
తెలుగు తెర విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. గత నెల(జులై) 13న ఆయన తుది శ్వాస విడిచారు. దాదాపు 750కిపైగా చిత్రాల్లో నటించిన కోట చేయని పాత్రంటూ లేదు. హీరోగా తప్ప మిగిలిన అన్ని రకాల పాత్రలు పోషించారు. నెగటివ్ రోల్స్, తండ్రిగా, తాతగా, బాబాయ్‌గా, మామయ్యగా, లేడీ గెటప్‌లోనూ కనిపించారు. అదే సమయంలో ఓ మూవీలో గే గా కూడా కనిపించారు. పుట్టింది ఆంధ్రప్రదేశ్ లో అయినా తెలంగాణ యాసని రక్తికట్టించారు.
ఇదిలా ఉంటే కోట శ్రీనివాసరావు ఓ సినిమా విషయంలో చాలా ఇబ్బంది పడ్డారు. కృష్ణ కారణంగా దెబ్బలు తినాల్సి వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ `మండలాధీశుడు` సినిమా తీశారు. ఇందులో ఆయన నటించలేదు, కానీ తెరవెనుక ఉండి దర్శకుడు ఎం ప్రభాకర్ రెడ్డి, నిర్మాత డీవీ నరసరాజులతో తీయించారు. ఇందులో కోట లీడ్ రోల్ చేశారు. 1987లో ఫిబ్రవరి 26న ఈ మూవీ విడుదలైంది. మంచి ఆదరణ పొందింది. అయితే ఈ సినిమాని ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా రూపొందించారు కృష్ణ. అప్పుడు రామారావు సీఎంగా ఉన్నారు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎంగా రామారావు పాలనా లోపాలను ఎత్తిచూపుతూ ఒక సెటైరికల్ ఈ మూవీగా దీన్ని తీశారు.
ఇందులో సీఎం పాత్రని కోట శ్రీనివాసరావు పోషించారు. ఆయన ఈ పాత్ర చేసేందుకు ఒప్పుకోలేదు, కానీ కృష్ణనే పట్టుబట్టి నటింపచేశారు. విడుదలయ్యాక ఈ మూవీ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు బాగా వ్యతిరేకించారు. అంతేకాదు ఇందులో ఎన్టీఆర్ ని పోలిన సీఎం పాత్రని కోట శ్రీనివాసరావు నటించడంతో ఆయన్ని పగబట్టారు రామారావు అభిమానులు. ఓ సారి కోట శ్రీనివాసరావు విజయవాడ రైల్వే స్టేషన్‌లో కనిపించినప్పుడు పట్టుకుని బాగా కొట్టారట . కోట శ్రీనివాసరావునే ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టిన విషయం సూపర్ స్టార్ కృష్ణకి తెలిసింది. ఆ తర్వాత ఓ సినిమా షూటింగ్‌లో వీరిద్దరు కలుసుకున్నారు. ఆ సమయంలో సూపర్ స్టార్ కృష్ణ రియాక్షన్ చూసి షాక్ అయ్యారు కోట. సాధారణంగా మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే, దెబ్బలు తినే పరిస్థితి ఉంటే సానుభూతి చూపిస్తారు. అయ్యో పాపం అంటారు. కానీ కృష్ణ మాత్రం అందుకు రివర్స్ లో రియాక్ట్ అయ్యారు. కోటని చూసి నవ్వుతూ వచ్చిన కృష్ణ `ఏమయ్యా బెజవాడలో నిన్ను కొట్టారటగా` అంటూ నవ్వుతున్నారట. అదేం సార్ అంటూ ఆశ్చర్యపోవడం కోట వంతు అయ్యిందట.
సూపర్ స్టార్ కృష్ణ చాలా జోవియల్ పర్సన్. ఏదున్నా మొహం మీదే చెబుతారు. సినిమా ఫ్లాఫ్ అయినా అలానే రియాక్ట్ అవుతారు. `సినిమా పోయిందయ్యా` అని వెంటనే అనేస్తారు అని తెలిపారు కోట శ్రీనివాసరావు. ఐడ్రీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట ఈ విషయాలను వెల్లడించారు. `మండలాధీశుడు` సినిమా తర్వాత ఆఫర్లు తగ్గితే కృష్ణనే తనకు ఆఫర్స్ ఇప్పించారని తెలిపారు. చాలా మంది దర్శక నిర్మాతలు వచ్చి కృష్ణగారు చెప్పారు అని తనని బుక్ చేసుకునేవారట. అలా కృష్ణగారి గొప్పతనాన్ని కోట వెల్లడించారు. ఇప్పుడు అటు సూపర్ స్టార్ కృష్ణ, కోట శ్రీనివాసరావు ఇద్దరూ మన మధ్య లేకపోవడం బాధాకరం.