బండ్ల గణేశ్‌కు జైలు శిక్ష‌, రూ.95 లక్షల జరిమానా.. అస‌లేం జ‌రిగిందంటే.?

Published : Nov 18, 2026, 07:03 PM IST

Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనను దోషిగా నిర్ధారించిన ఒంగోలు కోర్టు ఏడాది సాధారణ జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.95 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

PREV
15
రూ.95 లక్షల అప్పుతో మొదలైన వివాదం

ఈ కేసు మూలాలు 2018లో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో ఉన్నాయి. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి చెందిన జానకి రామయ్య వద్ద బండ్ల గణేశ్‌ రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే కొంతకాలానికి జానకి రామయ్య మరణించారు. దీంతో ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వర్లుకు బండ్ల గణేశ్‌ డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పేరుతో రూ.95 లక్షలకు సంబంధించిన చెక్‌ను బాధితుడికి అందజేశారు. అయితే ఆ చెక్‌ను బ్యాంకులో జమ చేయగా నగదు అందుబాటులో లేకపోవడంతో అది తిరస్కరణకు గురైంది. దీంతో బాధితుడు తనకు రావాల్సిన మొత్తాన్ని తిరిగి పొందేందుకు న్యాయపోరాటానికి దిగారు.

25
విచారణ తర్వాత కోర్టు సంచలన తీర్పు

చెక్ బౌన్స్ కావడంతో జెట్టి వెంకటేశ్వర్లు ఒంగోలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై దాఖలైన కేసులో ఇరువర్గాల వాదనలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన కోర్టు విచారణ చేపట్టింది. సుదీర్ఘ విచారణ అనంతరం బండ్ల గణేశ్‌పై నమోదైన అభియోగాలు రుజువైనట్లు నిర్ధారించింది. ఈ మేరకు ఆయనకు ఏడాది సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాకుండా రూ.95 లక్షలు చెల్లించాలని, బాధితుడికి కేసు విచారణ సందర్భంగా అయిన కోర్టు ఖర్చులను కూడా అందించాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేశ్‌కు న్యాయస్థానం నెల రోజుల గడువు ఇచ్చింది.

35
గతంలోనూ చెక్ బౌన్స్ కేసులు

బండ్ల గణేశ్‌కు చెక్ బౌన్స్ వ్యవహారాలు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ఆర్థిక వివాదాలకు సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు శిక్షలు విధించగా, వాటిపై ఆయన అప్పీల్‌కు వెళ్లారు. తాజాగా ఒంగోలు కోర్టు ఇచ్చిన తీర్పుతో మరోసారి ఆయన పేరు వార్తల్లో నిలిచింది. సినీ రంగంలో నటుడిగా గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత నిర్మాతగా ఎదిగిన వ్యక్తి ఇలా వరుస న్యాయపరమైన వివాదాలను ఎదుర్కోవడం చర్చకు దారితీసింది.

45
పౌల్ట్రీ వ్యాపారం.. బ్యాంకు రుణాల వివాదం

సినిమా నిర్మాణంతో పాటు బండ్ల గణేశ్‌ వ్యాపార రంగంలోనూ పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన మెస్సర్స్ శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోసం యూనియన్ బ్యాంక్ నుంచి భారీ మొత్తంలో రుణాలు పొందారు. ఈ రుణాలకు భద్రతగా కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను తనఖా పెట్టారు. అయితే వ్యాపార సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో రుణాల చెల్లింపులు సమస్యగా మారాయి. దీంతో బకాయిలను రాబట్టుకునేందుకు బ్యాంకు అధికారులు తనఖా పెట్టిన ఆస్తులను చట్టపరమైన ప్రక్రియ ద్వారా బహిరంగ వేలం వేశారు. ఈ పరిణామాన్ని బండ్ల గణేశ్‌ వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం ప్రారంభించారు.

55
డీఆర్‌టీ నుంచి సుప్రీంకోర్టు వరకు.. దక్కని ఊరట

తనఖా ఆస్తుల వేలాన్ని నిలిపివేయాలంటూ బండ్ల గణేశ్‌ రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌ (డీఆర్‌టీ)ని ఆశ్రయించారు. అక్కడ ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో వేలం ప్రక్రియను రద్దు చేసే దిశగా పరిణామాలు సాగాయి. అయితే డీఆర్‌టీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు బ్యాంకు చేపట్టిన వేలం ప్రక్రియను సమర్థిస్తూ, డీఆర్‌టీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై బండ్ల గణేశ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తాజాగా ఒంగోలు కోర్టు ఇచ్చిన చెక్ బౌన్స్ తీర్పుతో బండ్ల గణేశ్‌ మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. అయితే ఈ తీర్పుపై ఆయన అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండటంతో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories