ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఐదుగురు స్నేహితులు ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి అనే ఈ కుర్రాళ్లు చదువుతో పాటు సరదాగా జీవితం గడుపుతుంటారు. ఒక రోజు బాలు పుట్టినరోజు సందర్భంగా పెద్దగా పార్టీ ఏర్పాటు చేస్తారు. ఆల్కహాల్, సరదా, నవ్వులు… ఇలా వేడుక మామూలుగానే సాగుతుంది. ఆ వేడుకలో భాగంగా బర్త్‌డే బంప్స్ పేరుతో బాలును కొడుతూ ఆటపట్టిస్తారు.
కానీ ఆ సరదా ఒక్కసారిగా విషాదంగా మారుతుంది. తీవ్ర నొప్పి తట్టుకోలేక బాలు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఏం జరిగిందో అర్థం కాక స్నేహితులు భయంతో తల్లడిల్లిపోతారు. అమెరికాలో జరిగిన ఈ సంఘటన వాళ్ల భవిష్యత్తును పూర్తిగా మార్చే ప్రమాదం ఉంటుంది. ఈ సమయంలో అర్జున్ అన్నయ్య అయిన లాయర్ భరత్‌కు ఫోన్ చేస్తారు. అక్కడికి వచ్చిన భరత్ పరిస్థితి చూసి షాక్ అవుతాడు. ఇంతలో బాలు మరణం సహజంగా జరగలేదేమో అనే అనుమానం ఒకరికి కలుగుతుంది. దీంతో కథ మరో మలుపు తిరుగుతుంది. నిజంగా అది ప్రమాదమా? లేక దాని వెనుక ఇంకేదైనా రహస్యమా? అనే ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది.