
ప్రస్తుతం చిన్నా, పెద్ద సినిమా ఏదైనా నిర్మాతలకు భరోసా ఇచ్చేది ఓటీటీలే. థియేటర్‌లో సినిమా ఆడినా, ఆడకపోయినా ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చే అమౌంట్‌తో అయినా తాము సేఫ్‌లో ఉండొచ్చని నిర్మాతలు భరోసాతో ఉంటున్నారు. గతేడాది వరకు ఓటీటీలు ఉన్నాయన్నా భరోసాతోనే సినిమాలు తీసిన నిర్మాతలుండటం విశేషం. ఓటీటీల ద్వారా కూడా మంచి బిజినెస్ జరిగింది. ఎంతో మంది నిర్మాతలు గట్టెక్కారు. కానీ టాలీవుడ్‌లో కొందరు నిర్మాతలు, ఓటీటీ సంస్థల్లో ఉన్న పెద్ద తలకాయలను పట్టుకొని భారీగా స్కామ్‌కి పాల్పడ్డారు. వీరి సమక్షంలో దాదాపు రూ.50-100 కోట్ల వరకు స్కామ్ జరిగినట్టు సమాచారం.
గత రెండుమూడేళ్లలో తెలుగుకి సంబంధించిన ఒక ఓటీటీ సంస్థలో ఆ ప్రముఖ ఓటీటీ చాలా యాక్టివ్ గా ఉంది. చిన్న సినిమాల నుంచి మీడియం బడ్జెట్ చిత్రాల వరకు చాలా చిత్రాల రైట్స్ తీసుకొంది. ఇతర ఏ ఓటీటీ సంస్థ కొనని సినిమాలను ఈ ఓటీటీ తీసుకుంది. ఇందులో పలు క్రేజీ సినిమాలున్నాయి. అదే సమయంలో డిజాస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. అయితే థియేటర్లో పెద్దగా ఆడని సినిమాలను కూడా ఆ ఓటీటీ సంస్థ భారీ రేట్‌కి కొనుగోలు చేసిందట. అందులో ఉన్న ఓ పెద్ద తలకాయ నిర్మాతలతో కుమ్మక్కై భారీ రేట్‌కి కొనేలా చేశాడట. ఆ నిర్మాతలకు నష్టాలు రాకుండా చేశాడట.
ఇలా ఇద్దరు నిర్మాతలకు సంబంధించిన ఆరు సినిమాల విషయంలో ఈ స్కామ్ జరిగిందట. ప్రస్తుతం అంచనా ప్రకారం రూ.50కోట్ల మేరకు ఈ స్కామ్ జరిగిందని అంటున్నారు. కానీ తోడుతుండగా ఇది పెద్దగానే జరిగిందని, వంద కోట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదని సమాచారం. ఆ ఓటీటీ సంస్థకి భారీగా నష్టం తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని తెలుస్తోంది. అట్టర్ ఫ్లాప్ సినిమాలను ఊహించని రేట్‌కి కొనిపించి అందుకుగానూ తాను కూడా భారీగానే వాటాని పొందినట్టు తెలుస్తోంది. ఆ మధ్య వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా డిజాస్టర్ మూవీని కూడా ఎక్కువ ఓటీటీ డీల్ చేయడంలో ఆయన హస్తం ఉందని సమాచారం.
ఆ పెద్ద తలకాయతో ఇద్దరు పెద్ద నిర్మాతలు చేతులు కలిపారట. వారి సినిమాలనే ఆయన ఎక్కువ రేట్‌కి కొన్నట్టు సమాచారం. ఈ మూడేళ్లలో ప్రధానంగా 2022-24 మధ్య విడుదలైన సినిమాలకు సంబంధించిన రైట్స్ విషయంలోనే ఇదంతా జరిగిందట. ఆ నిర్మాతల్లో ఒకరు సెన్సేషనల్ ప్రొడ్యూసర్ కావడం విశేషం. ఇటీవల వరుసగా పరాజయాలను చవిచూస్తున్నారు. మరో నిర్మాత ఇటీవలే ఓ హిట్ కొట్టాడు. వీరి సినిమాల ఓటీటీ రైట్స్ విషయంలోనే ఎక్కువగా ఈ స్కామ్ జరిగిందని సమాచారం. మొన్నటి వరకు చాలా యాక్టివ్ గా దూసుకెళ్లిన ఆ ఓటీటీని చివరికి నిండా ముంచినట్టు తెలుస్తోంది.
