I Bomma: ఐ బొమ్మ, మూవీ రూల్స్ లవర్స్ కి షాక్‌, పైరసీ గుట్టురట్టు, 22 వేల కోట్లు స్వాహా.. సెలబ్రిటీల హస్తం

Published : Sep 30, 2025, 04:11 PM IST

Cinema Piracy: కొత్త సినిమాలను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమకి పెద్ద నష్టం కలిగిస్తున్న పైరెట్స్ గుట్టురట్టు చేశారు పోలీసులు. అంతేకాదు ఐబొమ్మ పని కూడా పడతామని కమిషన్‌ ఆనంద్‌ తెలపడం విశేషం. 

PREV
18
చిత్ర పరిశ్రమకి పెద్ద దెబ్బగా మారిన పైరసీ

పైరసీ అనేది చిత్ర పరిశ్రమకి పెద్ద దెబ్బగా మారింది. చాలా ఏళ్లుగా ఈ పైరసీతో సినీ ఇండస్ట్రీలు స్ట్రగుల్‌ అవుతున్నాయి. టాలీవుడ్‌ మాత్రమే కాదు, బాలీవుడ, కోలీవుడ్‌, మాలీవుడ్‌ పరిశ్రమ ఏదైనా పైరసీ జరుగుతుంది. చాలా వరకు విడుదలయ్యాక సినిమాలు పైరసీ రూపంలో కొన్ని ఆన్‌ లైన్‌ యాప్‌లు, ఆన్‌లైన్‌ సైట్లలో దర్శనమిస్తున్నాయి. ఇప్పుడైతే ఏకంగా హెచ్‌డీ ప్రింట్‌ దర్శనమివ్వడం గమనార్హం. చాలా మంది ఆడియెన్స్ ఈ పైరసీ సైట్లలో సినిమాలు చూస్తున్నారు. దీంతో థియేటర్లలో సినిమా చూసేవారి సంఖ్య తగ్గిపోతుంది. ఇది సినిమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది కొన్నేళ్లుగా జరుగుతుంది. ఇప్పుడు అది తీవ్రమైంది. విడుదలకు ముందే హెచ్‌డీ ప్రింట్‌ ఆన్‌లైన్‌లో లీక్‌ కావడం మేకర్స్ కి షాకిస్తుంది. వందల కోట్లు పెట్టి నిర్మించిన సినిమా సింపుల్‌గా ఆన్‌లైన్‌లో లీక్‌ కావడం, వాటినే ఆడియెన్స్ చూస్తుండటంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

28
పైరసీ గుట్టు రట్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులు

ఇటీవల శ్రీవిష్ణు హీరోగా నటించిన `సింగిల్‌` మూవీ సైతం ఇలానే ఆన్‌ లైన్‌లో లీక్‌ అయ్యింది. వాళ్లు ఫిల్మ్ ఛాంబర్‌ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ పైరసీని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పైరసీ ఎక్కడ అవుతుందో విచారణ చేపట్టారు. కొన్ని నెలలుగా ఈ ఇన్వెస్టిగేషన్‌ చేయగా ఫైనల్‌గా ఐదుగురుని అరెస్ట్ చేశారు. పైరసీ గుట్టుని రట్టుచేశారు. దీని వెనకాల జరిగే కథని తాజాగా హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. పైరసీ ఏ రకంగా జరుగుతుందో వెల్లడించారు. సినిమా స్టార్స్, నిర్మాతలు, ఎగ్జిబిటర్ల సమక్షంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. హెచ్‌ డీ మూవీస్ పైరసీ కేసు చేధించడం ఇదే మొదటిసారి.

38
సినిమా పరిశ్రమకి 22 వేల కోట్ల నష్టం

మొత్తంగా 2023లో సినిమా పరిశ్రమకు పైరసీ కారణంగా రూ.22,400 కోట్ల వరకు నష్టం వచ్చిందని, కేవలం తెలుగు సినిమా పరిశ్రమకే సుమారు రూ.3,700 కోట్లు నష్టం వచ్చిందని వెల్లడించారు. సినిమాని విడుదలైన వెంటనే ఫ్రీగా చూడాలనే భావించే కొందరి ఆసక్తిని, వారి డిమాండ్‌ని ఆసరాగా తీసుకుని ఈ పైరసీ మార్కెట్‌ విస్తరిస్తుందన్నారు. ఈ పైరేటెడ్ సినిమాలు టోరెంట్ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ ఛానెల్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై అప్‌ లోడ్‌ చేస్తున్నారని, ఈ మొత్తం కార్యకలాపాలు చాలాకాలంగా ఆన్‌లైన్ బేటింగ్, గేమింగ్ వెబ్‌సైట్ ఆపరేటర్లే వారి యాప్స్, ప్లాట్‌ఫామ్‌లను ప్రమోట్ చేస్తున్నారు. వీటిని ప్రమోట్‌ చేస్తున్న సెలబ్రిటీలు కూడా వారికి తెలియకుండానే ఈ పైరసీలో భాగమవుతున్నారని తెలిపారు. ఈ పైరసీ ప్రధానంగా రెండు రకాలుగా జరుగుతుందని, 1. ధియేటర్స్ లో క్యామ్ కార్డింగ్ ద్వారా 2. డిజిటల్ మీడియా సర్వర్లు హ్యాక్ చేయడం ద్వారా జరుగుతుందన్నారు కమిషనర్‌. అది ఎలా జరుగుతుందనేది ఆయన వివరించారు.

