Dharmendra: బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందంటూ మంగళవారం పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి కీలక ప్రకటన వచ్చేసింది.
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్యం కుదటపడగా బుధవారం (ఈరోజు) ఉదయం 7:30 గంటలకు వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు ఆయనను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. “ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది, మిగిలిన చికిత్స ఇంట్లోనే కొనసాగుతుంది.” అని వైద్యులు తెలిపారు.
24
పుకార్లకు చెక్
ధర్మేంద్ర ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ఆయన మరణించారంటూ మంగళవారం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వెంటనే దీనిపై కుటుంబ సభ్యులు స్పందించారు. భార్య హేమా మాలిని మాట్లాడుతూ.. “ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయడం అసహ్యకరం. ధర్మేంద్ర బాగానే ఉన్నారు,” అని తేల్చి చెప్పారు. కుమార్తె ఈషా డియోల్ ఈ వార్తలను ఖండిస్తూ.. “నా తండ్రి ఆరోగ్యం మెరుగవుతోంది. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మొద్దు,” అని కోరింది.
34
అక్టోబర్‌లో ఆసుపత్రిలో చేరిన ధర్మేంద్ర
అనారోగ్య కారణాల దృష్ట్యా ధర్మేంద్రను అక్టోబర్ చివరలో ఆసుపత్రిలో చేర్చారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కారణంగా.. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. కొన్ని రోజుల పరిశీలన తర్వాత ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. “ఆయన వయస్సు దృష్ట్యా జాగ్రత్త అవసరం, అందుకే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.” అని వైద్యులు తెలిపారు.
ఇకపై ధర్మేంద్రకు అవసరమైన చికిత్స ఇంట్లోనే కొనసాగుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఆసుపత్రి నుంచి ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. ధర్మేంద్ర ఆరోగ్యంగా ఉండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు చేస్తున్నారు.