తెలుగు ఆడియెన్స్ ముద్దుగా స్వీటి అని పిలుచుకునే అనుష్క శెట్టి కొంత గ్యాప్‌తో ఆడియెన్స్ ని పలకరించేందుకు వస్తోంది. ఆమె ఎమోషనల్ యాక్షన్ మూవీ `ఘాటి`లో నటించింది. లేడీ ఓరియెంటెడ్ కథతో, గాంజా స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో గాంజా తరలించే మహిళ శీలావతిగా అనుష్క శెట్టి కనిపించనున్నారు. ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్స్ విడుదలయ్యాయి. తాజాగా మరో గ్లింప్స్ ని విడుదల చేశారు. డార్లింగ్ ప్రభాస్ ఈ రిలీజ్ గ్లింప్స్ విడుదల చేయడం విశేషం. అనుష్క, ప్రభాస్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ రిలేషన్‌తోనే డార్లింగ్ ఈ `ఘాటి` రిలీజ్ గ్లింప్స్ ని విడుదల చేశారు. స్వీటితోపాటు టీమ్‌కి అభినందనలు తెలిపారు. ఇలాంటి పవర్‌ఫుల్ రోల్‌లో స్వీటిని చూసేందుకు ఆతృతగా ఉన్నట్టు తెలిపారు.
35
యాక్షన్ ప్రధానంగా సాగిన `ఘాటి` గ్లింప్స్
ఈ గ్లింప్స్ పూర్తి యాక్షన్ ప్రధానంగా సాగుతుంది. గతంలో ఎప్పుడూ చూడని అనుష్క ఇందులో కనిపిస్తుంది. యాక్షన్ సీన్లలో ఆమె రెచ్చిపోయింది. కనీవినీ ఎరుగని విధంగా అనుష్క యాక్షన్ సీన్లు ఉండటం విశేషం. గతంలో `అరుంధతి`, `రుద్రమదేవి`, `భాగమతి` చిత్రాల్లో యాక్షన్‌తో ఆకట్టుకుంది అనుష్క. కానీ ఇందులో వాటిని మించి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఊచకోతలా సాగింది.
గ్లింప్స్ లో అనుష్క ఎంట్రీనే యాక్షన్‌తో సాగింది. కొంత మంది కొట్టుకుంటుండగా, మధ్యలో అనుష్క కర్ర విరగొట్టి రంగంలోకి దిగింది. ఆ తర్వాత బైక్‌పై గాంజా రవాణా చేస్తూ కనిపించింది. పోటీ పడి ఆమె బైక్ నడపడం ఆకట్టుకుంది. ఆ తర్వాత విక్రమ్ ప్రభు, అనుష్కల మధ్య ప్రేమని, వారు పడే స్ట్రగుల్స్ ని చూపించారు. అనంతరం ఆమె తిరగబడటం, ప్రత్యర్థులను ఊచకోత కోయడం చూపించారు. గ్లింప్స్ మొత్తం యాక్షన్ సీన్లు, అందులోనూ అనుష్క ఊచకోతనే కనిపిస్తుంది. ఇంగ్లీష్ పాట బ్యాక్ డ్రాప్‌లో వస్తుండగా, ఈ యాక్షన్ పూనకాలు తెప్పించేలా ఉంది. చివర్లో, వాళ్లు ఊరుకోరు, వీళ్లు ఊరుకోరు అంటే నేను ఊరుకోను అని అనుష్క చెప్పే డైలాగ్ వాహ్ అనిపిస్తుంది.
55
మరికొన్ని గంటల్లో `ఘాటి` విడుదల
రిలీజ్ గ్లింప్స్ `ఘాటి` సినిమాపై అంచనాలను పెంచింది. ఇది ఆద్యంతం ఎమోషనల్ యాక్షన్ మూవీగా సాగుతుందని దర్శకుడు క్రిష్ తెలిపారు. ఫస్టాఫ్ అంతా ఎమోషనల్‌గా రన్ అవుతుంది, వారి స్ట్రగుల్స్ ప్రధానంగా సాగుతుందని, సెకండాఫ్‌లో అంతా యాక్షన్ ఉంటుందని చెప్పారు. ఈ గ్లింప్స్ లోనూ అదే కనిపిస్తుంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన `ఘాటి` చిత్రంలో అనుష్కతోపాటు విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతిబాబు వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మించాయి. సెప్టెంబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. మరి కొన్ని గంటల్లోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. మరి సినిమా ఎలా ఉండబోతుంది? అనుష్క కమ్ బ్యాక్ అదిరిపోయేలా ఉంటుందా? అనేది చూడాలి.