48
సినిమాని ఎలా పైరసీ చేస్తారంటే?

పైరేట్ ముందుగానే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ బుక్ చేసి, మంచి వ్యూవింగ్ యాంగిల్ ఉన్న సీటును ఎంచుకుంటాడు. తర్వాత మొబైల్ యాప్‌లో కెమెరా ఆన్ చేసి, ఫ్లాష్ ఆఫ్‌లో ఉంచి, ఫోన్‌ను షర్ట్ జేబులో పెట్టి రికార్డింగ్ చేస్తారు. మొబైల్‌ను ఎవరైనా చెక్ చేసినా కూడా రికార్డింగ్ జరుగుతోందని ఎవరూ గుర్తించలేరు. మొత్తం సినిమా రికార్డ్ అయ్యాక ఫైల్‌ను కంప్రెస్ చేసి, టెలిగ్రామ్ ఛానెల్‌ ద్వారా వెబ్‌సైట్ హ్యాండిల్‌ చేసేవారికి పంపిస్తారు. ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు తర్వాత, మా బృందం ‘సింగిల్’, ‘హిట్: ది థర్డ్ కేస్’ సినిమాలు అత్తాపూర్ మంత్రా మాల్‌లో క్యామ్ రికార్డింగ్ చేసినట్టు గుర్తించింది. 44 అనుమానాస్పద మొబైల్ నంబర్ల విశ్లేషణ తర్వాత, జాన కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఫోన్‌ను గుర్తించి విచారించగా , అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇప్పటి వరకు 40 సినిమాలు క్యామ్ రికార్డింగ్ చేసి, వాటిని సిరిల్ ఇన్ఫాంట్‌ రాజ్‌కు అందజేశానని చెప్పాడు. ఒక్కో సినిమా కోసం అతడు రూ.15 వేల నుండి రూ.50 వేల వరకు చెల్లించేవాడని, చెల్లింపులు క్రిప్టో కరెన్సీ యాప్‌లైన Zebpay, DCX ద్వారా జరిగేవని తెలిపాడు.

58
పైరసీ అసలు సూత్రధారులు

తదుపరి దర్యాప్తులో బీహార్‌కు చెందిన కామ్‌ రికార్డర్‌ అర్సలాన్‌ అహ్మద్‌ను, ఇతర రాష్ట్రాల్లో కొంతమందిని అరెస్టు చేశాు. చివరికి వీరి మాస్టర్‌మైండ్ సిరిల్ ఇన్ఫాంట్‌ రాజ్‌ను తమిళనాడులోని కరూర్ లో అరెస్టు చేశాం. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన అతను 1TamilBlasters, 5MovieRulz, 1TamilMV వంటి పైరసీ వెబ్‌సైట్‌లను సృష్టించి, ఇప్పటి వరకు 550కి పైగా సినిమాలను అప్‌లోడ్ చేశాడు. ఈ వెబ్‌సైట్‌లను నెదర్లాండ్స్‌ IP కలిగిన డెడికేటెడ్ సర్వర్‌పై రన్‌ చేస్తున్నారు. అందుకోసం పారిస్‌ IPగా కనిపించే రెండు వర్చువల్‌ మెషీన్లను కూడా ఉపయోగించేవాడు. ఇన్ఫాంట్‌ రాజ్‌కి 1xBet, Parimatch, Rajbet, 4rabet వంటి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ నుండి నెలకు సుమారు 10,000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.9 లక్షలు) వేతనం అందేది. నెలకు సుమారు 15 సినిమాలను అప్‌లోడ్ చేసి, చెల్లింపుల కోసం 10 క్రిప్టో వాలెట్లను నిర్వహించేవాడు. అతని టెలిగ్రామ్ చాట్స్‌ ప్రకారం ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో తన జీతాన్ని నెలకు 30,000 డాలర్లకు పెంచాలని డిమాండ్ చేసినట్టు తేలింది` అని  కమిషనర్‌ తెలిపారు.

68
బెట్టింగ్ యాప్స్ లాభం ఎలా పొందుతున్నాయి?

ప్రజలు ఈ ఉచిత పైరసీ సినిమాలు చూస్తున్నప్పుడు, బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన ప్రకటనలు వస్తాయి. ఆ ప్రకటనపై క్లిక్ చేసి చూడకపోతే సినిమా ఓపెన్‌ కాదు. పైగా మధ్య మధ్యలో స్ట్రక్‌ అవుతుంది. దీంతో తెలియకుండానే ప్రజలకు బెట్టింగ్‌ యాప్‌లు అలవాటు చేస్తున్నారు. అదే సమయంలో తెలియకుండానే కొంతమంది సినీ తారలు కూడా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేశారు. కానీ వారికి డబ్బులు చెల్లిస్తున్న ఈ యాప్స్‌ నిర్వాహకులే వారి సినిమాలను దొంగిలిస్తున్నారని వారికి తెలియదని సీవీ ఆనంద్‌ వెల్లడించారు.

