
మెగా హీరో సాయి దుర్గతేజ్ ప్రస్తుతం ఆయన ఓ రకంగా సెకండ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మూడేళ్ల క్రితం సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆల్మోస్ట్ మరణం అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత సాయితేజ్‌లో చాలా మార్పు కనిపించింది. హ్యూమన్ రిలేషన్స్, మనుషుల విలువలకు సంబంధించి, ఇతరులకు సహాయం చేసే విషయంలో తనవంతు అవేర్ నెస్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై స్పందిస్తున్నారు. చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా ఆయన చిన్నప్పటి లవ్ ట్రాక్ ని వెల్లడించారు. అప్పుడే అమ్మకి ఆ విషయాన్ని చెప్పాడట. మరోవైపు పిల్లలకు సంబంధించిన కనువిప్పు కలిగించే విషయాలను వెల్లడించారు.
సాయి దుర్గ తేజ్ తాజాగా `అభయమ్ మసూమ్ సమ్మిట్` ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 70 నగరాలు, వేల మంది యంగ్ ప్రొఫెషనల్స్ కలిసి నిర్వహిస్తోన్న కాన్పిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)లో భాగంగా యంగ్ ఇండియన్స్ (YI) ఆధ్వర్యంలో పిల్లలపై లైంగిక దాడికి వ్యతిరేక నినాదంతో ‘అభయమ్ మసూమ్ సమ్మిట్’ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. భారత్ రైజింగ్, యంగ్ ఇండియన్స్, కాన్పిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హీరో సాయి దుర్గ తేజ్, మంత్రి సీతక్క, యంగ్ ఇండియన్స్ కో చైర్మన్ భవిన్ పాండ్య, యంగ్ ఇండియన్స్ నేషనల్ చైర్మన్ తరంగ్ ఖురానా, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ శ్రీ శివ ప్రసాద్ రెడ్డి, జోత్స్న సింగ్ వంటి వారు అతిథులుగా హాజరయ్యారు.
ఇందులో సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ , `మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. సోషల్ మీడియాలో పిల్లల మీద అబ్యూజ్ చేస్తున్నారు. అలాంటి కామెంట్లు చేస్తే కూడా లైక్స్ చేస్తున్నారు, నవ్వుతున్నారు. అవన్నీ చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మనం ఇలాంటి సమాజాన్ని కోరుకుంటున్నామా? చిన్న పిల్లల మీద అలాంటి పిచ్చి కామెంట్లు చేయడం ఏంటి?. నేను ఆ టాపిక్ మీద ఎవరైనా మాట్లాడాతారా? మీడియా స్పందిస్తుందా? అని చూశాను. కానీ ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు. ఇక ఆ బాధ్యతను నేను తీసుకున్నాను. అందుకే నేను ఆ సమయంలో అలా రియాక్ట్ అయ్యాను. డార్క్ కామెడీ అంటూ పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. వాక్ స్వాతంత్య్రం ఎదుటి వాళ్లని బాధ పెట్టే వరకు ఉండకూడదు` అని వెల్లడించారు.
సాయి దుర్గతేజ్ ఇంకా మాట్లాడుతూ, 2015లో `థింక్ పీస్` అనే సంస్థతో పని చేశాను. అరకులో చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి పోరాడాను. నేను అక్కడ స్కూల్ నిర్మించాను. తెలంగాణలో కొంత మంది పిల్లల్ని కూడా దత్తత తీసుకున్నాను. ఆ పిల్లల చదువు, పోషణ ఇలా అన్నింటినీ చూసుకుంటాను. ఇప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయాన్ని గడపడం లేదు. ఇప్పుడంటే చాట్ జీటీపీ, ఏఐ అంటున్నారు. కానీ నాకు మాత్రం మా అమ్మే ప్రపంచం. అమ్మ, మామయ్యలు, స్నేహితులు ఇలా అందరితో నేను సమయాన్ని ఎక్కువగా గడిపేవాడ్ని. పిల్లలతో పేరెంట్స్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలి. నేను నా సెకండ్ క్లాస్‌లోని లవ్ స్టోరీని మా అమ్మతో చెప్పాను. అలా చెప్పే స్వతంత్రాన్ని నాకు ఆమె ఇచ్చారు. పేరెంట్స్‌తో అన్ని విషయాల్ని పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలి. పిల్లలకు ప్రతీ విషయాన్ని ప్రేమతో చెప్పే ప్రయత్నం చేయాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయాల్ని స్కూల్లో టీచర్స్, ఇంట్లో పేరెంట్స్ చెప్పే ప్రయత్నం చేయాలి.
ప్రస్తుతం అందరూ బిజీగా మారిపోయారు. ఎప్పుడూ సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. కనీసం వారంలో ఓ పూట అయినా మన ఫ్యామిలీతో కలిసి గడపాలి. కలిసి మాట్లాడుకోవాలి. అందరికీ బాధ్యతల్ని నేర్పించాలి. సోషల్ మీడియాలో పిల్లలు ఏం చేస్తున్నారో పిల్లలకి తెలిసేలా చేయాలి. సోషల్ మీడియా ఐడీలు తల్లిదండ్రుల నంబర్లకు కనెక్ట్ చేయడమో లేదా ఆధార్ కార్డ్‌కి లింక్ చేయడమో ఏదో ఒకటి చేయాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రతీ చైల్డ్‌కి అందాలి. అరకులో నేను, నాతో పాటు కొన్ని స్వచ్చంద సంస్థలు కలిసి స్కూల్ నిర్మించాం. నేను నా సినిమాలో టీజింగ్ సాంగ్స్‌ని ఆపేశాను. ‘విన్నర్’ మూవీ తరువాత అలాంటి పాటలు కూడా చేయలేదు. ప్రేమిస్తే పొగడాలి కానీ అలా టీజింగ్ చేయకూడదు కదా? అని స్వతహాగా నిర్ణయం తీసుకున్నాను. తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేయాలి. సోషల్ మీడియాలో కాకుండా రియల్ వర్డ్‌లో బతకాలని చెప్పాలి. ఫ్యాన్స్ మా మీద ఇష్టంతోనో, ద్వేషంతోనో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తుంటారు. మేమంటే పెద్ద అయ్యాం కాబట్టి అలాంటి నెగెటివ్ కామెంట్లను పట్టించుకోం. కానీ పిల్లలు అలాంటి కామెంట్లను చూస్తే ప్రభావితం చెందుతుంటారు. అందుకే పిల్లల్ని అలాంటి వాటికి దూరంగా ఉంచాలి. అందుకే పిల్లల ఐడీలను పేరెంట్స్ నంబర్లకు, ఆధార్ కార్డ్‌లకి లింక్ చేయాలి. నా పెళ్లి గురించి మీడియాలో ఊహాగానాల్ని ప్రచారం చేయకండి. నా పెళ్లిని నేనే అనౌన్స్ చేస్తాను (నవ్వుతూ)’ అని అన్నారు.