
అమూల్యను ఎలా అయినా పడగొట్టేయాలని విశ్వ శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. అమూల్యతో విశ్వ మాట్లాడతాడు. తన ప్రేమను ఆమెకు వివరించేందుకు ప్రయత్నిస్తాడు. ఒకప్పుడు మీ కుటుంబంపై పగ ఉందన్నది నిజమే, అలాగే నీ మీద ఉన్న ప్రేమ కూడా నిజమే.. ఇప్పుడు నా మనసులో నీ మీద ప్రేమ మాత్రమే ఉంది. మన రెండు కుటుంబాలు కలిసేందుకు మన ప్రేమ వారధి కావాలి. నీ కోసం నేను చావమన్నా చస్తాను ఏం చేయమంటావో చెప్పు అని అమూల్యను ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. అమూల్య మాత్రం విశ్వ చెప్పేవన్నీ వింటూ ఉంటుంది.
ఈ లోపు విశ్వా ఒక బంగారు గొలుసును తీసి ఇదే మన ప్రేమకు గుర్తుగా తీసుకో అని ఇస్తాడు. అమూల్య దాన్ని తీసుకొని నేలకేసి కొడుతుంది. అయినా కూడా విశ్వ ఏమాత్రం బాధపడకుండా గొలుసు పడేసావు కానీ నా ప్రేమను మాత్రం నువ్వు వదులుకోలేవు అంటాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, మన రెండు కుటుంబాలు మన ప్రేమతోనే కలుస్తాయి అంటూ నటిస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి దొంగ చాటుగా అమూల్య ఏం చేస్తుందో చూస్తూ ఉంటాడు. విశ్వ వెళ్లిపోవడం చూసిన అమూల్య ఆ బంగారు చైను తీసి చూస్తూ ఉంటుంది. అది చూసిన విశ్వ అమూల్య తన ట్రాప్ లో పడిపోయిందని ఆనందపడతాడు.
అక్కడ నుంచి సీన్ ధీరజ్ దగ్గరికి మారుతుంది. గురుమూర్తి ధీరజ్ కారులోనే బ్యాగు వదిలేస్తాడు. ఆ బ్యాగులో ఐదు లక్షల డబ్బు ఉంటుంది. అది తిరిగి ఇవ్వడానికి గురుమూర్తి దగ్గరికి బయలుదేరుతాడు. ఈ లోపు రామరాజు కూడా గురుమూర్తిని కలిసేందుకు అక్కడికే వస్తాడు. ఎందుకంటే గురుమూర్తి దగ్గర రామరాజు ధాన్యం కొంటూ ఉంటాడు. ఆ డబ్బులు ఇచ్చేందుకే గురుమూర్తిని కలుస్తాడు. అలా ఇద్దరూ మాట్లాడుతూ ఉంటారు. గురుమూర్తి కుటుంబం గురించి అడుగుతాడు.రామరాజు తన చిన్న కూతురికి పెళ్లి చేయాలని చెబుతాడు. అలాగే తన చిన్న కొడుకు ఉన్నాడని తాను సరిగా సెటిల్ అవ్వలేదని అతడి గురించే దిగులుగా ఉందని అంటాడు రామరాజు. అదే సమయంలో గురుమూర్తి తాను వచ్చిన కారులోని ధీరజ్ గురించి చెబుతాడు. ధీరజ్ రామరాజు కొడుకుని ఆయనకి తెలియదు.
ఈలోపు అక్కడికే వస్తాడు ధీరజ్. రామరాజు, ధీరజ్ ఒకరిని ఒకరు చూసుకుంటారు. గురుమూర్తి వారిద్దరూ ఎవరో తెలియక పరిచయం చేస్తాడు. కారులో మీరు బ్యాగ్ మర్చి పోయారు తీసుకోండి అని ఇస్తాడు ధీరజ్. గురుమూర్తి ఆ బ్యాగ్ తీసుకొని ఇందులో ఐదు లక్షల క్యాష్ ఉంది.. నువ్వు బాధ్యత ఉన్నవాడివి అనుకున్నాను కానీ ఎంతో నిజాయితీపరుడు కూడా అని అంటాడు. తర్వాత రామరాజు తో మాట్లాడుతూ ఇతడు తన భార్య కోసం ఎంతో కష్టపడుతున్నాడు. అంటూ ధీరజ్ గురించి చెబుతాడు. తన భార్యకు పోలీసు చేస్తానని మాట ఇచ్చాడంట అని వివరిస్తాడు. దీంతో ధీరజ్ తల పట్టుకుంటాడు.
