Krishneswara Rao: ప్రముఖ రచయిత, నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత.. ఆయన గురించి ఈ సంచలన విషయాలు తెలుసా

Published : Aug 11, 2026, 02:33 PM IST

రంగస్థలానికి జీవితాన్నే అంకితం చేసిన సీనియర్ నటుడు, రచయిత కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. 1500కు పైగా నాటకాల్లో నటించిన ఆయన సినిమాల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

PREV
15
Krishneswara Rao Death

తెలుగు రంగస్థలంపై తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు, రచయిత, దర్శకుడు యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ, గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు ఏటీ అగ్రహారంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు నాటకరంగంలో ఓ విశిష్ట అధ్యాయం ముగిసినట్లైంది. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణేశ్వరరావు కేవలం నటుడిగానే కాకుండా రచయితగా రంగస్థలానికి విశేష సేవలందించారు. ఆయన రాసిన, నటించిన ఎన్నో నాటకాలు తెలుగు రాష్ట్రాల్లోని పరిషత్ నాటక పోటీల్లో ప్రదర్శితమయ్యాయి.

25
1500కు పైగా నాటకాల్లో..

చిన్న వయసులోనే కళారంగంపై ఆసక్తి పెంచుకున్న కృష్ణేశ్వరరావు పాఠశాల రోజుల్లోనే నటుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. ‘వాపస్’ ఆయన తొలి నాటకంగా నిలిచింది. ఆ తర్వాత రంగస్థలమే ఆయన జీవితంలో ప్రధాన భాగమైంది. ఏకంగా 1500కు పైగా నాటకాల్లో నటించడమే కాకుండా, ఎన్నో నాటకాలకు రచన కూడా చేశారు. ‘సంపద’, ‘రోజూ చస్తున్న మనిషి’, ‘పక్కింట్లో పుట్టండి’, ‘అధికారి’, ‘నష్ట పరిహారం’, ‘భూమి కోసం’, ‘గుర్తు తెలియని శవం’ వంటి నాటకాలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తాను రచించిన నాటకాల్లోనే నటిస్తూ, వాటికి దర్శకత్వం వహించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. పొన్నూరు కళాపరిషత్ స్థాపనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రయోగాత్మక నాటకాలతో పలు అవార్డులు అందుకున్నారు. ‘కూతురి కోసం’ నాటకంలో నటనకు భారతముని అవార్డును కూడా అందుకున్నారు.

35
రచయితగా పనిచేసిన సినిమాలు

రంగస్థలంపై ఆయన ప్రతిభను చూసిన సీనియర్ నటుడు ఎం. ప్రభాకర్‌రెడ్డి సినిమాల్లోకి పరిచయం చేశారు. కృష్ణేశ్వరరావు రాసిన ‘రోజూ చస్తున్న మనిషి’ నాటకాన్ని చూసిన ప్రభాకర్‌రెడ్డి, ‘ప్రచండ భారతం’ చిత్రానికి సంభాషణలు రాసే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆయన సినీ రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ‘శ్రీరాములయ్య’, ‘భద్రాచలం’ చిత్రాలకు కథ అందించారు. జయం మనదేరా మూవీ రైటింగ్ టీంలో కూడా పనిచేశారు. ‘పరశురామ్’కు సంభాషణలు రాయగా, ‘నేను సైతం’ చిత్రానికి పాటలు రాశారు. వృత్తిరీత్యా వైద్య రంగంతో అనుబంధం ఉన్నప్పటికీ, సినిమాల కంటే నాటకరంగానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. రంగస్థలంపై ఉన్న అంకితభావం కారణంగా సినీ రంగంలో వచ్చిన కొన్ని అవకాశాలను కూడా వదులుకున్న సందర్భాలు ఉన్నాయని ఆయన గురించి ప్రచురితమైన వివరాలు చెబుతున్నాయి.

45
నటించిన సినిమాలు

నటుడిగా కూడా కృష్ణేశ్వరరావు ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. దర్శకుడు వంశీతో పరిచయం కావడం ఆయన సినీ ప్రయాణంలో మరో ముఖ్యమైన మలుపు. వంశీ దర్శకత్వంలో ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తాను’, ‘గోపి గోపిక గోదావరి’ వంటి చిత్రాల్లో నటించారు. ‘వీర తెలంగాణ’, ‘సరదాగా కాసేపు’, ‘వెన్నెల్లో హాయ్ హాయ్’, ‘వశం’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘నాంది’, ‘విరూపాక్ష’ తదితర చిత్రాల్లోనూ కనిపించారు. ముఖ్యంగా 2014లో విడుదలైన ‘చందమామ కథలు’ సినిమాలో బిచ్చగాడి పాత్ర ఆయనకు సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆ పాత్రకు గాను ఆయన నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. చిన్న పాత్ర అయినా తన సహజమైన నటనతో ఆ పాత్రను గుర్తుండిపోయేలా చేయడం ఆయన ప్రత్యేకత.

55
జీవితం నాటకరంగానికే అంకితం

కృష్ణేశ్వరరావు పూర్తి పేరు యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన తన జీవితంలో ఎక్కువ భాగాన్ని నాటకరంగానికే అంకితం చేశారు. రచయితగా సామాజిక అంశాలను నాటకాల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో పాటు, నటుడిగా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడమే నిజమైన నటన అనే భావనను నమ్మేవారు. సాంకేతికత వేగంగా మారుతున్న సమయంలోనూ నాటకరంగాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గతంలో పేర్కొన్నారు. తెరపై ఎన్నో పాత్రలు పోషించినా, చివరి వరకు రంగస్థలంతో ఉన్న అనుబంధాన్ని మాత్రం వదులుకోలేదు. నాటకరచయితగా, నటుడిగా, దర్శకుడిగా ఆయన అందించిన సేవలు తెలుగు నాటకరంగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories