
వల్లి అందరికీ పాయసం ఇచ్చి నర్మదా, సాగర్‌ల విషయం చెప్పడానికి సిద్ధం చేస్తుంది. ఈ లోపు వేదవతి ఇంత ఆనందంగా ఉన్నావు.. పాయసం ఇచ్చావంటే నెల తప్పావన్నమాట అని అంటుంది. వల్లీ ‘ఇంకా అంతవరకు రాలేదండి’ అని అంటుంది. వల్లీ.. సాగర్, నర్మదా వైపు చూస్తూ ‘మీరు చెబుతారా నన్ను చెప్పమంటారా’ అని అడుగుతుంది. ‘సాగర్ మరిది గారికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది’ అని చెబుతుంది. అది విని నర్మదతో పాటు అందరూ షాక్ అవుతారు. రామరాజు ఎప్పుడు వచ్చిందని అడుగుతాడు. అప్పుడు వల్లి.. గవర్నమెంట్ జాబ్ కోసం పరీక్ష రాసి పాస్ అయితే ఉద్యోగం వచ్చేస్తుంది కదండీ అంటుంది. సాగర్ గవర్నమెంట్ జాబ్ కోసం పరీక్ష రాసాడు అని చెప్పేస్తుంది.
అది విని నర్మద, సాగర్ చాలా భయపడుతూ ఉంటారు. రామరాజు ‘సాగర్ ఎలాంటి ఉద్యోగం చేయనని, మన రైస్ మిల్ చూసుకుంటానని నాకు చెప్పాడు. ఎగ్జామ్ ఎందుకు రాస్తాడు. ఒకవేళ వాడికి ఉద్యోగం చేసే ఆలోచన ఉంటే ఆ విషయం నాకు చెబుతాడు. నాకు తెలియకుండా దొంగ చాటుగా చేయాల్సిన పనిలేదు. అసలు నన్ను మోసం చేసే సాహసమే వాడు చేయడు’ అని అంటాడు. అప్పుడు వల్లి మరింతగా మంట పెట్టేందుకు సిద్ధమవుతుంది.
వల్లి రామరాజు మాటలు విని ‘అవునండి మీరు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజమే’ అంటుంది. అప్పుడు ఒక న్యూస్ పేపర్ తీసుకొచ్చి విఆర్వో రిజల్ట్ వచ్చిందని మా చుట్టాలమ్మాయి చెబితే చూశాను. అందులో సాగర్ పేరు ఉందని వల్లీ అంటుంది. రామరాజు పేపర్లో సాగర్ పేరును చూస్తాడు. ఇంకా నమ్మకం లేకపోతే ఎగ్జామ్ రాసారో లేదో సాగర్, నర్మదనే అడగమని అంటుంది వల్లి. ఇంట్లో మరింత మంట పెట్టేలా అతిగా మాట్లాడుతుంది. మధ్యలో రామరాజుని కూడా కలుపుతూ ‘మామయ్య గారు మీరు ఏమంటారు ఈ విషయంలో. ఏదో ఒకటి చెప్పండి’ అని అడుగుతుంది.
దీంతో రామరాజుకి విపరీతమైన కోపం వస్తుంది. సాగర్ మీద కోప్పడతాడు. సాగర్‌ను ‘నువ్వు ఎగ్జామ్ రాసావా’ అని గట్టిగా అడుగుతాడు. సాగర్ ఎగ్జామ్ రాసానని ఒప్పుకుంటాడు. వల్లి ఇదంతా చూసి ఎంతో ఆనందపడుతుంది. ఇలా అంటించగానే అగ్నిపర్వతం బద్దలైపోయిందని సంతోషపడుతుంది.
రామరాజు సాగర్‌తో మాట్లాడుతూ ‘నువ్వు రైస్ మిల్ చూసుకుంటానని చెప్పావుగా.. మరి గవర్నమెంట్ ఉద్యోగం కోసం పరీక్ష ఎందుకు రాశావు’ అని అరుస్తాడు. ఈలోపు సాగర్ తనకు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకుంటున్నానని చెబుతాడు. దీంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు. రామరాజుకు నర్మద తండ్రి అన్న మాటలు గుర్తొచ్చి మరింత కోపం పెరుగుతుంది. రామరాజు కోపంగా ‘మీ ఆలోచన ఏంటో.. మీ ఉద్దేశం ఏంటో అర్థం అయింది. ఆ రోజు మీ మామయ్య నిన్ను ఇల్లరికం పంపించమని గవర్నమెంట్ ఉద్యోగం వేయిస్తానని అన్నాడు. అలా చెప్పడం వెనుక అసలు కథ ఇదన్నమాట. రైస్ మిల్లులో పనిచేయడం నీకు నామోషీగా ఉంది. రైస్ మిల్లు చూసుకోవడం అంటే మూటలు మోయడం అన్నట్టుగా ఫీల్ అవుతున్నావ్. అందుకే ఉద్యోగం తెచ్చుకొని ఇల్లరికం వెళ్లాలనుకుంటున్నావు అంతే కదా’ అని అరుస్తాడు.