ఆ తర్వాత ధీరజ్ కు రామరాజు చెప్పిన విషయాలు వివరిస్తాడు. ఇతని చిన్న కొడుకు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడంటా, నీలాంటి వ్యక్తిని అతనికి పరిచయం చేయాలి అని అంటాడు. అలాగే ధీరజ్ కారులో తన నాన్న గురించి చెప్పినవి కూడా గురుమూర్తి రామరాజుకు చెప్పేస్తాడు. వీళ్ళ నాన్న పెద్ద హిట్లర్ అంటా.. అతను చెప్పినట్టే అన్నీ చేయాలంటా, లేదంటే అలుగుతాడట.. అనగానే రామరాజు సీరియస్ గా ముఖం పెడతాడు. ఇక ధీరజ్ తన పని అయిపోయిందని తల పట్టుకుంటాడు.
గురుమూర్తి ఇంకా ఆగకుండా చెబుతూనే ఉంటాడు. ఈ అబ్బాయి వాళ్ళ నాన్న గురించి చెబుతూ కంటతడి పెట్టుకున్నాడు తెలుసా? ఎంత టార్చర్ పెడుతున్నాడో అని అంటాడు. భార్యని పోలీస్ చేయాలని నాన్న దగ్గర డబ్బులు తీసుకోకుండా క్యాబ్ నడిపి కష్టపడుతున్నాడు అంటూ చెబుతాడు. ఇంకేముంది రామరాజుకి ఒళ్ళు మండిపోతుంది. ఇంటికి చేరాక అసలు పంచాయితీ మొదలవుతుంది. వేదవతి రామరాజు కోపాన్ని చూసి ఎందుకలా ఉన్నారని అడుగుతుంది. గురుమూర్తి బాబాయ్ చెప్పింది నిజమేనాఝ? నువ్వు ప్రేమని పోలీస్ చేయాలనుకుంటున్నావా అని కోపంగా ధీరజ్ పై అరుస్తాడు.
ధీరజ్ కూడా వెనక్కి తగ్గకుండా అది ప్రేమ కల నాన్నా.. ఆ కలను నిజం చేయడం నా బాధ్యత అని అంటాడు. దానికి రామరాజు ఈ ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడని మర్చిపోయావా? నాన్న ఉన్నాడని మర్చిపోయావా? ఇది ఉమ్మడి కుటుంబం. సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటావని ప్రశ్నిస్తాడు. ప్రేమ కలను నిజం చేయాలనుకున్నాను.. కానీ మీకు చెప్పకుండా ఏదీ చేయాలనుకోలేదు. తను చదువు అయిపోగానే అకాడమీలో చేర్చాలనుకుంటున్న ఈ విషయం మీకు చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అని చెబుతాడు ధీరజ్.
నర్మద కూడా ఈ విషయంలో ధీరజ్ నే సపోర్ట్ చేస్తుంది. నర్మద మాట్లాడుతూ మీరు ప్రేమను తండ్రిలా చూసుకుంటారు.. ఆలోచించండి. ప్రేమ కలను నిజం చేయండి అని రామరాజుతో అంటుంది. ఇక వల్లి మంట పెట్టేందుకు సిద్ధమైపోతుంది. మన ఇంట్లో ఎవరు జాబ్ చేసినా ఫర్వాలేదు కానీ ప్రేమ ఉద్యోగం చేస్తే మాత్రం యుద్ధాలే జరిగిపోతాయి.ఒకసారి ప్రేమ డాన్స్ క్లాసులు చెబితే ఏమైంది.. ఎదురింటి వాళ్ళు వచ్చి నడిరోడ్డు మీదే గొడవ పెట్టుకున్నారు అని అంటుంది.
ఈలోపు నర్మద కల్పించుకొని ఆ గొడవకు కారణం చదువుకుంటున్న సమయంలో జాబ్ ఏంటని గొడవ పెట్టారు.. అంతే తప్ప నువ్వు ఇలాంటివి మాట్లాడకు. కావాలంటే నువ్వు కూడా జాబ్ చెయ్ లేనిపోని మాటలు మాట్లాడకు అని అంటుంది నర్మద. అయినా కూడా వల్లి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రామరాజుని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. మీకు ఆ రోజు మాటలు గుర్తు లేవా కోడలు సంపాదన మీద తింటున్నావు, సిగ్గు లేదా నీకు అని మామయ్యని అన్నారు కదా అంటూ రెచ్చగొడుతుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.