
సహజమైన నటనకు కేరాఫ్, అద్భుతమైన నటనకే కాదు, అంతే సహజమైన అందానికి కేరాఫ్ సౌందర్య. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోవడం ఆమె ప్రత్యేకత. మన పక్కింటి అమ్మాయిగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. అద్భుతమైన నటనతో మెప్పిస్తుంది. ఆమె మరణించి 22 ఏళ్లు అయిపోయినా ఇంకా సౌందర్య మన మదిలో తిరుగుతూనే ఉంది. తన సినిమాలతో మన మధ్యనే ఉన్నట్టుగా ఉంది.
సౌందర్య చీరకట్టులో కనిపించి ఆకట్టుకుంది. గ్లామర్ ప్రపంచంలో, మిగిలిన హీరోయిన్లు అందాల ఆరబోతలో పోటీపడుతుంటే, తాను మాత్రం ఎలాంటి ఎక్స్ పోజింగ్‌కి తావు లేకుండా చీరకట్టులోనే కనిపిస్తూ ఆకట్టుకుంది. చీరకే అందాన్ని తీసుకొచ్చేది. అందం అనే ఆలోచనే రాకుండా చేసింది. అది సౌందర్య స్పెషాలిటీ. అయితే అప్పట్లో సౌందర్యకి వీరాభిమానులు ఉండేవారు. ఆమె స్టార్‌గా రాణించే సమయంలో ఆమె ఇంటికి వచ్చి పోతుండేవారట. ఆమెని చూడాలని తపిస్తుండేవారట. కానీ సౌందర్య చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేక వాళ్లు దాదాపు రెండేళ్లపాటు తన ఇంటి చుట్టూ తిరిగేవారట.
సౌందర్య అమ్మ మంజుల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఈ మధ్య వెల్లడించారు. `సౌందర్య మరణించిన తర్వాత కూడా దాదాపు రెండేళ్లపాటు వివిధ రాష్ట్రాల నుంచి అభిమానులు బెంగళూరులోని తన ఇంటికి వచ్చేవారు. సౌందర్య లేరనే విషయాన్ని నమ్మలేక ఆమెని ఒక్కసారైనా చూడాలనే కోరికతో, ఆమె లేరని తెలిసినా కూడా ఇంటి గేటు బయట నిలబడేవారు. అది నా కూతురు సంపాదించుకున్న ప్రేమ` అని ఆమె ఎంతో భావోద్వేగంగా వెల్లడించారు. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
సౌందర్య.. 2004లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం కోసం వెళ్లింది. ఈ క్రమంలోనే హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. కిందపడిపోయి కాలిపోయింది. అందులోనే సౌందర్య, ఆమె సోదరుడు అమర్ కూడా కన్నుమూశారు. వీరి మరణం అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని కలిచివేసింది. ఇండస్ట్రీ వర్గాలే జీర్ణించుకోలేకపోయారు. ఇక అభిమానుల గురించి ఏం చెబుతాం. చాలా రోజుల వరకు వాళ్లు సౌందర్య లేరనే నిజాన్ని నమ్మలేకపోయారు. అందుకే ఇలా సౌందర్యని ఒక్కసారైనా చూద్దామని వారి ఇంటికి వెళ్లేవారట. అలా రెండేళ్లు తిరిగారట. ఆ తర్వాత రావడం మానేశారని సౌందర్య తల్లి వెల్లడించారు. ఆమె మాటలు ఇప్పుడు అభిమానులను భావోద్వేగానికి గురి చేస్తుండటం విశేషం.
సౌందర్య తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. మొదటగా తెలుగులో ఆమె `మనవరాలి పెళ్ళి` చిత్రంలో నటించారు. టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. ఆ తర్వాత `రాజేంద్రుడు గజేంద్రుడు`, `మాయలోడు`, `నెంబర్ వన్`, `హలో బ్రదర్`, `అల్లరి ప్రేమికుడు`, `సూపర్ పోలీస్`, `మా వూరి మారాజు`, `మేడం`, `అమ్మదొంగ`, `టాప్ హీరో`, `చిలకపచ్చ కాపురం`, `పెదరాయుడు`, `భలే బుల్లోడు`, `అమ్మోరు`, `రిక్షావోడు`, `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `పవిత్రబంధం`, `పెళ్లి చేసుకుందాం`, `ఆరో ప్రాణం`, `రాయుడు`, `చూడాలని వుండి`, `శ్రీరాములయ్య`, `శుభవార్త`, `అంతపురం`, `రాజా`, `అనగనగా ఒక అమ్మాయి`, `అన్నయ్య`, `రవన్న`, `పోస్ట్ మ్యాన్`, `మూడు ముక్కలాట`, `నిన్నే ప్రేమిస్తా`, `అజాద్`, `జయం మనదేరా`, `దేవిపుత్రుడు`, `ఎదురులేని మనిషి`, `శ్రీమంజునాథ`, `అధిపతి`, `కొండవీటి సింహాసనం`, `సీతయ్య`, `స్వేతనాగు` వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది సౌందర్య. తెలుగులోనే కాదు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది సౌందర్య.