తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది నటులు తమ స్వార్ధం చూసుకోకుండా.. ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు. అటువంటి వారిలో ఎమ్ ప్రభాకర్ రెడ్డి కూడా ఒకరు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేదల కోసం ఆయన హైదరాబాద్ సెంటర్ లో దాదాపు 12 ఎకరాలు భూమిని ఇచ్చాడని మీకు తెలుసా?
తెలుగు సినీ ప్రపంచంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది పాత్రల్లో నటించి మెప్పించిన ఎంతో మంది నటులు ఉన్నారు. కానీ, వెండితెర వెనుక కష్టపడే వేలాది మంది పేద సినీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపి, వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు డాక్టర్ మందాడి ప్రభాకర్ రెడ్డి. తెరపై ఆయన ఎంతటి కఠినమైన విలన్ పాత్రలు పోషించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆయనొక నిస్వార్థపరుడిగా, త్యాగం తెలిసి వ్యక్తిగా, బంగారు మనసున్న 'రియల్ హీరోగా నిలిచారు.
24
వైద్య వృత్తి నుంచి రంగుల ప్రపంచంలోకి..
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన ప్రభాకర్ రెడ్డి నటన వైపు రావడం ఒక ఆసక్తికరమైన మలుపు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్న రోజుల్లోనే ఆయనలోని నటనా ప్రతిభను ప్రముఖ దర్శకుడు గుత్తా రామిరెడ్డి గుర్తించారు. 1960లో వచ్చిన 'చివరకు మిగిలేది' చిత్రంలో సైకియాట్రిస్ట్ (మానసిక వైద్యుడి) పాత్రతో ఆయన నటుడిగా అరంగేట్రం చేశారు. వైద్య విద్యను పూర్తి చేసి ‘డాక్టర్’ పట్టా పొందినప్పటికీ, కళామతల్లిపై ఉన్న ఇష్టంతో.. ప్రభాకర్ రెడ్డి చిత్ర పరిశ్రమలోనే సుదీర్ఘ కాలం కొనసాగారు. సుమారు మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో 470కి పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు.
ప్రభాకర్ రెడ్డి నటుడు మాత్రమే కాదు..
నటుడిగానే కాకుండా 21 కంటే ఎక్కువ చిత్రాలకు రచయితగా కథ అందించారు ప్రభాకర్ రెడ్డి. 'కార్తీకదీపం', 'పండంటి కాపురం', 'గృహప్రవేశం' వంటి అద్భుతమైన చిత్రాలకు ఆయన అందించిన కథలు తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్నాయి. నటుడిగా, రచయితగా ఐదు నంది అవార్డులను దక్కించుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. అంతేకాకుండా, నేటి ప్రముఖ నటి జయప్రద గారి అసలు పేరు (లలితా రాణి)ని ‘జయప్రద’గా మార్చి పరిశ్రమకు పరిచయం చేసింది కూడా ప్రభాకర్ రెడ్డినే.
34
12 ఎకరాల భూమిని ఇండస్ట్రీకి ఇచ్చిన నటుడు..
తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు (చెన్నై) నుంచి హైదరాబాద్‌కి తరలివచ్చిన తొలినాళ్లలో, పరిశ్రమను నమ్ముకున్న కార్మికులు, టెక్నీషియన్లు ఇక్కడ ఉండటానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఉండటానికి సరైన ఇళ్లు లేక, అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న కార్మికుల కష్టాలను ప్రభాకర్ రెడ్డి దగ్గరగా చూశారు. సినీ రంగానికి పునాది అయిన కార్మికులకు సొంత ఇల్లు ఉండాలనే గొప్ప ఆలోచనతో ఆయన ముందుకు వచ్చారు.మణికొండ ప్రాంతంలో తన సొంతంగా ఉన్న సుమారు 10 నుంచి 12 ఎకరాల విలువైన భూమిని సినీ కార్మికుల గృహ నిర్మాణం కోసం ఏమాత్రం ఆలోచించకుండా దానం చేశారు. ఆ భూదానమే నేడు హైదరాబాద్‌లోని ఐకానిక్ నివాస ప్రాంతమైన "డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురి కాలనీ" ఏర్పాటుకు బలమైన పునాది అయింది.
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి అత్యంత ఐటీ అండ్ రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌ల సమీపంలో ఉన్న ఆ భూమి ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ రూ. 600 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ త్యాగం వల్ల ఈనాడు వేలాది సినీ కార్మికుల కుటుంబాలు తమ సొంత ఇంటిలో గౌరవంగా బ్రతుకుతున్నారు. నటుడిగా, నిర్మాతగా, రచయితగా.. ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసిన ప్రభాకర్ రెడ్డి.. 1997లో 62 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికంగా లేకపోయినా, చిత్రపురి కాలనీ రూపంలోనూ, ఆయన నటించిన చిరస్మరణీయ పాత్రల రూపంలోనూ ఆయన పేరు నిరంతరం నిలిచే ఉంటుంది.