
రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ `బాహుబలి`, `బాహుబలి 2`. ఈ చిత్రాలు తెలుగుకే కాదు, ఇండియన్ సినిమాకి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. భారతీయ సినిమాకి ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేశాయి. ఈ చిత్రంలో రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్ర బాగా పాపులర్ అయ్యింది. బాగా పండింది. రమ్యకృష్ణ సైతం అంతే బాగా చేసింది. `బాహుబలి`తో రమ్యకృష్ణపై ఉన్న ఇమేజ్ మారిపోయింది. అయితే ఈ పాత్ర కోసం మొదట రాజమౌళి అనుకున్నది అతిలోక సుందరి శ్రీదేవిని.
రాజమౌళి.. శివగామి పాత్ర కోసం శ్రీదేవిని కలిశారు. అయితే ఆమె పారితోషికం ఎక్కువ డిమాండ్ చేయడం, అలాగే మెయింటనెన్స్ ఖర్చులు ఎక్కువగా ఉండటం, దీనికితోడు హిందీ మార్కెట్‌లో కొంత షేర్ అడగడం వంటి కారణాలతో ఆమెని వద్దు అనుకున్నట్టు రాజమౌళి తెలిపారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో రాజమౌళి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ సందర్బంగానే మరో షాకింగ్ కామెంట్ చేశారు రాజమౌళి. ఆమె ఒప్పుకోకపోవడమే మంచిదైందని, తమకు హెల్ప్ అయ్యిందని చెప్పారు. ఇంతకి రాజమౌళి ఏం చెప్పారనేది చూస్తే.
`శ్రీదేవిగారిని వెళ్లి అడిగాం, మా అదృష్టం బాగుండి, ఆమె ఓకే చేయలేదు. 7, 8 కోట్ల పారితోషికం అడిగారు. వచ్చినప్పుడల్లా 5 బిజినెస్ క్లాస్ టికెట్లు, బిగ్గెస్ట్ స్టార్ హోటల్‌లో 5 సూట్స్, ఆ తర్వాత హిందీలో పర్సెంటేజ్ అడిగారు. ఇది చాలా టూమచ్ అనిపించింది. అలా అడగడం మా అదృష్టం` అని చెప్పారు రాజమౌళి. దీనికి ఏబీఎన్ రాధాకృష్ణ కల్పించుకుని శివగామి ఆ పాత్ర ఆమె చేసి ఉంటే సంకనాకిపోయేది` అని అనగా, హా అవును, మొత్తం పోయిండేది అని రాజమౌళి ఒప్పుకున్నారు. అంతేకాదు శ్రీదేవిగారు సెటిల్డ్ గా యాక్ట్ చేస్తారు. వైల్డ్ రియాక్షన్, ఆ పవర్ రాదని తెలిపారు జక్కన్న.
అద్భుతమైన నటిగా, అత్యంత అందమైన నటిగా పేరుతెచ్చుకున్న శ్రీదేవిపై రాజమౌళి ఇలాంటి కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియో వైరల్‌గా మారింది. రాజమౌళి ఇలా రియాక్ట్ అయ్యారేంటని అందరూ షాక్ అవుతున్నారు. చాలా హుందాగా, మెచ్యూర్డ్ గా ఉండే రాజమౌళి నుంచి ఇది ఊహించడం కష్టమనే చెప్పాలి. కానీ ఆయన శ్రీదేవిపై చేసిన ఈ కామెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే దీనిపై శ్రీదేవి కూడా అప్పట్లోనే స్పందించింది.
తనపై రాజమౌళి చేసిన కామెంట్లని అతిలోక సుందరి ఖండించింది. అది నిజం కాదని చెప్పింది. అలా చేసి ఉంటే ఈ యాభై ఏళ్లు ఎలా ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతాను అని తెలిపింది. `నేను అంత అన్యాయంగా డిమాండ్ చేశానంటే, ఈ రోజుకి 300 చిత్రాలు చేయడం, ఈ 50ఏళ్లు నన్ను ఇండస్ట్రీలో ఉండనిచ్చేవారా? కానీ ఇలా అయ్యిందని పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో చెప్పడం మంచి పద్ధతి కాదు. ఆయన ఒక డిగ్నిఫైడ్, కామ్ డైరెక్టర్ అని విన్నాను. ఇలా చేయడం సరికాదు. ఆయనతో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నాను. ఇలాగే బాహుబలిలాగానే గొప్ప సినిమాలు తీయాలని కోరుకుంటున్నా` అని తెలిపారు శ్రీదేవి. ఇలా రాజమౌళి కామెంట్స్, ఆయనకు శ్రీదేవి కౌంటర్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనికి ఆ తర్వాత రాజమౌళి స్పందించి క్షమాపణలు చెప్పారు. ఈ అంశం గురించి తాను పబ్లిక్‌గా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో గ్లోబల్ ట్రోట్ సినిమా చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో దీన్ని తెరకెక్కిస్తున్నారు.