గరంకోటు.. తెచ్చేను చేటు..! స్వెటర్ వేసుకోవడం వల్లే ఉస్మాన్ ఖవాజా ఔట్ అయ్యాడట..!

First Published Jun 9, 2023, 9:51 AM IST

WTC Final 2023:  ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా డకౌట్ అయ్యాడు. 

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భాగంగా  ఓవల్ లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య  జరుగుతున్న మ్యాచ్‌లో  ఆసీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు తొలి రోజు ఉదయపు సెషన్ లో ఇబ్బందిపడింది.  మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీల ధాటికి ఆసీస్ బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు.  

Image credit: PTI

డబ్ల్యూటీసీ 2021 - 2023  సైకిల్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అయితే  సిరాజ్  బౌలింగ్ కు బెంబేలెత్తాడు. సిరాజ్ వేసిన నాలుగో ఓవర్లో ఖవాజా.. వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. పది బంతులు ఆడిన ఖవాజా..  నిరాశగా వెనుదిరిగాడు.  

అయితే ఖవాజా   నిష్క్రమణకు అతడు వేసుకున్న లాంగ్ స్లీవ్ స్వెటరే కారణమన్నాడు ఆసీస్ మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లంగర్.  డబ్ల్యూటీసీ ఫైనల్ లో కామెంట్రీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న   లంగర్..  ఖవాజా  నిష్క్రమణపై ఆసక్తికర  వ్యాఖ్యలు చేశాడు. 

‘ఖవాజా ఈ మ్యాచ్ లో  ఫుల్ లాంగ్ స్లీవ్ స్వెటర్ వేసుకుని  బ్యాటింగ్ కు వచ్చాడు.  ఒకవేళ నేను అలాంటి స్వెటర్ వేసుకుంటే మాత్రం  మొదటినుంచి ఆచితూచి ఆడతాను.  కానీ అది ఎప్పుడూ సౌకర్యవంతంగా ఉండదు.  ఖవాజా  కూడా అదే ఇబ్బందిని ఎదుర్కున్నాడు. అతడు ఔట్ అవడానికి కూడా అదే కారణం’ అని చెప్పుకొచ్చాడు.

కాగా ఖవాజాకు ఇంగ్లాండ్ లో గొప్ప రికార్డేమీ లేదు.  ఇక్కడ అతడు 13 ఇన్నింగ్స్ లలో ఐదు సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిగాడు.   ఖవాజా నిష్క్రమించినా  వార్నర్, లబూషేన్ లు ఆసీస్ ను ఆదుకోగా ఈ ఇద్దరి నిష్క్రమణ తర్వాత ట్రావిస్ హెడ్  (163), స్టీవ్ స్మిత్ (121) లు రెచ్చిపోయి ఆడారు.  

తొలి ఇన్నింగ్స్ లో  ఆసీస్ 469 పరుగులకు ఆలౌట్ అయింది.  అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన  ఇండియా.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో తడబడుతోంది.    రెండో రోజు ఆట ముగిసేసమయానికి  టీమిండియా.. 38 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి  151 పరుగులు చేసింది.  రోహిత్ (15), గిల్ (13), పుజారా (14), కోహ్లీ (14)  లు విఫలమయ్యారు.  రవీంద్ర జడేజా (48) ఆదుకున్నా అతడు కూడా నిష్క్రమించాడు. ప్రస్తుతం రహానే (29 నాటౌట్), భరత్ (5 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. 

click me!