78
ఆన్‌ లైన్‌ సర్వర్‌ హ్యాకింగ్‌ ద్వారా మరో రకం పైరసీ

ఈ సందర్భంగా మరో పద్ధతిలో సినిమా పైరసీ చేయడం గురించి చెబుతూ, అందుకు Modus Operandi 2 పద్ధతిని వాడుతున్నారని తెలిపారు. `ఇది డిజిటల్ కంపెనీల (ఉదాహరణకు UFO, Qube) సర్వర్లు నుంచే అసలైన HD కాపీని నేరుగా హ్యాక్ చేసి పైరసీ చేయటం. లభించిన క్లూస్ ఆధారంగా మా సైబర్ బృందం టెలిగ్రామ్ యూజర్ ID ‘@ Cuterio’ని బీహార్‌ పట్నాకు చెందిన అశ్వనీ కుమార్‌గా గుర్తించింది. అతడిని అరెస్ట్ చేసి, హార్డ్‌డిస్క్, మొబైల్ ఫోన్‌లను తనిఖీ చేయగా వందలాది హెచ్‌డీ సినిమా కాపీలు ఉన్నట్టు బయటపడింది. కేవలం 22 ఏళ్ల వయస్సు ఉన్నా అతను పైతాన్ , జావా స్క్రిప్ట్‌లు, ఇతర హ్యాకింగ్ టూల్స్ ఉపయోగించి ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ప్రైవేట్ కంపెనీల సర్వర్లలోకి చొరబడి ఆ డేటాని సంపాదించడం చూస్తుంటే షాకింగ్‌గా ఉంది. అతడు మన డిజిటల్ మీడియా హౌస్‌ల ప్రధాన సర్వర్లను హ్యాక్ చేసి, HD సినిమాలను కాపీ చేసి, వాటిని టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు పంపేవాడు. ఒక్కో సినిమాకు క్రిప్టో ద్వారా రూ.75,000 పొందేవాడు. ఇప్పటివరకు మొత్తం 120 సినిమాలు పంపించాడని తెలిపారు కమిషనర్‌.

88
ఐ బొమ్మకి కమిషనర్‌ ఆనంద్‌ వార్నింగ్‌

ఈ కేసు detection చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పటి వరకు సినిమాలు విడుదలకు ముందే బయటకు వస్తుండటంతో ఇది సిబ్బందిలో ఎవరో ఒకరు చేస్తున్నట్టు భావించేవారు.ఈ మొత్తం ఘటనల నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే డిజిటల్ మీడియా సంస్థలు అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌లు, ఫైర్‌వాల్‌లు ఏర్పాటు చేయడం, ప్రత్యేక నిపుణుల బృందాల ద్వారా సర్వర్లపై హ్యాకర్లు, పైరేట్లు చేసే దాడులను నిరంతరం పర్యవేక్షించడం వంటి చర్యలు చేపట్టాలన్నారు సీవీ ఆనంద్‌. 

ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఉచిత పైరేటెడ్ సినిమాలు చూడొద్దన్నారు. మీరు ఆ సినిమాలు చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చే ప్రకటనలను చూడాల్సి వస్తుంది. ఆ ప్రక్రియలో మీ వ్యక్తిగత వివరాలన్నింటినీ వారికి అందజేస్తూ, సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఈ ప్రపంచంలో ఏది ఫ్రీగా రాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు కమిషనర్‌. అంతేకాదు ఈసందర్భంగా త్వరలో ఐ బొమ్మ నిర్వాహకులను కూడా పట్టుకుంటామని హెచ్చరించారు. ఐబొమ్మ సైట్‌ ద్వారా అనేక సినిమాలు పైరసీ చేస్తున్నారు. హెచ్‌డీ ప్రింట్‌ని కూడా అందులో ఉంచుతున్నారు. దీన్నే ఆడియెన్స్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు. దీంతో త్వరలో ఐ బొమ్మ పని కూడా పడతాని కమిషనర్‌ చెప్పడం విశేషం. ఐబొమ్మ లవర్స్ కిది షాకిచ్చే వార్త అనే చెప్పాలి.

 కమిషనర్‌గా ఆయన చివరి రోజు ఈ పైరసీ గుట్టు రట్టు చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో సినిమా పరిశ్రమ నుంచి చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున, నాని, రామ్‌, నాగచైతన్య, దిల్‌ రాజు, నిర్మాతలు సుప్రియ, సురేష్‌ బాబు వంటి వారు పాల్గొన్నారు ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సజ్జనార్‌ బాధ్యతలు తీసుకున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories