ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం రోజు పోలీసుల విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ఎ 11 గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వెళ్ళినప్పుడు జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది.ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అల్లు అర్జున్ ని పోలీసులు ప్రధానంగా ప్రశ్నించింది.. రేవతి మరణించిన విషయం ఎప్పుడు తెలిసింది ? పోలీసులు థియేటర్ వద్ద మీకు ఆ విషయం చెప్పారా లేదా ? అని ప్రశ్నించారట. అదే విధంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ సంఘటన గురించి మాట్లాడిన తర్వాత మీ వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు మీడియా సమావేశంలో తెలిపారు.. మీకు ఎందుకు అలా అనిపించింది.. అలా అనిపించడానికి కారణాలు ఏంటి ? అని అడిగారట.
అదే విధంగా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సీసీ టీవీ ఫుటేజ్ చూపిస్తూ అల్లు అర్జున్ ని మరికొన్ని ప్రశ్నలు అడిగారట. తొక్కిసలాట దృశ్యాలు చూడగానే అల్లు అర్జున్ ఏడ్చేసినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట దృశ్యాలు కళ్ళముందు కనిపిస్తుండడంతో అల్లు అర్జున్ భావోద్వేగం ఆపుకోలేకపోయినట్లు తెలుస్తోంది.
దాదాపు నాలుగు గంటలపాటు పోలీసులు అల్లు అర్జున్ ని విచారించారు. విచారణ సమయంలో పోలీసులు అల్లు అర్జున్ కి భోజనం కూడా ఏర్పాటు చేశారట. కానీ అల్లు అర్జున్ భోజనం తినకుండా స్నాక్స్, టీ మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా పోలీసులు అల్లు అర్జున్ కి చెప్పారట.