
టాలీవుడ్‌లో రోజూ అనేక ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటాయి. అందులో భాగంగానే కొన్ని సినిమాల అప్ డేట్లు వచ్చాయి. అవేంటో చూస్తే, `దేవగుడి` మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే `కోర్ట్` ఫేమ్ శ్రీదేవి నటిస్తున్న `హైకు` మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. `హ్రీం` మూవీ హీరో పుట్టిన రోజు జరిగింది. వీరితోపాటు శివ కంఠమనేని, సుప్రిత, ధన్యబాలకృష్ణ, ఎస్తేర్ నటిస్తున్న `అమరావతికి ఆహ్వానం` మూవీ టీజర్ విడుదలయ్యింది. మురళీ మోహన్ రిలీజ్ చేశారు.
బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకుడిగా, నిర్మాతగా పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై రూపొందించిన చిత్రం `దేవగుడి`. ఇందులో అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోన్న సక్సెస్ మీట్ నిర్వహించారు. దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, మా `దేవగుడి` మూవీకి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నాం. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఆకట్టుకుందనే ప్రశంసలు వస్తున్నాయి. సినిమాలోని రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. యాక్షన్ సీక్వెన్సులు, పాటల చిత్రీకరణ బాగుందనే అప్రిషియేషన్స్ వస్తున్నాయి. రఘు కుంచె చేసిన వీరారెడ్డి పాత్ర హైలైట్ అయ్యింది. కొందరు సినిమా చూసి బయటకు వస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది` అని తెలిపారు.
శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా `అమరావతికి ఆహ్వానం`. డైరెక్టర్ జీవీకే ఈ మూవీని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి గారి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల సినిమా టీజర్ ను ప్రముఖ నిర్మాత , నటులు మురళీ మోహన్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ, `అమరావతికి ఆహ్వానం` సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ మూవీ కంటెంట్ చూస్తుంటే తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం కలుగుతోంది. మా గురువు దాసరి గారు చెప్పినట్లు చిన్న చిత్రాలే ఇండస్ట్రీకి ప్రాణం. కొత్త దర్శకుడిగైనా జీవీకే ప్రతిభావంతంగా సినిమాను చక్కగా తెరకెక్కించారు. టీజర్ తోనే భయం కలిగించారు. `అమరావతికి ఆహ్వానం` సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను` అని అన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
పవన్ తాతా, చమిందా వర్మ జంటగా నటించిన చిత్రం ‘హ్రీం’. శివమ్ మీడియా పతాకంపై సుజాత మల్లాల సమర్పించగా శివమల్లాల నిర్మించారు. రాజేష్ రావూరి ఈ చిత్రానికి దర్శకుడు. సోమవారం చిత్ర హీరో పవన్ తాతా జన్మదినం సందర్బంగా చిత్ర కార్యాలయంలో జరిగిన బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు హీరో శ్రీనందు. ఆయన మాట్లాడుతూ, ఇప్పుడే ‘హ్రీం’ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ చూశాను. ఎంతో ఎక్సైట్ చేసిన కంటెంట్ ఇది అనిపించింది. ఈ సినిమాతో తమ కెరీర్ గొప్పగా ప్లాన్ చేసుకుంటున్న హీరో పవన్ తాతాకు, హీరోయిన్ డాక్టర్ చమిందా వర్మలకు నా అభినందనలు. మాటీవిలో పనిచేసి దర్శకునిగా మారబోతున్న రాజేష్‌కు ఇది చక్కని అవకాశం. అందరికి ఆల్ ది బెస్ట్ ’’అన్నారు. హీరో పవన్ మాట్లాడుతూ, ఈ బర్త్‌డే నాకు ఎంతో ప్రత్యేకం. నాకు ‘హ్రీం’ సినిమా ద్వారా మంచి అవకాశం లభించింది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఈ వేడుకలో నా కుటుంబ సభ్యులు మా మేనత్త రేణుకమ్మ, గోపి, రేఖ అందరూ పాల్గొనటం చాలా హ్యాపీగా ఉంది. కంటెంట్ చూసిన తర్వాత మీ అందరూ కూడా నన్ను ప్రశంసిస్తారని ఆశిస్తున్నా` అని అన్నారు.
`కోర్ట్` సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించిన శ్రీదేవి ఇప్పుడు `హైకూ` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. సాధారణంగా థియేట్రికల్ రన్ చూసిన తర్వాతే ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కోసం ప్రయత్నిస్తాయి. కానీ ‘హైకూ’ సినిమా విడుదలకు ముందే డిజిటల్ డీల్ క్లియర్ కావడం పెద్ద విషయం. ఈ సినిమా ఫిబ్రవరి 1న ప్రారంభమైంది.
తమిళ చిత్రం ‘హైకూ’ షూటింగ్ కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో పూజా కార్యక్రమాలతో ఈరోజు ఉదయం ప్రారంభమైంది. పేరన్బు, తరమణి వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్ ముహూర్తపు సన్నివేశంపై క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.