స్టోక్స్ కంటే హార్థికే మెరుగైన ఆల్‌రౌండర్ : పాండ్యాపై ఆసీస్ దిగ్గజ ఆటగాడి ప్రశంసలు

First Published Oct 2, 2022, 6:18 PM IST

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. ఐపీఎల్-15కు ముందు గ్యాప్ తీసుకుని   పునరాగమనం చేసిన అతడు టాప్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. 
 

భారత జట్టు ప్రపంచకప్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ మెగాటోర్నీలో  టీమిండియాకు కీలక ఆటగాడిగా ఉన్న ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు  షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు.  ప్రపంచ ఆల్ రౌండర్లలో అగ్రస్థానంలో  ఉన్న  బెన్ స్టోక్స్ కంటే  హార్ధికే బెటరని  వాట్సన్ అన్నాడు.

Image credit: PTI

లెజెండ్స్ లీగ్ లో  ఆడుతున్న వాట్సన్.. ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  వాట్సన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం హార్ధిక్ కెరీర్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతడి ఆటను చూడటం కన్నులపండుగగా ఉంది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు  ఆటపై తీవ్ర ప్రభావం చూపుతారు.

ప్రత్యర్థి నుంచి ఆటను తమవైపు తిప్పుకోవడంలో ఫాస్ట్ బౌలింగ్  ఆల్ రౌండర్లది కీలక పాత్ర. అది బౌలింగ్ లో అయినా బ్యాటింగ్ లో అయినా.. వాళ్ల ప్రభావం అధికంగా ఉంటుంది...’ అని వాట్సన్ అన్నాడు.

ఇక ఇద్దరి మధ్య పోలికకు సంబంధించి వాట్సన్ స్పందిస్తూ.. ‘టీ20 క్రికెట్ లో ఆల్ రౌండర్లది కీలక పాత్ర.  ఈ ఫార్మాట్ వరకు చూస్తే బెన్ స్టోక్స్ కంటే హార్ధికే   కాస్త పైచేయి సాధిస్తాడు. ముఖ్యంగా తన బ్యాటింగ్ తో పాండ్యా.. మ్యాచ్ లను ముగించే విధానం చూడముచ్చటగా ఉంది. నావరకైతే స్టోక్స్ కంటే పాండ్యానే బెటర్ ఆల్ రౌండర్’ అని స్పష్టం చేశాడు.

గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత  జట్టులో స్థానం కోల్పోయిన హార్ధిక్.. సుమారు ఆరు నెలలు  విరామం తీసుకుని పూర్తి ఫిట్ అయి  తిరిగి ఐపీఎల్ ద్వారా గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు.  గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఎంట్రీ ఇచ్చి ఏకంగా ట్రోఫీ నెగ్గాడు. ఆ తర్వాత భారత జట్టులోకి వచ్చి  నిలకడగా రాణిస్తున్నాడు.

ఇప్పటివరకు పాండ్యా భారత జట్టు తరఫున 73 టీ20లు ఆడి 54 ఇన్నింగ్స్ లో 989 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు (71 టాప్ స్కోరు ) కూడా ఉన్నాయి. బౌలింగ్ లో 64 ఇన్నింగ్స్ లలో బౌలింగ్ చేసి  54 వికెట్లు తీశాడు.

బెన్ స్టోక్స్ విషయానికొస్తే.. ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరఫున 34 టీ20లు ఆడాడు. 28 ఇన్నింగ్స్ లలో 442 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 47 గా ఉంది. బౌలింగ్ లో 28 ఇన్నింగ్స్ లలో బౌలింగ్ చేసి 19 వికెట్లు పడగొట్టాడు.

click me!