
ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్‌ని దాటి గ్లోబల్ ఇమేజ్‌తో రాణిస్తున్నారు ప్రభాస్. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఇండియా మీడియా సైతం ఇండియా బిగ్గెస్ట్ స్టార్ అంటూ వర్ణించింది. ప్రస్తుతం అత్యధిక సినిమాల లైనప్‌తో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ఆరు సినిమాలున్నాయి. రెండు చిత్రీకరణ దశలో ఉండగా, మరో మూవీ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. మరో మూడు సినిమాలు వచ్చే ఏడాది స్టార్ట్ కానున్నాయి.
అయితే ప్రభాస్ ఈ మంగళవారం(నవంబర్ 11)న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 23ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన `ఈశ్వర్` మూవీతో తెలుగు తెరకి హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం 2002 నవంబర్ 11న విడుదలైంది. పెద్దగా ఆడలేదు. `బాహుబలి`కి ముందు ప్రభాస్‌కి మూడే బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. `వర్షం`, `ఛత్రపతి`, `మిర్చి` మాత్రమే పెద్ద హిట్ అయ్యాయి. `మిస్టర్ పర్‌ఫెక్ట్`, `డార్లింగ్` చిత్రాలు యావరేజ్‌గానే ఆడాయి. ఇక `బాహుబలి` చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో భారతీయ సినిమా కూడా మారిపోయింది. ఇప్పుడు వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.
అయితే ప్రభాస్ అంటే పడి చచ్చే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. ఆయనంటే ఇష్టపడే హీరోయిన్లు కూడా చాలానే ఉన్నారు. ఆయనతో పని చేయాలని కోరుకునే హీరోయిన్లు కూడా ఉన్నారు. కానీ ప్రభాస్ ఇష్టపడే హీరోయిన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య ఈ జనరేషన్‌లో ఇష్టమైన హీరోయిన్ సాయిపల్లవి అని చెప్పాడు ప్రభాస్. అంతకు ముందు సమంత పేరు కూడా చెప్పాడు. కానీ తనతో పని చేసిన హీరోయిన్లలో మాత్రం త్రిష అంటే ఇష్టమని చెప్పడం విశేషం. అనుష్కతో వరుసగా సినిమాలు చేసినా ఆమె పేరు చెప్పలేదు డార్లింగ్. త్రిషతో `బుజ్జిగాడు` చిత్రంలో నటించారు. ఇందులో త్రిషతో కెమిస్ట్రీ బాగా కుదిరిందని ప్రభాస్ చెప్పడం విశేషం.
ఈ తరం హీరోయిన్ల పేర్లు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. కానీ సీనియర్లలో, అలనాటి హీరోయిన్లకి సంబంధించి ప్రభాస్ బాగా ఇష్టపడే హీరోయిన్ ఎవరో తెలిపారు. తనకు సావిత్రి అంటే ఇష్టమట. తన ఆల్‌టైమ్ ఫేవరేట్ సావిత్రి అని చెప్పారు ప్రభాస్. ఆమెకి సంబంధించిన చాలా సినిమాలు తాను చూసేవాడట. ఆమె నటనకు ఫిదా అయిపోతానని తెలిపారు. `బాహుబలి` మూవీస్ చేయడానికి ముందు ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ విషయాన్ని పంచుకున్నారు. లేటెస్ట్ గా ఇది వైరల్‌గా మారింది.
ఇక ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న `ది రాజాసాబ్` మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఫాంటసీ హర్రర్ రొమాంటిక్ కామెడీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు మారుతి. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. జనవరి 9న ఈ సినిమా విడుదల కాబోతుంది. దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. ఇది వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. అలాగే త్వరలో సందీప్ రెడ్డితో చేయాల్సిన `స్పిరిట్` మూవీని స్టార్ట్ చేయనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఆడియో కాన్సెప్ట్ ఆకట్టుకుంది. వీటితోపాటు ప్రభాస్ `సలార్ 2`, `కల్కి 2`, ప్రశాంత్ వర్మ మూవీస్ చేయనున్నారు.