చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ చాలా పెద్దది. అందువల్లే ఓ క్లాస్ మూవీ ఫెయిల్ అయింది అని అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. పుష్ప 2 తర్వాత బన్నీ తనకు ఇచ్చిన ఆన్సర్ గురించి కూడా చెప్పారు.
ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్ లో అంతటి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో చిరంజీవి. ఆయన క్రేజ్ శిఖరాగ్రానికి చేరింది. చిరంజీవి మాస్ సినిమాలు చేస్తే అభిమానులు పండగ చేసుకునేవారు. డ్యాన్సులు, నటన, ఫైట్స్ విషయంలో చిరంజీవికి తిరుగు ఉండేది కాదు. కొన్ని సందర్భాల్లో చిరంజీవి తన మాస్ ఇమేజ్ ని పక్కన పెట్టి నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేశారు.
25
చిరంజీవి క్లాస్ మూవీస్
వాటిలో ఆరాధన, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్భాందవుడు లాంటి సినిమాలు ఉన్నాయి. ఆరాధన చిత్రం 1987లో విడుదలయింది. భారతీరాజా ఈ చిత్రానికి దర్శకుడు. అల్లు అరవింద్ నిర్మించారు. మాస్ అంశాలు లేకుండా క్లాస్ కథతో తెరకెక్కిన చిత్రం ఇది. తమిళ సినిమాకి రీమేక్ ఇది. తమిళంలో హిట్ కానీ తెలుగులో ఫ్లాప్. ఆరాధన చిత్రం ఫ్లాప్ కావడానికి గల కారణాన్ని అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.
35
అందుకే ఆరాధన వర్కౌట్ కాలేదు
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఆ టైంలో చిరంజీవి తిరుగులేని మాస్ హీరో. ఆరాధన కథ కంటే చిరంజీవి ఇమేజ్ చాలా పెద్దది. ఆ సినిమాని చిరంజీవి కాకుండా ఇంకెవరైనా చిన్న హీరో చేసి ఉంటే బావుండేది. ఎందుకంటే అభిమానులు చిరంజీవి నుంచి మాస్ సినిమాలే ఎక్కువగా ఆశించే వారు. అందుకే ఆరాధన వర్కౌట్ కాలేదు. కానీ డైరెక్టర్ భారతీరాజా మాత్రం చాలా బ్రిలియంట్ గా సినిమాని తెరకెక్కించారు. ఆ కథ కంటే చిరంజీవి ఇమేజ్ పెద్దది కావడం వల్ల మూవీ ఫెయిల్ అయింది అని అల్లు అరవింద్ తెలిపారు.
చిరంజీవి నటించిన క్లాస్ మూవీస్ లో కూడా హిట్లు ఉన్నాయి. శుభలేఖ, విజేత లాంటి సినిమాలు విజయం సాధించాయి అని అరవింద్ అన్నారు. చిరంజీవికి మాస్ ఇమేజ్ ఉన్నప్పటికీ తన పాత్రల్లో వైవిధ్యం ఉండేలా, అన్ని రకాల సినిమాలు చేసేవారు. కానీ ఇప్పటి తరం హీరోలు మాస్ ఇమేజ్ రాగానే పూర్తిగా క్లాస్ సినిమాలు పక్కన పెట్టేస్తున్నారా అని అల్లు అరవింద్ కి ప్రశ్న ఎదురైంది.
55
పుష్ప 2 తర్వాత బన్నీ సమాధానం ఇదే
దీనికి అల్లు అరవింద్ బదులిస్తూ.. అవును, ఇప్పటి స్టార్ హీరోలు క్లాస్ సినిమాలని పక్కన పెట్టేస్తున్నారనే నేను అనుకుంటున్నాను. పుష్ప 2 తర్వాత నా కొడుకు అల్లు అర్జున్ ని ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలి అనుకుంటున్నావు అని అడిగాను. క్యాజువల్ గా డిస్కస్ చేస్తూ.. ఇప్పుడు నువ్వు సాఫ్ట్ రోల్స్ చేస్తే ఎలా ఉంటుంది ? ఒక ఫ్యామిలీలో చిన్న కొడుకుగా ఉంటూ.. కుటుంబం కోసం త్యాగం చేసే కొడుకుగా.. ఇలాంటి కథలో నటిస్తే ఏమవుతుంది ? అని అడిగాను. డాడీ ప్రస్తుతం నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. మీరు కథ తీసుకురండి. కథ అద్భుతంగా అనిపిస్తే నేను ఆ సినిమా చేసే ధైర్యం చేస్తానేమో అని బన్నీ అన్నట్లు అల్లు అరవింద్ తెలిపారు. పుష్ప 2 తర్వాత ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో 800 కోట్ల భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు.