Allari Naresh: నటుడు అల్లరి నరేష్ తన కెరీర్ ఒడిదుడుకులపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 2012 వరకు విజయం, ఆపై వరుస ఫ్లాప్‌లు, నాందితో తన కెరీర్‌కు వచ్చిన మలుపు గురించి వివరించారు.
ప్రముఖ నటుడు అల్లరి నరేష్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఒడిదుడుకులు, భవిష్యత్ ప్రణాళికల గురించి పంచుకున్నారు. 2012 వరకు తన చిత్రాలకు మంచి ఆదరణ లభించిందని, ఆడియన్స్ థియేటర్ల వద్ద క్యూ కట్టిన రోజులను గుర్తు చేసుకున్నారు. అయితే, 2013 నుంచి 2019 వరకు వరుసగా పరాజయాలను చవిచూశానని అంగీకరించారు. ఆ సమయంలో గమ్యం లేదా శంభో శివ శంభో వంటి చిత్రాలకు మంచి పేరు వచ్చినప్పుడే కామెడీ జానర్ నుంచి బయటపడి వేరే కథలను ఎంచుకొని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
25
ఆరు నుంచి ఎనిమిది నెలల విరామం..
మహర్షి చిత్రం తర్వాత సుమారు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు విరామం తీసుకున్నానని, ఆ సమయంలో తనకు వ్యక్తిగతంగా నచ్చిన, రెగ్యులర్‌కు భిన్నమైన కథలను మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నాంది చిత్రం తన కెరీర్‌లో ఒక ప్రూవింగ్ పాయింట్ అని నరేష్ పేర్కొన్నారు. కామెడీ చేసే నటుడు సీరియస్ సినిమా చేస్తే బిజినెస్ అవుతుందా, డిస్ట్రిబ్యూటర్లు కొంటారా, జనాలు థియేటర్‌కు వస్తారా అనే అనేక ప్రశ్నలకు నాంది సమాధానం ఇచ్చిందని వివరించారు.
35
కంటెంట్ బాగుంటే ఏ పాత్రలోనైనా..
ఆ చిత్రం విజయం సాధించాక, కంటెంట్ బాగుంటే తనను ఏ పాత్రలోనైనా చూడటానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని అర్థమైందని, అప్పటి నుంచి తాను చాలా సెలెక్టివ్‌గా కథలను ఎంచుకుంటున్నానని అల్లరి నరేష్ చెప్పారు. నరేష్ తన కొత్త చిత్రం 12A రైల్వే కాలనీ గురించి మాట్లాడుతూ, ఇది తన మొదటి సస్పెన్స్ థ్రిల్లర్ అని వెల్లడించారు. నాంది తర్వాత నటుడిగా కొత్త పాత్రలను ఎంచుకోవాలనే తపన తనకు ఉందని, అందులో భాగంగానే సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు ఆసక్తి పెరిగిందని అన్నారు.
పొలిమేర దర్శకుడు అనిల్ ఒకరోజు ఈ కథను చెప్పగా, తాను ఎంతో ఉత్సాహం చూపించానని తెలిపారు. ఈ కథలో అనేక మల్టీ-లేయర్‌లు ఉన్నాయని, ఏ కథ ఎక్కడ మొదలై, ఎక్కడ ముగుస్తుందో అర్థం కాని పజిల్ లా ఉంటుందని వివరించారు. సినిమాలో ప్రతి పాత్రపైనా, తన పాత్రపైనా కూడా అనుమానం వస్తుందని అన్నారు. దర్శకుడు అనిల్ స్క్రీన్‌ప్లే తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు.
55
ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో..
మహారాజా లాంటి చిత్రం మాదిరిగా ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే ఈ చిత్రంలో ఉంటుందని నరేష్ చెప్పారు. ఈ చిత్రంలో తాను కామెడీ కాకుండా, లోకల్ పొలిటీషియన్ కు రైట్ హ్యాండ్‌గా ఉండే పాత్రలో ఎనర్జీని చూపిస్తానని, ఆ యాక్టివ్ పాత్ర ఎలా సీరియస్ పర్సన్‌గా మారుతుందనేదే 12A రైల్వే కాలనీ కథ అని నరేష్ వివరించారు.