సాగర్ మాట్లాడుతూ ‘నాకు అలాంటి ఆలోచనలు లేవు. నేను కేవలం గవర్నమెంట్ ఉద్యోగం కోసం పరీక్ష మాత్రమే రాయాలనుకున్నాను’ అంటాడు. కానీ రామరాజు మాత్రం వెళ్లాలనే ఆలోచనతోనే పరీక్ష రాశావంటూ సాగర్ మీదకి కోపంగా వెళతాడు. వేదవతి రామరాజుకు సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. కానీ రామరాజు ఆగడు.
రామరాజు కోపంగా ధీరజ్ గురించి కూడా మాట్లాడతాడు. వీడు తన భార్యని పోలీసు చేయాలని ప్రయత్నిస్తున్నాడని, ఇప్పుడు సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం చేయడానికి పరీక్ష రాసి వచ్చాడని అంటాడు. కొడుకులు తనను మోసం చేశారని, గుండెల మీద తన్ని వెళ్ళిపోతారని అంటాడు. సాగర్ కు ఇదంతా విని చాలా కోపం వస్తుంది. మొదటిసారి కోపంగా ‘ఏదేదో ఊహించుకొని ఏదో మాట్లాడుతున్నావేంటి నాన్నా? ఇప్పుడు ఏమైంది? ఎందుకిలా మాట్లాడుతున్నావు? జస్ట్ కేవలం ఎగ్జామ్ రాసాను అంతే. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చెప్పకుండా ఎలా ఉంటాను. నువ్వు ఇది అర్థం చేసుకోకుండా.. నిన్ను మోసం చేసాను, నిన్ను వెన్నుపోటు పొడిచానని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఏంటి నాన్న’ అని అడుగుతాడు అయినా రామరాజు తగ్గకుండా గొడవ పడుతూనే ఉంటాడు.
సాగర్, రామరాజు మధ్య గొడవ పెరగడంతో వేదవతి వచ్చి ఆపడానికి ప్రయత్నిస్తుంది. సాగర్ తన భార్య గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి.. తాను కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకున్నానని చెబుతాడు. అంతే తప్ప తండ్రిని విడిచి వెళ్లే ఆలోచన తనకు లేదని చెబుతాడు. అలాగే పిల్లల్ని వారి ఇష్టాయిష్టాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు కాస్త మారితే బాగుంటుంది నాన్నా అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. సాగర్‌తో మిగతా ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుతూ ఉంటారు. నాన్నను ఎదిరించి మాట్లాడకూడదని పెద్దోడు అంటాడు.
సాగర్ తాను తప్పు చేయలేదని నాన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అంటాడు. ‘అప్పుడు నాన్నకు రైస్ మిల్లు చూసుకుంటానని మాట ఇచ్చావు కదా ఇప్పుడు ఆ మాటలను తప్పే గవర్నమెంట్ జాబ్ కోసం పరీక్ష రాస్తే ఏమనుకుంటారు’ అని పెద్దోడు అడుగుతాడే. నాన్న నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు మోసం చేసినట్టే కదా అని అంటాడు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు కాసేపు వాదించుకుంటారు. నీ ఉద్యోగంలో నువ్వు బానే ఉన్నావు కానీ నాకే ఏమీ లేకుండా పోయింది అంటూ సాగర్ ఎంతో బాధపడతాడు. మధ్యలో ధీరజ్ వచ్చి సాగర్ చేస్తున్నది కరెక్టేనని అంటాడు. దీంతో పెద్దోడు షాక్ అవుతాడు.
ధీరజ్ మాట్లాడుతూ ‘సాగర్ నచ్చిన పని వాడు చేయాలనుకుంటున్నాడు. జీవితాంతం రైస్ మిల్లులో కూర్చుని ఉండాలని ఎవరూ కోరుకోరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకాలని కోరుకుంటారు. ఆ హక్కు అందరికీ ఉంటుంది. వీడు నాన్నకి ఎదురు మాట్లాడటం తప్పే కావచ్చు. కానీ వీడికి నచ్చిన ఉద్యోగం చేయడం తప్పు కాదు. అది కాదనే హక్కు కూడా మనకు లేదు.’ అని అంటాడు. ఇక్కడ నుంచి సీన్ వేదవతి దగ్గరికి మారుతుంది. జరిగింది తలుచుకొని బాధపడుతూ కూర్చుంటుంది.
అప్పుడు నర్మదా.. వేదవతి దగ్గరికి వెళుతుంది. సారీ చెబుతుంది. వేదవతి కోపంగా ‘నీకు.. నీ సారీలకు ఒక నమస్కారం. మీరూ వద్దు.. మీ అత్తయ్య అనే పిలుపులు వద్దు. మీతో అసలు మాటలే వద్దు. మీ పంచాయితీలే మాకు వద్దు తల్లి’ అని కోప్పడుతుంది. సెంటిమెంట్ తో కొట్టి నన్ను తింగరి దాన్ని చేసి పడేసారని అంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం గురించి చెప్పకుండా దాచిపెట్టారని కోడలిపై చాలా కోప్పడుతుంది వేదవతి. నర్మద సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా కూడా వేదవతి వినేందుకు ఇష్టపడదు. నర్మదకు సపోర్టుగా ప్రేమ కూడా వస్తుంది. దాంతో వేదవతి ఇద్దరిని కలిపి తిడుతుంది. ఇక్కడితో ఈనాటి ఎపిసోడ్ ముగిసిపోతుంది.