటెంట్ చూసి అదొక ‘కేజీఎఫ్’లా చాలా మాస్‌గా ఉంటుందని అనుకున్నారు. థియేటర్‌లోకి వెళ్లి చూసిన తర్వాత ప్యూర్ డ్రామా ఉంది. ఆ విషయంలో కొంచెం డిజప్పాయింట్ అయ్యారని నాకు ఫీడ్‌బ్యాక్ వచ్చింది. కాకపోతే రెండు రోజుల తర్వాత దానికి ట్యూన్ అయిపోయారు. సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది. రికార్డ్స్ వచ్చాయి. అప్పుడు ఆడియన్స్ కోరుకునేది తీస్తే అది కమర్షియల్‌గా హై ఫీల్ అవుతారు కదా అని అనిపించి, అలా నాని గారి దగ్గరికి వెళ్లి ఈ ఆలోచన చెప్పాను. ఆడియన్స్ కోరుకునేది ఇవ్వాలని ఉద్దేశంతో ఇప్పుడు ‘ప్యారడైజ్’ తీసుకొస్తున్నాం. `ప్యారడైజ్`లో యాక్షన్, ఎమోషన్స్, మదర్ అండ్ సన్ ఎమోషన్ అన్నీ కూడా బ్లెండ్ అయి ఉంటాయి. అయితే యాక్షన్ కంటే ఎమోషన్ డామినేట్ చేస్తుందని భావిస్తున్నాను. ఆడియన్స్ ఈ సినిమా చూసినప్పుడు ఎమోషన్‌కు చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతారు` అని వెల్లడించాడు దర్శకుడు శ్రీకాంత్.
ట్రైలర్ ఇవ్వకపోవడం వెనుక కారణం చెబుతూ, `ముందే చెప్పినట్టు ఆ ట్రైలర్ కట్ చేయడానికి చాలా సమయం కావాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత సమయం ట్రైలర్ కి కేటాయించలేం. మనం చిన్నప్పుడు ఏమీ చూడకుండానే థియేటర్‌లోకి వెళ్లి ప్రతి మూమెంట్‌కు సర్‌ప్రైజ్ అయ్యేవాళ్లం. నాకు పర్సనల్‌గా అలా నేరుగా థియేటర్‌కి వెళ్లి సర్‌ప్రైజ్ అవ్వడమే ఇష్టం. నా నెక్స్ట్ సినిమాకి సాధ్యమైనంత తక్కువ అప్‌డేట్స్‌తోనే సినిమాని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాను. నేను ఏదైనా మనస్ఫూర్తిగా, నేను అనుకున్నది వచ్చేంతవరకు చేస్తాను. ఈ విషయంలో మా టీంను ఇబ్బంది పెట్టాను. నేను అనుకున్న షాట్ వచ్చేంతవరకు వందసార్లు అయినా తీస్తాను. కానీ ఒకసారి ఓకే అయిన తర్వాత మళ్లీ రీషూట్ జోలికి వెళ్లను. నేను అనుకున్న విధంగా షూట్ చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. దాని కారణంగా డేస్ పెరిగాయి. ఒకరోజు టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్‌లో ఫినిష్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఆ టార్గెట్ ఫినిష్ చేయలేకపోయాను. దానివల్ల మళ్లీ అందరి డేట్స్ అడ్జస్ట్ చేసి చేయాల్సి వచ్చింది. అంతేగానీ కంటెంట్, రీషూట్ అనేది సమస్య కాదు. ఈ సినిమా కోసం ఎక్కడా రీషూట్‌లు చేయలేదు. అలాగే మొదట ఏదైతే బౌండ్ స్క్రిప్ట్ అనుకున్నానో దాని ప్రకారమే చేశాను` అని చెప్పారు.
నాని గురించి చెబుతూ, `నాని గారు, నేను అన్నదమ్ముల్లాగే మాట్లాడుకుంటాం. నాకు దర్శకుడిగా జీవితం ఇచ్చారు. ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడూ ఉంటుంది. ఆయనతో నేను ప్రతిదీ చెప్తాను. నాని అన్నకి రెండు జడల లుక్ చెప్పినప్పుడు టీమ్ మొత్తం వద్దన్నారు... కానీ అన్న ఒక్కడే నమ్మాడు. సినిమాలో ఆ జడలే నాని అన్న క్యారెక్టర్ ఆయుధం.. యాక్షన్ సీక్వెన్స్‌లలో అవి తిరుగుతుంటే గూస్‌బంప్స్ గ్యారెంటీ. ఈ కథకి మోహన్‌బాబు పాత్ర చాలా కీలకం. మోహన్ బాబు గారు, నాని గారి క్యారెక్టర్స్ ఫేస్ ఆఫ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. దానికి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. అలాంగే సంపూ హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. సంపూర్ణేష్ బాబు పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. ఆయన్ని కొత్తగా చూస్తారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో పని చేయడం చాలా హాయిగా ఉంటుంది. మనకున్న మెంటల్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉంటే దాని కిక్కు వేరుగా ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో అలా చేశాం. ఇందులో బిట్స్ సాంగ్స్ కలుపుకొని మొత్తం ఆరు పాటలు ఉంటాయి. నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఆటోలో ప్రతిరోజూ ఏషనాగుల పాట పెట్టేవారు. అనిరుధ్‌కి ఐడియా చెబితే చాలా అద్భుతంగా చేశాడు. నిజానికి ‘దసరా’లోనే ఆ పాట పెట్టాలని అనుకున్నాను. ఇందులో కుదిరింది. నాకు జానపద గీతాలు అంటే చాలా ఇష్టం` అని వెల్లడించాడు శ్రీకాంత్ ఓడెల.