
పవన్ కళ్యాణ్ తాను తీసిన `జాని` సినిమా పరాజయం చెందినప్పుడు తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఆ ఘటనతో ఒంటరైపోయినట్టు తెలిపారు. ఇక్కడ డబ్బులే పనిచేస్తాయని తెలిపారు.
ప్రతి బంధం ఆర్థిక బంధమే అని అప్పుడు అర్థమైందని, అదే సందర్భం 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఎదురైందన్నారు పవన్. తాజాగా మంగళవారం మంగళగిరిలో ఆయన ఏపీ మీడియాతో ముచ్చటించారు. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పవన్ మాట్లాడుతూ, ``ఖుషి` లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నేను (డైరెక్ట్) చేసిన `జాని` మూవీ ఆడలేదు. బాగలేదనే టాక్ వచ్చిన వెంటనే.. మొదటి రోజు మొదట ఆట పడగానే, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు నా ఇంటి మీదకు వచ్చారు.
మాకు డబ్బులు రావడం లేదు. ఇప్పుడు ఏంచేస్తావని నిలదీశారు. ఆ సమయంలో నా ప్రశ్న ఏంటంటే మీకు డబ్బులు వచ్చినప్పుడు నాకు ఎక్స్ ట్రా ఏం ఇవ్వలేదు కదా అని, కానీ వారి నుంచి అలాంటిదేమీ ఉండదు. అలా అని ఇప్పుడు వారిపై కంప్లెయింట్ చేయడం లేదు.
నాకు అది ఫస్ట్ టైమ్ ఎక్స్ పీరియెన్స్. కారల్ మార్క్స్ చెప్పిన.. అన్ని బంధాలు ఆర్థిక బంధాలే అనేది గుర్తుకు వచ్చింది. ఆ సమయంలో ఒంటరితనం అనుభవించాను. సినిమా ఫ్లాప్ అయితే బాధపడమని అంతా నాకు చెప్పినట్టుగా ఉంది.
నా ఉద్దేశ్యమేంటంటే సినిమా చేశాం, అది బాగాలేదు, ఆడలేదు. దానికి అంతా మునిగిపోయినట్టు మొహాలంతా డల్‌గా పెట్టుకుని ఉంటే ఏం చేస్తాం.
ఆ సమయంలో ఎంత పోయిందని లెక్క తీసి, నాకు ఇచ్చిన పారితోషికం మొత్తం వెనక్కి ఇచ్చేశాను. ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు. పైగా రూ.15 లక్షల వరకు అప్పు చేయాల్సి వచ్చింది` అని తెలిపారు పవన్ కళ్యాణ్.
పవన్ ఇంకా చెబుతూ, ``జాని` ఫెయిల్యూర్ నాకు ఎక్కువగా రాజకీయాల్లో హెల్ప్ చేసింది. ఆ అనుభవం నన్ను బలమైన వ్యక్తిని చేసింది. 2019లో ఓడిపోయినప్పుడు మళ్లీ అదే గుర్తుకు వచ్చింది. ఫెయిల్యూర్స్ జీవితంలో భాగమే అని అర్థమయ్యింది.
దాన్ని తట్టుకొని నిలబడే శక్తినిచ్చింది. `హరి హర వీరమల్లు` విషయంలో ఏఎం రత్నం లాంటి పాన్ ఇండియా సినిమాలు చేసిన నిర్మాత ఇప్పుడు ఈ మూవీ విషయంలో రిలీజ్‌కి ఇబ్బంది పడుతుంటే చాలా బాధగా అనిపించింది.
అందుకే దగ్గరుండి ఈ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా. మామూలుగా ఎలా ఉన్నా, డబ్బుల విషయానికి వస్తే అంతా నువ్వు ఇస్తావా? చస్తావా అనే స్థితికి దిగజారతారు. అందుకే ఈ మూవీకి అండగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాను` అని అన్నారు పవన్.
`హరి హర వీరమల్లు` మూవీ క్లైమాక్స్ డైరెక్ట్ చేయడంపై ఆయన చెబుతూ, ఈ మూవీ బాగా చేయడానికి, క్లైమాక్స్ ని డైరెక్ట్ చేయడానికి కారణం.. నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి, సరిగా చేయడేమో అనే కామెంట్లు వస్తాయి.
అందుకే ప్రత్యేకంగా కేర్ తీసుకుని ఈ మూవీ చేశాను. సినిమా క్లైమాక్స్ నా హృదయానికి చాలా దగ్గరయ్యింది. చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నా, హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలని, ఆ బాధ నాలో ఎక్కడో ఉండిపోయింది. దానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరికిందని ఆ యాక్షన్ కొరియోగ్రఫీ చేశాను` అని తెలిపారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన `హరి హర వీరమల్లు` మూవీని ఏఎం రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్ నెగటివ్ రోల్ చేశారు.
ఈ నెల 24న పాన్ ఇండియా లెవల్లో భారీగా ఈ సినిమా విడుదల కాబోతుంది. పవన్ తొలి పాన్ ఇండియా మూవీ ఇది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు.
ఎప్పుడూ లేని విధంగా ఆయన మీడియా ఇంటరాక్షన్స్ చేయడం విశేషం. నిర్మాత ఏఎం రత్నం కోసం ఆయన సినిమా ప్రమోషన్స్ కి టైమ్ ఇవ్వడం మరో విశేషం. మరి ఈ చిత్రం ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.