ఆనంద్ దేవరకొండ అన్నయ్య విజయ్ దేవరకొండ (Vijay devarakonda) స్వయంగా నిర్మించగా... భారీగా ప్రమోట్ చేశారు. ఇద్దరు అన్నదమ్ములు విభిన్నమైన రీతిలో సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేశారు. ముఖ్యంగా పుష్ప విమానం ట్రైలర్ ఆకట్టుకోగా, సినిమాపై అంచనాలు పెంచేసింది. మరి ప్రేక్షకుల అంచనాలు పుష్ప విమానం ఎంత వరకు అందుకుందో చూద్దాం
కథ: గవర్నమెంట్ స్కూల్ లో మాథ్స్ టీచర్ అయిన సుందర్( ఆనంద్ దేవరకొండ) పెద్దలు కుదిర్చిన అమ్మాయి మీనాక్షిని( గీతా సైని)ను వివాహం చేసుకుంటాడు. సుందర్ తో వివాహం ఇష్టం లేని మీనాక్షి పెళ్లి తరువాత ప్రేమించిన ప్రియుడితో లేచిపోతుంది. భార్య లేచిపోయిన విషయం బయటపడితే సమాజంలో పరువుపోతుందని భావించిన సుందర్... మీనాక్షి తనతోనే ఉన్నట్లు నమ్మిస్తూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ సునీల్ ఎంట్రీతో సుందర్ జీవితంలో మరిన్ని సమస్యలు మొదలవుతాయి. లేచిపోయిన మీనాక్షికి ఏమైంది? అసలు ఆమె బ్రతికే ఉందా? ఒకవేళ లేచిపోతే ఎవరితో లేచిపోయింది? చివరకు సుందర్-మీనాక్షి కలిశారా? ఈ ప్రశ్నల సారాంశమే పుష్పక విమానం.
లేచి పోవడం అనే ఓ సామాజిక దురాచారాన్ని ప్రధాన అంశంగా తీసుకొని, కామెడీతో కూడిన సస్పెన్సు క్రైమ్ డ్రామాగా చెప్పాలనుకున్నాడు దర్శకుడు దామోదర్. ఆ విషయంలో ఆయన ఒకింత సక్సెస్ అయ్యాడు. మొదటి సగం మొత్తం భార్య లేచిపోయిన విషయాన్ని తెలియకుండా దాచడం కోసం... ఆనంద్ దేవరకొండ పడే కష్టాలు, ఇబ్బందులను సొసైటీ కోణంలో కామిక్ గా చెప్పే ప్రయత్నం చేశారు. అసలు మీనాక్షికి ఏమైంది? ఆమెను లేపుకుపోయింది ఎవరు ? అనే సస్పెన్సు ప్రేక్షకుల్లో కొనసాగింది. దీనితో ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపిస్తుంది.
అయితే కథలోని సస్పెన్సు వీడాక ఏమంత ఆసక్తికరంగా సాగలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ తేలిపోయింది అనేది ప్రీమియర్ టాక్. నెమ్మదించిన కథనం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సెకండ్ హాఫ్ లో కామెడీ అంశాలు తగ్గి, క్రైమ్ సస్పెన్సు కోణం తీసుకుంటుంది మూవీ. పోలీస్ అధికారి సునీల్ తో సాగే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఏమంత ఆసక్తి కల్గించలేకపోయాయి. క్లైమాక్స్ లో అసలు ట్విస్ట్ బయటపడడంతో మూవీ ముగుస్తుంది.
ఓ అమ్మాయి పెళ్ళికి ముందు లేచిపోతే అది కన్నవాళ్లకు, పెళ్లి తర్వాత లేచిపోతే కట్టుకున్నవాడికి అవమానం. ఇష్టమైనవాడితో అమ్మాయి వెళ్లిపోవడం అనేది ఇప్పటికీ ఇండియన్ సొసైటీలో అత్యంత పరువు తక్కువ పని. పెళ్ళాం లేచిపోయింది అంటే.. ఇంకా చులకనగా చూస్తారు. ఆ పరిస్థితి ఎదురైన భర్తగా ఆనంద్ దేవరకొండ సహజంగా నటించారు. Pushpaka vimanam సినిమాలో చెప్పుకోదగ్గ అంశాల్లో ఆయన నటన ఒకటి.
ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ భార్యగా చేసిన గీతా సైని, భార్యగా నటించిచే పాత్ర శాన్వి మేఘన తమ పాత్రల మేర ఆకట్టుకున్నారు. హీరోయిన్స్ కి చెప్పుకోదగ్గ నిడివి ఉండదు సినిమాలో. కథ మొత్తం ఆనంద్ దేవరకొండ చుట్టూ తిరుగుతుంది. మరో కీలక పాత్ర చేసిన సునీల్ సినిమాకు ప్లస్ పాయింట్. హీరోని అనుమానించే సీరియస్ పోలిస్ పాత్రలో సునీల్ చాలా బాగా చేశారు. ఈ తరహా పాత్రలు సునీల్ కి బాగా కుదరడం విశేషం.