
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప 2 చిత్రం గతేడాది విడుదలై సంచలన విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ 1800 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ 500 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. ఇంతటి భారీ చిత్రాన్ని ఇంటర్ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉన్న కుర్రాడు హెచ్‌డీ ప్రింట్ నే పైరసీ చేశాడు అంటే నమ్మగలరా ? ఆ కుర్రాడికి ఉన్న టెక్నికల్ నాలెజ్డ్ కి హైదరాబాద్ పోలీసుల మైండ్ బ్లాక్ అయింది. అసలు ఈ కుర్రాడు ఎవరు ? హెచ్‌డీ ప్రింట్ ని రిలీజ్ కి ముందే పైరసీ చేయడం అతడికి ఎలా సాధ్యం అయింది ? ఇలాంటి సంచలన విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఇటీవల తెలంగాణ పోలీసులు చెన్నై, బీహార్ లాంటి ప్రాంతాల్లో తెలుగు, ఇతర భాషా చిత్రాలని పైరసీ చేస్తున్న వ్యక్తులని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎస్ నరేష్ మాట్లాడుతూ హెచ్‌డీ ప్రింట్ లతో సినిమాలని పైరసీ చేసిన కుర్రాడి వివరాలు బయట పెట్టారు. సాధారణంగా క్యాంకార్డింగ్, కెమెరా రికార్డింగ్ ద్వారా సినిమాల పైరసీ చేస్తారు. ఇన్స్పెక్టర్ నరేష్ చెప్పిన వివరాల ప్రకారం ఈ కుర్రాడు చేసే పైరసీ వేరు. అతడి పేరు అశ్విని కుమార్. బీహార్ పాట్నా అతడి స్వస్థలం. తండ్రి బట్టల వ్యాపారి. వాళ్ళకి మూడంతస్తుల భవనం ఉంది. ఆ కుర్రాడు ఇంటర్ తో చదువు ఆపేశాడు. అంత చురుకైన కుర్రాడు కాదు. స్కూల్ లో కూడా అశ్విని కుమార్ ని అతడి ఫ్రెండ్స్ ఎగతాళి చేసేవారట. దీనితో అశ్విని కుమార్ కి చదువుపై ఇంట్రెస్ట్ పోయింది. కానీ ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంది. అశ్విని కుమార్ చేసీ పైరసీ పూర్తిగా టెక్నాలజీకి సంబంధించినది. ఇంటర్ మాత్రమే చదివిన ఆ కుర్రాడికి అంత నాలెజ్డ్ ఎలా సాధ్యం అయింది అని ఆరా తీస్తే మతిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కెమెరా రికార్డింగ్ ద్వారా పైరసీ చేసే వాళ్ళని త్వరగానే పట్టుకోవచ్చు. కానీ ఈ కుర్రాడిని పట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ కేసుని ఛేదించే క్రమంలో మేము క్రిప్టో అనాలసిస్ కూడా చేశాం. ఈ క్రమంలో మాకు పెద్ద ఎత్తున క్రిప్టో, బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ చేస్తున్న ట్రేడర్ ని అరెస్ట్ చేశాం. అతడు ఇచ్చిన వివరాల ప్రకారం కరెన్సీ ట్రాన్స్ ఫర్ పాట్నాకు జరుగుతోంది అని తేలింది. అప్పుడు అశ్విని కుమార్ వివరాలు బయటపడ్డాయి. అశ్విని కుమార్ తన తల్లిదండ్రుల బలవంతంతో ఇంట్లోనే ఉంటూ ఓపెన్ డిగ్రీ చేస్తున్నాడు. అతడికి సపరేట్ రూమ్ ఉంది. అశ్విని కుమార్ కి టెక్నాలజీ నేర్చుకోవడం అంటే ఇష్టం. ఆ విధంగా బగ్ హంటింగ్ టెక్నాలజీ నేర్చుకున్నాడు. జావా, పైథాన్ లాంటి కోర్సులు కూడా నేర్చుకున్నాడు. దీని ద్వారా హ్యాకింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. వేరే వాళ్ళ సర్వర్ ని సక్సెస్ ఫుల్ గా హ్యాక్ చేసి ఆ డేటా పొందాలని అనుకున్నాడు. ఇతరుల సర్వర్ ని సక్సెస్ ఫుల్ గా హ్యాక్ చేస్తే అతడికి మంచి కిక్ వచ్చేది. ఆ విధంగా సినిమాలపై కూడా అశ్విని కుమార్ కి ఇంట్రెస్ట్ ఉంది. సాధారణంగా ప్రొడ్యూసర్ లు సినిమాలని UFO, Qube లాంటి డిజిటల్ సంస్థల ద్వారా రిలీజ్ చేస్తారు.
