అదంతా సరే, కెఎల్ రాహుల్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఎందుకిచ్చారు?... ఆ ముగ్గురినీ కాదని...

First Published Oct 3, 2022, 12:16 PM IST

ఇండియా, సౌతాఫ్రికా మధ్య గౌహతిలో జరిగిన రెండో టీ20లో బౌండరీల వర్షం కురిసింది. భారత టాపార్డర్‌ కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌తో పాటు సౌతాఫ్రికా బ్యాటర్లు క్వింటన్ డి కాక్, అయిడిన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్... బౌలర్లపై ప్రతాపం చూపించారు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి తరలించారు...

Image credit: PTI

బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగడంతో 40 ఓవర్లలోనే ఇరు జట్లు కలిపి 458 పరుగులు చేశాయి. ఇందులో డెత్ ఓవర్లలోనే (16-20) 160 పరుగులు రావడం విశేషం. డెత్ ఓవర్లలో టీమిండియా 82 పరుగులు రాబడితే సౌతాఫ్రికా బ్యాటర్లు తామేం తక్కువ కాదంటూ 78 పరుగులు రాబట్టారు...

టీమిండియా తరుపున 22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ టాప్ స్కోరర్‌గా నిలవగా, సౌతాఫ్రికా నెం.1 టీ20 బ్యాటర్ డేవిడ్ మిల్లర్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు. మిల్లర్ కిల్లింగ్ సెంచరీ కారణంగానే 238 పరుగుల లక్ష్యఛేదనలో 221 పరుగులు చేయగలిగింది సౌతాఫ్రికా...

KL Rahul

అయితే అన్యూహ్యంగా 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసిన భారత ఓపెనర్ కెఎల్ రాహుల్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కెఎల్ రాహుల్ కూడా తనకి ఈ అవార్డు దక్కడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు...

‘నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కడం ఆశ్చర్యంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. అతనే ఈ అవార్డుకి అర్హుడు. అతనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. మిడిల్ ఓవర్లలో సూర్యలా బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైన విషయం...’ అంటూ వ్యాఖ్యానించాడు కెఎల్ రాహుల్...

కెఎల్ రాహుల్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సూర్యకుమార్ యాదవ్‌కి కాదనుకుంటే సౌతాఫ్రికా తరుపున అద్భుతమైన పోరాటం చేసిన డేవిడ్ మిల్లర్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సిందనేది అభిమానుల అభిప్రాయం. చాలా సందర్భాల్లో ఓడిపోయిన టీమ్ ప్లేయర్లకు కూడా ఇలా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు దక్కాయి...

Deepak Chahar

ఈ ఇద్దరూ కాకుంటే 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 24 పరుగులు మాత్రమే ఇచ్చిన భారత బౌలర్ దీపక్ చాహార్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇచ్చినా బాగుండేదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. 237 పరుగులు చేసిన మ్యాచ్‌లో భారత జట్టు కేవలం 16 పరుగుల తేడాతో గెలిచింది. అది దీపక్ చాహార్ వేసిన మెయిడిన్ ఓవర్ వల్లేనని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

Image credit: Getty

వికెట్ తీయకపోయినా దీపక్ చాహార్ వేసిన ఆ మెయిడిన్ ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసిందనే విషయాన్ని గుర్తించాలని అంటున్నారు. వీళ్లని కాదని కెఎల్ రాహుల్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎందుకు ఇచ్చారు? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారిందంటూ పోస్టులు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ‘కెఎల్ రాహుల్ బీసీసీఐ రికమెండేషన్ క్యాండిడేట్’ అయ్యుంటాడని, అందుకే అతనికి అవార్డు వచ్చిందని మీమ్స్‌ వైరల్ చేస్తున్నారు... 

click me!