
టాలీవుడ్ ని పట్టి పీడిస్తున్న పైరసీ భూతాన్ని వదిలించేందుకు హైదరాబాద్ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతున్నాయి. పోలీసులకే ఛాలెంజ్ విసురుతూ తప్పించుకుని తిరుగుతున్న ఐబొమ్మ నిర్వాహకుడు రవిని సజ్జనార్ నేతృత్వంలోని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో సజ్జనార్ టాలీవుడ్ సినీ ప్రముఖులతో భేటీ అన్నారు. ఈ భేటీలో దిల్ రాజు, చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేష్ బాబు పాల్గొన్నారు. భేటీ తర్వాత వీరంతా కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ మీడియా సమావేశంలో సజ్జనార్ మాట్లాడుతూ రవికి సంబంధించిన వివరాలు బయటపెట్టారు. సినీ పరిశ్రమకు పైరసీ వల్ల భారీ నష్టం జరుగుతోందని సజ్జనార్ అన్నారు. ఈ నేపథ్యంలో ఇమ్మడి రవిపై ఐటీ యాక్ట్, కాపీరైట్ చట్టం కింద మొత్తం నాలుగు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. అంతకుముందు పైరసీకి పాల్పడిన ప్రశాంత్, శివరాజ్ అనే వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అలాగే, ఇమ్మడి రవి కేవలం పైరసీనే కాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో కూడా పాల్గొంటూ సమాజానికి హాని చేశాడని చెప్పారు. ఒక సైట్‌ను బ్లాక్ చేస్తే వెంటనే మరో డొమైన్ సృష్టించి, మొత్తం 65 మిర్రర్ సైట్లు నిర్వహించినట్టు వెల్లడించారు. అతడి వద్ద ఉన్న హార్డ్‌డిస్క్‌లో 21 వేలకుపైగా సినిమాలు ఉన్నాయని, 1972లో వచ్చిన గాడ్‌ఫాదర్ నుంచి ఇటీవల విడుదలైన ఓజీ వరకు అన్నీ దొరికాయని తెలిపారు. పైరసీ ద్వారా రవి సుమారు 20 కోట్లు సంపాదించగా, అందులో 3 కోట్లు పోలీసులు సీజ్ చేసినట్టు సజ్జనార్ తెలిపారు. అదేవిధంగా అతడి వద్ద 50 లక్షల మంది వినియోగదారుల డేటా దొరికిందని, ఇంత భారీ డేటా ఒక వ్యక్తి చేతుల్లో ఉండటం ప్రమాదకరమని సజ్జనార్ అన్నారు.
అనంతరం దిల్ రాజు, చిరంజీవి మాట్లాడారు. ఐబొమ్మ నిర్వాహకులని అరెస్ట్ చేయడం హైదరాబాద్ పోలీసులు సాధించిన విజయం. ఈ సందర్భంగా టాలీవుడ్ తరుపున సజ్జనార్ గారికి, హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు దిల్ రాజు అన్నారు. మీ ఇంట్లో ఒక చైన్ పోతేనే మీ కుటుంబం మొత్తం షేక్ అవుతుంది. అలాంటిది కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడి అయిన సినిమాని దొంగిస్తే మాకు ఏ స్థాయిలో నష్టం కలుగుతుందో ఆలోచించండి అని దిల్ రాజు కోరారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. పైరసీ మహమ్మారి ఇండస్ట్రీని వేధిస్తోంది. పైరసీ ప్రభావం కేవలం నిర్మాతలు, స్టార్ హీరోలపైనే కాదు.. సినిమా కోసం కష్టపడే లైట్ బాయ్, ఆఫీస్ బాయ్ పైన కూడా పడుతుంది. గతంలో సిసి ఆనంద్ కొందరి పైరసీ నిర్వాహకులని అరెస్ట్ చేశారు. ఇప్పుడు సజ్జనార్ గారు దానిని కొనసాగిస్తున్నారు. ఇటీవల పైరసీ వల్ల దిల్ రాజు గారి గేమ్ చేంజర్ సినిమాతో పాటు కింగ్డమ్, ఓజీ, తండేల్ లాంటి చిత్రాలు నష్టపోయాయి. ప్రస్తుతం రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటిస్తూ అత్యంత భారీ సినిమా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పైరసీ ని అరికట్టే బాధ్యత అందరిపై ఉంది అని చిరంజీవి అన్నారు.
సినిమాల్లో విలన్ హీరోకి ఛాలెంజ్ చేసినట్లు.. ఐబొమ్మ నిర్వాహకుడు పోలీసులపై ఛాలెంజ్ చేశాడు. ఇదంతా సినిమా సీన్ లాగా ఉంది. ఇక్కడ ఏదీ ఫ్రీగా రాదు. ప్రతి ప్రోడక్ట్ వెనుక చాలా మంది కష్టం ఉంటుంది. పైరసీ చేసేవాళ్ళు సంఘ సేవ చేయట్లేదు. వాళ్ళు మీకు ఫ్రీ గా సినిమా చూపిస్తున్నారు అని మీరు భావించవచ్చు. కానీ ఇంత నెట్వర్క్ నిర్వహించాలంటే వాళ్ళకి డబ్బు కావాలి. ఆ డబ్బు మీ డేటా దొంగిలించడం వల్లే వస్తోంది. మీ సమాచారాన్ని వాళ్ళు క్రిమినల్స్ కి అమ్ముకుంటున్నారు అని రాజమౌళి అన్నారు. ఫ్రీగా సినిమా చూడడం వల్ల మాకంటే మీకే ఎక్కువ నష్టం అని జక్కన్న తెలిపారు.
అక్కినేని నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరసీ సినిమా చూడడం వల్ల మీ డేటా దొంగిలించబడుతుంది. పైరసీ అనేది బిగ్ ట్రాప్. దీని వెనుక పెద్ద కథే ఉంది. మా ఫ్యామిలిలో కూడా ఒకరు ఇలాంటి డిజిటల్ లింకులు క్లిక్ చేయడం వల్ల డిజిటల్ అరెస్ట్ కి గురయ్యారు. పోలీసులకు కంప్లైంట్ చేసే లోపే తప్పించుకున్నారు అని అన్నారు.