
కిరణ్ అబ్బవరం గతేడాది దీపావళి పండక్కి `క` చిత్రంతో వచ్చాడు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఆ మూవీ మంచి విజయం సాధించింది. కెరీర్ బెస్ట్ అనిపించుకుంది. వరుస పరాజయాల్లో ఉన్న కిరణ్ అబ్బవరంని బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. ఇప్పుడు ఈ దీపావళికి `కే ర్యాంప్` చిత్రంతో వచ్చాడు. ఆడియెన్స్ కి కావాల్సిన మాస్ అంశాలు, యూత్‌కి కావాల్సిన లవ్, రొమాంటిక్ ఎలిమెంట్లని, ఫ్యామిలీతోపాటు అందరికి కావాల్సిన కామెడీ అంశాలను జోడించి పర్‌ఫెక్ట్ పండగ సినిమాని తీసుకొచ్చాడు. శనివారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. ఫస్ట్ డే నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా కలెక్షన్ల పరంగానూ దుమ్ములేపుతుంది.
మొదటి రోజు `కే ర్యాంప్` మూవీ ప్రపంచ వ్యాప్తంగా నాలుగున్నర కోట్లు వసూలు చేసినట్టు టీమ్ ప్రకటించింది. ఇప్పుడు రెండో రోజు ఇండియాలో కలెక్షన్లు పెరగడం విశేష. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.7.6కోట్లు వసూలు చేసింది. ఇండియాలో మొదటి రోజు ఈ చిత్రానికి రూ.2.15కోట్లు వస్తే, రెండో రోజు రూ.3.25కోట్లు రావడం విశేషం. ఓవర్సీస్‌లో దాదాపు రెండు కోట్లు వచ్చాయి. ఇలా మొత్తంగా ఈ మూవీ ఎనిమిది కోట్లకు చేరువలో ఉంది. రెండు రోజుల్లోనే ఏకంగా నాలుగు కోట్ల షేర్ రావడం మరో విశేషం. దీంతో ఈ మూవీ ఆల్మోస్ట్ 60 శాతం రికవరీ సాధించింది.
సోమవారం పండగ కావడంతో బాగా కలిసొస్తుంది. దీంతో ఈ రోజు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఒకేరోజు వచ్చినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంటే ఈ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్లబోతుంది. `కే ర్యాంప్` చిత్రానికి రూ.6.40కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇది తెలుగు స్టేట్స్ బిజినెస్. ఓవర్సీస్ అన్నీ కలిపి మరో కోటి వరకు ఉంటుంది. అంటే దాదాపు రూ.7-8కోట్లు వస్తే సినిమా సేఫ్. ఇప్పుడు మూడు రోజుల్లో ఆ మార్క్ ని దాటే అవకాశం ఉంది. అంతేకాదు రోజు రోజుకి సినిమాకి మౌత్ టాక్ పెరుగుతుంది. ఆదరణ పెరుగుతుంది. ఈ వారం వరకు ఈ చిత్రానికి తిరుగులేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
కిరణ్ అబ్బవరం `కే ర్యాంప్`తో మరో బ్లాక్ బస్టర్ అందుకుంటున్నాడు. మరోవైపు ఈ దీపావళి సందర్భంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో `మిత్ర మండలి`, `తెలుసుకదా`, `డ్యూడ్`, `కే ర్యాంప్` ఉన్నాయి. వీటిలో `మిత్రమండలి` డిజాస్టర్ అయ్యింది. `తెలుగుకదా`ని ఆడియెన్స్ పట్టించుకోవడం లేదు. `డ్యూడ్` మూవీ ఫర్వాలేదు. కాకపోతే తమిళనాడులో బాగా ఆడుతుంది. ఇక్కడ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లేదు. ఇదంతా ఇప్పుడు `కే ర్యాంప్` కి హెల్ప్ కాబోతుంది. ఇంకా చెప్పాలంటే ఈ దీపావళి విన్నర్‌గా `కే ర్యాంప్` నిలవబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
`కే ర్యాంప్` కథేంటనేది చూస్తే, కిరణ్ అబ్బవరం ఒక సంపన్న ఫ్యామిలీలో జన్మిస్తాడు. చిన్నప్పుడే అమ్మ చనిపోతుంది. దీంతో తల్లిలేని బిడ్డగా, తండ్రి సాయికుమార్ పెంపకంలో గారాబంగా పెరుగుతాడు. తనకు కోట్ల ఆస్తి ఉండటంతో చదివి ఏం చేస్తానని చెప్పి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. హైదరాబాద్‌లో ఉంటే ఫ్రెండ్స్ తో తిరుగుతూ పాడవుతున్నాడని చెప్పి తండ్రి కేరళాకి పంపిస్తాడు. అక్కడ హీరోయిన్‌ని చూస్తాడు. ఆమెకి తొలి చూపులోనే పడిపోతాడు. ఆమె వెంటపడతాడు. చివరికి ఆమె కూడా కిరణ్‌ని ప్రేమిస్తుంది. ఆ తర్వాత హీరోయిన్‌కి ఉన్న అసలు సమస్య తెలుస్తుంది. దీంతో ఆమెని పట్టుకోలేక, వదిలించుకోలేక కిరణ్ బడే బాధలే సినిమా. ఆ సీన్లు ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. ఫస్టాఫ్ కాస్త డల్‌గా ఉన్నా, సెకండాఫ్‌లో మాత్రం కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. క్లైమాక్స్ లో ఎమోషన్స్ కూడా బాగా పండాయి. దీంతో మాస్ నుంచి క్లాస్ అందరు ఆడియెన్స్ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.