Betting Apps: 200 మంది మరణానికి జ్యోతక్కే కారణం... అన్వేష్ సంచలన ఆరోపణలు.

బెట్టింగ్‌ యాప్స్‌పై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. బెట్టింగ్‌ యాప్స్‌ మాయలో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే సినీ తారలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్ల్యూయర్స్‌, కొంత మంది యాంకర్స్‌ ప్రమోట్‌ చేయడం వల్లే చాలా మందికి బెట్టింగ్‌ యాప్స్‌ గురించి తెలిశాయని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మందిపై కేసులు కూడా నమోదయ్యాయి..
 

Anvesh vs shiva jyothi

బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంపై ప్రముఖ యూట్యూబర్‌ అన్వేష్‌ యుద్ధం చేస్తున్నాడు. మొదటి నుంచి బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న వారిని టార్గెట్‌ చేస్తూ యూట్యూబ్‌లో వీడియోలను పోస్ట్‌ చేస్తున్నాడు. ప్రకాశ్‌ రాజ్‌, అలీతో పాటు పలువురు ఇన్‌ఫ్ల్యూయర్స్‌పై విరుచుకుపడ్డ అన్వేష్‌ తాజాగా.. ప్రముఖ యాంకర్‌ శివజ్యోతిని టార్గెట్‌ చేశాడు. తక్కువ సమయంలో కోట్ల రూపాయాలను ఎలా సంపాదించారంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.

Anvesh

ఎలాంటి సెలబ్రిటీ కుటుంబ నేపథ్యం లేకుండా మారుమూల గ్రామం నుంచి వచ్చిన శివజ్యోతి బంజారాహిల్స్‌లో రూ. 5 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను ఎలా కొనుగోలు చేసిందంటూ ప్రశ్నించాడు.  బీఎమ్‌డబ్ల్యూ కారు కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్నాడు.

అదే విధంగా శివజ్యోతి మహబూబ్‌ నగర్‌లో హైవేపై 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని ఆరోపించాడు. ఇదంతా బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్స్‌ ద్వారా వచ్చిన డబ్బుతోనే అని అన్వేష్‌ విరుచుకుపడ్డాడు. 


anvesh

బెట్టింగ్‌ యాప్స్‌లో డబ్బులు పెట్టిన వారు చనిపోతుంటే శివజ్యోతి మాత్రం మాల్దీవులు, దుబాయ్‌, థాయ్‌లాండ్, బ్యాంకాక్‌ దేశాల్లో భర్తతో ఎంజాయ్‌ చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. 2024లో బెట్టింగ్‌ యాప్స్‌ వల్ల 1200 మంది చనిపోతే వీరిలో 200 మంది శివజ్యోతి వల్లే చనిపోయారని అన్వేష్‌ ఆరోపించాడు. బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసి కోట్లు సంపాదించిన శివజ్యోతిని విచారించి డబ్బులు తిరిగా వసూలు చేయాలని సీఎం రేవంత్‌కు అన్వేష్‌ విజ్ఞప్తి చేశాడు. 

పేదరికం నుంచి వచ్చిన శివజ్యోతికి పేదల కష్టం తెలియదా.? ఇల్లిగల్‌ బెట్టింగ్‌ యాప్స్‌ను ఎలా ప్రమోట్‌ చేశావంటూ అన్వేష్‌ విరుచుకుపడ్డాడు. ఒక సాధారణ యాంకర్‌కు ఇన్ని కోట్ల రూపాయాలు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించాడు. తప్పు ఎవరు చేసిన తప్పే అని బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసిన ప్రతీ ఒక్కరికీ శిక్ష పడాల్సిందే అంటూ అన్వేష్‌ చెప్పుకొచ్చాడు. 
 

Representativer Image (Photo: Telangana Government)

సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం: 

బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసేందుకు డీజీపీ జితేందర్‌ ఆదేశాలు జారీ చేశారు.  సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్‌ దర్యాప్తు చేపట్టనుంది. సిట్‌ బృందంలో ఐజీ రమేశ్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్‌, డీఎస్పీ శంకర్‌ ఉన్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ వ్యవహారంలో పంజాగుట్టతో పాటు సైబరాబాద్‌, మియాపూర్‌ పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను కూడా ప్రభుత్వం సిట్‌కు బదిలీ చేసింది. దీనిపై 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని సిట్‌కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

Latest Videos

click me!