Yuzvendra Chahal Retirement: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. లార్డ్స్‌లో చివరి మ్యాచ్ ఆడిన చాహల్ వన్డే, టీ20ల్లో రీఎంట్రీపై దృష్టి పెట్టారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారత స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు. తాజాగా ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. దీనితో చాహల్ సుదీర్ఘ రెడ్ బాల్ క్రికెట్ కెరీర్‌కు తెరపడింది. అయితే, వైట్ బాల్ క్రికెట్‌లో అంటే వన్డేలు, టీ20ల్లో టీమిండియాలోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
తన కెరీర్ పొడవునా భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడాలని ఎంతగానో కోరుకున్నప్పటికీ, ఆయనకు టెస్టు క్యాప్ దక్కలేదు. లార్డ్స్ మైదానంలో తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడటం ఎంతో భావోద్వేగాన్ని, మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని చాహల్ పేర్కొన్నారు.
25
10 ఏళ్ల వయసులో మొదలైన ప్రయాణం.. సోషల్ మీడియాలో భావోద్వేగం
రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా చాహల్ ఇన్స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "నేను 10 ఏళ్ల వయసులో మొదటిసారి పట్టుకున్నది ఎర్రటి బంతినే. అప్పట్లో ఈ ఆటతో ఎంతగా ప్రేమలో పడతానో నాకు తెలియదు. రెడ్ బాల్ క్రికెట్ నాకు కేవలం ఒక ఫార్మాట్ మాత్రమే కాదు. ఓర్పు, వ్యక్తిత్వం, పోరాట పటిమను అది నాకు నేర్పించింది. మైదానంలో గంటల తరబడి నిలబడి ప్రతి రన్, ప్రతి వికెట్ కోసం పోరాడటంలో ఉన్న ఆనందాన్ని నేర్చుకున్నాను" అని రాసుకొచ్చారు. లార్డ్స్‌లో చివరి మ్యాచ్ ఆడటం భావోద్వేగంగా ఉందని, టెస్ట్ క్యాప్ తన కల అని, అది నెరవేరకపోయినా తన ప్రయాణం పట్ల సంతృప్తిగా ఉన్నానని చెప్పారు.
35
ఫస్ట్ క్లాస్ కెరీర్ గణాంకాలు ఇవే..
చాహల్ 2009లో హర్యానా టీమ్ తరఫున ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను ప్రారంభించారు. తన కెరీర్‌లో మొత్తం 49 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 32.27 సగటుతో 148 వికెట్లు పడగొట్టారు. రెడ్ బాల్ క్రికెట్‌లో ఆయన చివరి సీజన్ 2026 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున సాగింది. డివిజన్-2లో 16.14 సగటుతో 21 వికెట్లు తీసి సత్తా చాటారు. కనీసం 20 వికెట్లు తీసిన బౌలర్లలో చాహల్ బౌలింగ్ యావరేజ్ రెండవ అత్యుత్తమంగా నిలిచింది. లార్డ్స్‌లో మిడిల్‌సెక్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినంత మాత్రాన తన అంతర్జాతీయ కెరీర్ ముగిసిపోలేదని చాహల్ స్పష్టం చేశారు. "I AM NOT DONE YET" (నా ప్రయాణం ఇంకా ముగియలేదు) అని ఆయన ఘంటాపథంగా చెప్పారు. దేశం తరఫున ఆడాలనే కసి తనలో ఇంకా సజీవంగానే ఉందన్నారు. తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందనే నమ్మకం తనకు ఉందని, వన్డే, టీ20 ఫార్మాట్లలో మళ్లీ బ్లూ జెర్సీ ధరించడానికి తన శాయశక్తులా పోరాడతానని తెలిపారు.
55
చాహల్ ట్రాక్ రికార్డ్ సూపర్.. ఐపీఎల్‌లో టాప్ బౌలర్
భారత్ తరఫున చాహల్ 72 వన్డేల్లో 121 వికెట్లు, 80 టీ20 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు సాధించారు. 2023 ఆగస్టులో వెస్టిండీస్‌తో ఆయన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. సెలెక్టర్ల రేసులో వెనుకబడినప్పటికీ లిస్ట్-ఎ, టీ20 క్రికెట్‌లో ఆయన నిరంతరం యాక్టివ్‌గా ఉన్నారు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన చాహల్, ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన ప్రయాణంలో నిరంతరం సపోర్టుగా నిలిచిన హర్యానా క్రికెట్ అసోసియేషన్, రణబీర్ సింగ్ మహీంద్రా, అనిరుధ్ సింగ్ చౌదరిలకు చాహల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.