
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సరైన కంటెంట్ పడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో `తొలి ప్రేమ`, `తమ్ముడు`, `బద్రి`, `ఖుషి`, `గబ్బర్ సింగ్`, `జల్సా`, `అత్తారింటికి దారేది` వంటి చిత్రాలు నిరూపించాయి. అప్పటి క్రేజ్ ఇప్పుడు మళ్లీ వచ్చింది. `ఓజీ`తో మరోసారి అలాంటి పవన్ కళ్యాణ్ చూడబోతున్నామని అనిపిస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ `ఓజీ` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రెండు గ్లింప్స్ లు మాత్రమే విడుదలయ్యాయి. రెండూ సినిమాపై అంచనాలను పెంచేశాయి. సినిమా విడుదలకు ఇంకా ఇరవై రోజులు ఉంది. కానీ `ఓజీ` సునామీ అప్పుడే స్టార్ట్ అయ్యిందనేలా ఉంది. ఈ మూవీ నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేశారు. ప్రీమియర్స్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ సంచలనం సృష్టిస్తోంది. గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తోంది. భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తుంది. ఈ మూవీ ఇప్పటికే నార్త్ అమెరికాలో ఒక మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టడం విశేషం. కేవలం ప్రీమియర్స్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ లోనే తొమ్మిది కోట్లని వసూలు చేసింది.
అత్యంత వేగంగా ఒక మిలియన్ డాలర్లని వసూలు చేసిన చిత్రంగా `ఓజీ` రికార్డు సృష్టించింది. అక్కడ సునామీ స్టార్ట్ చేసిన ఈ మూవీ మున్ముందు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. దీంతో ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. నిజానికి పవన్ ఫ్యాన్స్ ఇలాంటి సందర్బం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆ టైమ్ ఇప్పుడొచ్చింది. దీంతో వాళ్లు రెచ్చిపోతున్నారు. సంబరాలు ముందే స్టార్ట్ చేస్తున్నారు. ఈ హైప్‌కి తగ్గట్టుగానే సినిమాలో కంటెంట్ ఉంటే ఇక `ఓజీ` బాక్సాఫీసు వద్ద సృష్టించే సునామీని ఆపడం ఎవరి తరం కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
`ఓజీ`లో ఓజాస్ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ఈ మూవీ విడుదలకు మూడు వారాల ముందే ఓజీగా పవన్ బాక్సాఫీస్‌ను శాసిస్తున్నారు. ఆకలితో ఉన్న చిరుతపులిలా, పవన్ కళ్యాణ్ ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా రికార్డులను వేటాడుతున్నారు. `ఓజీ` చిత్రం నుండి ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టర్, ప్రతి గ్లింప్స్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించాయి. 'ఓజీ'పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'ఓజీ' వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించి, మైలురాయి చిత్రంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
పవన్ కళ్యాణ్ గంభీరగా గర్జించనున్న 'ఓజీ' చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ వంటి తారాగణం ఉన్నారు. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 25, 2025న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.