ఈ స్కామ్ బయటకు రావడంతో ఇప్పుడు ఓటీటీ పెద్దలు అలర్ట్ అయ్యారు. దీనిపై ఆడిటింగ్ చేస్తున్నారట. ఈ క్రమంలో షాకిచ్చే విషయాలు బయటపడుతున్నాయట. రెండు మూడు కోట్లు సినిమాలు, ఐదు కోట్ల లోపు సినిమాలను కూడా డబుల్ రేట్‌కి ఓటీటీ రైట్స్ కొనేలా చేసిన తీరు చూసి ఆ ఓటీటీ పెద్దలు నోరెళ్లబెడుతున్నారట. నమ్మి పగ్గాలు అప్పగిస్తే ఇంతటి మోసానికి పాల్పడిన నేపథ్యంలో వాళ్లు ఈ విషయంపై చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై ఆడిటింగ్ కొనసాగుతుందని, ఇందులో చాలా స్కామ్ బయటకు వచ్చిందని, దీంతో ఆ పెద్ద తలకాయపై కేసు కూడా పెట్టినట్టు సమాచారం.
అయితే ఇటీవలే ఆ పెద్ద తలకాయ సంస్థ నుంచి వెళ్ళిపోయారు. ఈ బాగోతం బయటపడుతుందని, ముందుగానే జాగ్రత్త పడ్డాడట. మరో బడా ప్రొడక్షన్ కంపెనీలో చేరినట్టు సమాచారం. అందుకోసం ఇండస్ట్రీలో ఓ పెద్ద హీరో సపోర్ట్ కూడా తీసుకున్నారట. ఆ ప్రొడక్షన్‌లోనూ బడా హీరో ఉన్నారు. వారంతా మంచి ఫ్రెండ్స్. అలా తాను చేసిన మాయా జాలం తెలియకుండా జాగ్రత్త పడి మరో సంస్థలో చేరినట్టు సమాచారం. మరోవైపు తనకు సపోర్ట్ చేసిన పెద్ద హీరో వారసులతోనూ అతను కుమ్మక్కై సినిమాలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై మరింత లోతుగా ఆడిటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి సంబంధించిన మరిన్ని షాకిచ్చే విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇతర సినిమాల ఓటీటీ డీల్స్ వ్యవహారాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదంతా మీడియాలోకి రాకుండా జగ్రత్త పడుతున్నారు. అంతా రహస్యంగా నడిపిస్తున్నారట. బయటపడితే అందరి పరువు పోతుందని, పెద్ద పెద్ద సినిమాల డీల్స్ రిస్క్ లో పడతాయనే ఉద్దేశ్యంతో రహస్యంగా ఈ వ్యవహారాన్ని డీల్ చేస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆడిటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఓటీటీకి సంబంధించిన కొత్త సినిమాల డీల్స్ అన్నింటిని పెండింగ్‌లో పెట్టారట. మరోవైపు గత నాలుగైదు ఏళ్లలో తెలుగు సినిమాలకు సంబంధించిన జరిగిన డీల్స్ అన్నింటిని ఆడిట్ చేస్తున్నారట. ఇదే జరిగితే పెద్ద పెద్ద హీరోల సినిమాలకు సంబంధించిన ఓటీటీ డీల్స్ వెనకున్న లొసుగులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది టాలీవుడ్‌కే పెద్ద దెబ్బగా, తెలుగు సినిమా పరువు తీసే ప్రక్రియ అవుతుందని చెప్పొచ్చు. ఓ వైపు తెలుగు మూవీ వేల కోట్ల మార్కెట్‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్‌ని సైతం పక్కకు నెట్టి టాప్‌లో ఉంది. ఏ ఇండస్ట్రీలో రూపొందనన్ని చిత్రాలు ఇక్కడ తెరకెక్కుతున్నాయి. దేశం మొత్తం ఎదురుచూస్తే భారీ పాన్ ఇండియా మూవీస్ మన వద్ద రూపొందుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ ఓటీటీ స్కామ్ మన ఇండస్ట్రీ పరువు తీసేదిగా ఉండబోతుందని చెప్పొచ్చు. బడా నిర్మాతలు, దర్శకులు, హీరోలకు కూడా ఇది అవమానకరమైన విషయమనే చెప్పాలి. ఈ వ్యవహారాన్ని ఎలా సెట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.