
సీనియర్ నటుడు, వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు మురళీ మోహన్ కి కేంద్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మక పద్మ శ్రీ అవార్డుతో గౌరవించింది. ఆయన సినీ రంగంలో, వ్యాపార రంగంలో, అలాగే రాజకీయాల్లో అందిస్తున్న విశేష సేవలకుగానూ కేంద్రం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం ఈ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు నుంచి సినిమా రంగంలో మాగంటి మురళీ మోహన్‌కి, అలాగే సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌కి అవార్డు వరించింది. వీరితోపాటు తమిళనాడు నుంచి ఆర్ మాధవన్, మలయాళం నుంచి మమ్ముట్టి, హిందీ నుంచి ధర్మేంద్రలకు పద్మ అవార్డులు వరించాయి.
ఈ క్రమంలో మురళీ మోహన్‌కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మురళీ మోహన్‌కి ఆయన భార్య పెట్టిన కండీషన్ షాకిస్తుంది. దాన్ని ఆయన యాభై ఏళ్లుగా పాటించడం విశేషం. ఇంతకి ఆ కండీషన్ ఏంటంటే.. మురళీ మోహన్‌లో 1965లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు రామ్ మోహన్, కూతురు మధు బిందు ఉన్నారు. రామ్మోహన్ కూతురు రాగని, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు, హీరో శ్రీ సింహని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
మురళీ మోహన్ పెళ్లి అయిన తర్వాతనే సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన వయసు 85ఏళ్లకుపైగానే ఉంటుంది. అయినా ఇప్పటికీ చాలా ఫిట్‌గా ఉంటారు. సినిమాల్లోనూ నటిస్తున్నారు. అయితే ఈరోజుకి కూడా మురళీ మోహన్ సినిమాల్లో తన భార్య పెట్టిన కండీషన్ ఫాలో అవుతున్నారట. సినిమాల్లోకి వచ్చే ముందే విజయలక్ష్మి ఒక కండీషన్ పెట్టిందట. మురళీమోహన్ ఎవరి దగ్గరకు వెళ్లి తనకు అవకాశాలు ఇవ్వాలని అడగకూడదట. ఎవరైనా పిలిచి చేయమంటే తప్ప తనకు తానుగా వెళ్లి క్యారెక్టర్(ఆఫర్స్) ఇవ్వమని అడగకూడదు అని చెప్పిందట. ఆ మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారట మురళీమోహన్. `కెరీర్ అంతా కూడా నా వద్దకు వచ్చిన పాత్రలనే చేస్తూ వచ్చాను. ఇప్పటికీ అదే రూల్ పాటిస్తున్నాన`ని మురళీ మోహన్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
మురళీ మోహన్ నటుడిగానే కాదు వ్యాపారవేత్తగా మంచి పేరుతెచ్చుకున్నారు. ఆయన నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. అలాగే జయభేరి పేరుతో అనేక వ్యాపారాలున్నాయి. జయభేరి కంస్ట్రక్షన్ కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీలున్నాయి. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ సమీపంలో జయభేరి పేరుతో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్ లు, ఆపార్ట్ మెంట్స్, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలన్నీ మురళీ మోహన్‌వే. రెండు తెలుగు రాష్టాల్లో ఈ కంపెనీ పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. అలాగే వీరికి మొదట్లో ఎలక్ట్రానిక్స్ మోటార్, ఆయిల్ కంపెనీలు కూడా ఉన్నాయి. మొత్తంగా మురళీ మోహన్ వ్యాపారాల విలువ వేల కోట్లల్లో ఉంటుందని సమాచారం.
మురళీ మోహన్ తలపెట్టిన ప్రతి రంగంలోనూ సక్సెస్ అయ్యారు. ఆయన రాజకీయాల్లోనూ సక్సెస్ ఫుల్ లీడర్‌గా రాణించారు. టీడీపీలో యాక్టివ్‌గా ఉంటారు. ఆయన 2009లో రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో అదే స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం రాజకీయాల్లో అంతగా యాక్టివ్‌గా లేరు. వయసు రీత్యా ఆయన రిటైర్‌మెంట్‌ని తీసుకున్నారు.
నటుడిగా కెరీర్ ప్రారంభంలో స్టార్‌గా రాణించారు మురళీ మోహన్. ఆయన చిరంజీవి కంటే ముందే 1973లో `జగమే మాయ` మూవీతో నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రారంభంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబులతో కలిసి నటించారు. ఆ తర్వాత చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతోనూ కలిసి నటించారు. సోలో హీరోగా అనేక సినిమాలు చేశారు. అదే సమయంలో క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు. దాదాపు అందరు హీరోలతో కలిసి సినిమాలు చేశారు ఇప్పటి వరకు ఆయన 350కిపైగా చిత్రాల్లో నటించారని సమాచారం.
అలాగే ఇక నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. జయభేరి ఆర్ట్స్ పేరుతో సోదరుడు కిశోర్‌తో కలిసి నిర్మాణ సంస్థని స్థాపించి మొదటి ప్రయత్నంగా `వారాల అబ్బాయి` సినిమాని నిర్మించారు. ఇది హీరోగా మురళీ మోహన్ వందవ సినిమా కావడం విశేషం. ఈ ప్రొడక్షన్‌లో దాదాపు 25 సినిమాలు నిర్మించారు. అందులో మహేష్ బాబు తో `అతడు` కూడా ఉంది. ఆయనకు మూడు నంది అవార్డులు వరించాయి.