2024 Tamil Cinema Big Loss: పోయిన ఏడాది తమిళ పరిశ్రమనుంచి స్టార్ హీరోల సినిమాలు చాలా వచ్చాయి. కాని అందులో ప్లాప్ అయిన సినిమాలే ఎక్కువ. ఆసినిమాల వల్ల కోలీవుడ్ కు వందల కోట్ల నష్టం వచ్చిందట. ఇంతకీ ఏంటా సినిమాలు..?
ఒకప్పుడు తమిళంలో విడుదలై 100 రోజులకు పైగా,ఆడిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ చేయబడి నిర్మాతలకు, దర్శకులకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. అలాగే ఇతర భాషల్లో హిట్టైన సినిమాలు కూడా తమిళంలో స్టార్ హీరోలతో రీమేక్ చేసి విజయం సాధించాయి. నటుడు జయం రవి కి తమిళ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చింది కూడా తెలుగు నుంచి తీసుకున్న జయం సినిమానే.
తలపతి విజయ్ కి కూడా రీమేక్ సినిమాలు హిట్ ఇచ్చాయి. కానీ ఓటీటీల ప్రభావం పెరిగిపోవడంతో, ప్రేక్షకులు ఇతర భాషల ఒరిజినల్ సినిమాలను చూడటం మొదలుపెట్టారు. ఓటీటీలలో అన్ని భాషల్లోకి డబ్బింగ్ చేసిన సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.
గత రెండు సంవత్సరాలుగా తమిళం కంటే తెలుగు , మలయాళం,సినిమాలే ఎక్కువ ఆకట్టుకుంటున్నాయి. తెలుగు సినిమా 1000 కోట్ల నుంచి 2000 కోట్ల వసూళ్లకు ఎగబాకింది. పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర 2000కోట్ల మార్క్ కు అతి దగ్గరగా వెళ్ళింది. కాని ఇంత వరకూ తమిళంలో ఇంకా ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లను అందుకోలేదు. మహారాజా కూడా ఇతర భాషల్లో విడివిడిగా విడుదలైన తర్వాతే 1000 కోట్ల వసూళ్ల మైలురాయిని చేరుకుంది.
2024లో విడుదలైన ఫ్లాప్ సినిమాలు, వాటి వల్ల తమిళ సినిమాకు వచ్చిన నష్టం గురించి వార్త వైరల్ అవుతోంది. లాస్ట్ ఇయర్ దాదాపు 223 సినిమాలు ఫ్లాప్ అయ్యాయని, దీనివల్ల తమిళ సినిమాకి వెయ్యి కోట్లకు పైగా నష్టం వచ్చిందని తెలిసింది. గత సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదలైన ఇండియన్ 2, కంగువ, తంగలాన్, విడుదలై 2, వేటెయన్ వంటి సినిమాలు కూడా షాకింగ్ ఫ్లాప్ అయ్యాయి.
నటుడు విశాల్ ఇటీవల మైలాపూర్ కపాలీశ్వరర్ ఆలయంలో దర్శనం చేసుకుని, మీడియాతో మాట్లాడుతూ... తక్కువ బడ్జెట్‌లో సినిమాలు తీయాలనుకునేవారు ఇంకో నాలుగైదు సంవత్సరాలు సినిమాలు తీయొద్దు, ఖచ్చితంగా నష్టపోతారు. మీ పిల్లల పేరు మీద FD లేదా ఏదైనా ఆస్తులు కొనడం లాంటివి చేయండి అని అన్నారు. ఇంతకుముందు కూడా ఆయన ఈ విషయం చెప్పినప్పుడు చాలామంది ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇలాంటి వార్త బయటకు రావడం గమనార్హం.