శ్యామ్‌ బెనెగల్‌ చేసిన తెలుగు సినిమాలేంటో తెలుసా? తెలంగాణ జీవితానికి జాతీయ గుర్తింపు

First Published | Dec 24, 2024, 12:37 AM IST

దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌ బెంగాలీ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నా, ఆయన తన సినిమాలతో తెలంగాణ జీవితాన్ని ఆవిష్కరించారు. మరి ఇంతకి ఆయన చేసిన తెలుగు సినిమాలేంటో తెలుసా?

లెజెండరీ దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌ మరణ వార్త ఇప్పుడు యావత్‌ భారతీయ సినిమాని శోకసంద్రంలో ముంచెత్తింది. ఓ రకంగా ఆయన మరణం భారతీయ సినిమాకి చీకటి రోజుగా చెప్పొచ్చు. తనదైన సినిమాలతో సంచలనాలు సృష్టించి శ్యామ్‌ బెనెగల్‌కి మన తెలుగుతో, మన హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. మన తెలంగాణతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్‌, తెలంగాణలోనే కావడం విశేషం. చిన్నప్పట్నుంచే తెలంగాణ మట్టి వానసలు ఆయనకు బాగా తెలుసు. తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు ఆయనకు బాగా తెలుసు. వాటినే కథా వస్తువులుగా చేసుకుని దేశం గర్వించే చిత్రాలు చేశారు. తెలంగాణ జీవితానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపుని తీసుకొచ్చారు. 
 

`అంకుర్‌`..

శ్యామ్‌ బెనెగల్‌ తీసిన చాలా సినిమాల్లో తెలంగాణ నేపథ్యంలో ఉండటం విశేషం. తెలంగాణ ప్రాంతంలోని కథలతోనే సినిమాలు తీసి సంచలనాలు సృష్టించారు. అందుకు తొలి చిత్రం `అంకుర్‌`తోనే స్టార్ట్ అయ్యింది. ఈ మూవీని ఆయన దక్కని భాషలో రూపొందించారు. 1974లో విడుదలైన ఈ చిత్రం ద్వారా అనంత్‌ నాగ్‌, షబానా అజ్మీ హీరోహీరోయిన్లుగా వెండితెరకు పరిచయం చేశారు. ఈ సినిమాని తెలంగాణలోని ఓ గ్రామం నుంచి తీసుకున్న కథ కావడం విశేషం. సినిమాలోనూ అలానే చూపించారు. ఇక్కడి సామాజిక అసమానతను, తిరుగబాటు వ్యవస్థని ఆవిష్కరించారు. ఈ తొలి చిత్రంతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీకి జాతీయ అవార్డు దక్కింది. 
 


`నిశాంత్‌`..
శ్యామ్‌ బెనెగల్‌ తెలంగాణలో ఉన్న భూస్వామ్య వ్యవస్థని, స్త్రీలపై లైంగిక దాడులను ప్రతిబింబిస్తూ `నిశాంత్‌` సినిమాని రూపొందించారు. కథా వస్తువు తెలంగాణదే అయినా, హిందీ భాషలో దీన్ని తెరకెక్కించారు. ఈ మూవీ ప్రధానంగా 1940-50లో తెలంగాణలోని భూస్వామ్య విధానాన్ని, గ్రామాల్లో మహిళలపై లైంగిక దోపిడీని ఆవిష్కరిస్తుంది. ఈ మూవీకి కూడా జాతీయ అవార్డు దక్కింది. 
 

దీంతోపాటు తెలంగాణలోని పోచంపల్లి ఇకత్‌ హస్తకళ వర్కర్ల పోరాటాలను ఆవిష్కరిస్తూ హిందీలో `సుశ్మన్‌` సినిమాని 1987లో రూపొందించారు శ్యామ్‌ బెనెగల్‌. ఇక హైదరాబాద్, తెలంగాణలోని వ్యభిచార గృహాల నుంచి ప్రేరణ పొంది రూపొందించారు. వ్యభిచార గృహాలను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారనేదాన్ని సెటైరికల్గా `మండీ` సినిమాని రూపొందించారు దర్శకుడు. హిందీలో రూపొందించిన ఈ మూవీ రెండు జాతీయ అవార్డులను గెలచుకుంది.  అలాగే తెలంగాణలోని ఒక నిజమైన సంఘటన నుండి ప్రేరణ పొంది `వెల్ డన్ అబ్బా (2009) సినిమాని తెరకెక్కించారు.దీనికి జాతీయ అవార్డు దక్కింది. 
 

ఇలా తెలంగాణ గ్రామాలు, ప్రజల జీవితాలను వెండితెరపై ఆవిష్కరించిన శ్యామ్‌ బెనెగల్‌ తెలుగులోనూ ఓ సినిమా చేశారు. `కొండూర` అనే సినిమాని రూపొందించారు. ఇది హిందీ, తెలుగులో బైలింగ్వల్‌గా తెరకెక్కించడం విశేషం. తెలుగులో `అనుగ్రహం` పేరుతో తెరకెక్కించారు. ఇందులో అనంత్‌ నాగ్‌, వాణిశ్రీ, స్మిత పాటిల్‌, సత్యదేవ్‌ దుబే`, `అమ్రిష్‌ పూరి,రావు గోపాల్‌ రావు వంటి వారు నటించారు. పెళ్లి వ్యవస్థని, మూఢనమ్మకాలను, సూపర్‌నేచురల్‌ పవర్స్ ని మేళవిస్తూ ఈ మూవీని తెరకెక్కించారు శ్యామ్‌ బెనెగల్‌. ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందింది.  
 

ఇలా శ్యామ్ బెనగల్ తెలంగాణ సహా పల్లెటూర్లల్లో ఉండే క్లిష్టతలు, సవాళ్లను ప్రతిబింబించే కథనాలతో సినిమాలు తెరకెక్కించి మెప్పించారు. కల్చర్‌ని తెరపై ఆవిష్కరించి ఆకట్టుకున్నారు. ఆయన ఇండియన్‌ సినిమాకి చేసిన సేవలకుగానూ పద్మశ్రీ పురస్కారం, పద్మ భూషణ్‌, దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాలను అందుకున్నారు.  

read more: శ్యామ్‌ బెనెగల్‌ కి హైదరాబాద్‌ తో ఉన్న సంబంధం ఏంటి? లెజెండరీ దర్శకుడి గురించి ఎవరికీ తెలియని నిజాలు

also read: ఎన్టీఆర్‌ మాకు ఏ సాయం చేయలేదు, అభిమాని కౌశిక్‌ తల్లి ఆవేదన.. తెరపైకి సంచలన పుకార్లు

Latest Videos

click me!