ప్రధానంగా సినిమా రిలీజ్ చేసే డిజిటల్ సంస్థలు రెండు మూడు మాత్రమే ఉంటాయి. ఆ సంస్థల సర్వర్ ని హ్యాక్ చేస్తే సరిపోతుంది. UFO, Qube సంస్థలు ఇప్పటికీ పాత ఆపరేటింగ్ సిస్టమ్స్ నే వాడుతున్నాయి. సర్వర్లలో ఫైర్ వాల్స్ కూడా అప్డేట్ చేయలేదు. దీనితో అశ్విని కుమార్ కి వాటిని హ్యాక్ చేయడం సులభం అయింది. పుష్ప 2 సినిమాని అతడు రిలీజ్ కి 2 రోజుల ముందే హెచ్‌డీ ప్రింట్ ని హ్యాక్ చేసి డౌన్ లోడ్ చేసుకున్నాడు. మూవీ పైరసీ చేసే గేమింగ్ సంస్థలు కొన్ని ఉంటాయి. ఆ సంస్థలకు పుష్ప 2 హెచ్‌డీ ప్రింట్ ని అతడు దాదాపు 800 డాలర్లకు అమ్మేశాడు. అంటే దాదాపు రూ 70 వేలు. కానీ వాళ్ళకి పుష్ప 2 సినిమా రిలీజ్ ముందే చూసే వీలు ఉండదు.
అశ్విని కుమార్ వాళ్ళకి సినిమా చూడడానికి అవసరమైన కీ రిలీజ్ రోజు మాత్రమే ఇస్తాడు. పైరసీ లీక్ అయిందని ముందే తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. 500 కోట్ల బడ్జెట్ లో రూపొందిన చిత్రాన్ని అతడు సింపుల్ గా హ్యాక్ చేసి కేవలం 70 వేలకు అమ్మేశాడు. సినిమా బడ్జెట్ ఎంత అనేది అతడికి అనవసరం. తనకి కావలసిన డబ్బు మాత్రమే తీసుకుంటాడు. ఆ విధంగా 120 పైగా చిత్రాలని అశ్విని కుమార్ హెచ్‌డీ ప్రింట్ ని హ్యాక్ చేసి డౌన్ లోడ్ చేశాడు. ఇప్పటి వరకు అశ్విని కుమార్ లక్ష డాలర్లు అంటే దాదాపు రూ 90 లక్షలు సంపాదించాడు అని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేష్ అన్నారు. తాను పైరసీ చేసిన చిత్రాల్లో బాగా నచ్చిన మూవీ ఏంటో కూడా ఇన్వెస్టిగేషన్ లో అశ్విని కుమార్ చెప్పాడట. పుష్ప 2 కంటే అతడికి నాని హిట్ 3 చిత్రం బాగా నచ్చింది అని తెలిపాడు. సర్వర్లని హ్యాక్ చేసి డౌన్ లోడ్ చేయడం మాత్రమే కాదు.. బీహార్ లోని మారుమూల చిన్న పట్టణాల్లో ఉండే థియేటర్ల వైఫై ని కూడా హ్యాక్ చేసి సినిమాలు డౌన్ లోడ్ చేసేవాడు అని ఇన్స్పెక్టర్ నరేష్ తెలిపారు.