ఏమో ఆడతానేమో..? వన్డేలలో రిటైర్మెంట్ వెనక్కి తీసుకోబోతున్న బెన్ స్టోక్స్..!

First Published Dec 2, 2022, 2:39 PM IST

PAKvsENG: ఈ ఏడాది జులైలో  వన్డే ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన  ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోతున్నాడా..?  వన్డే ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో  తాజాగా స్టోక్స్  ఇందుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఇంగ్లాండ్ రెండు ఐసీసీ ప్రపంచకప్ లు సాధించడంలో కీలక పాత్ర పోషించిన  ఆ జట్టు  ఆల్ రౌండర్, టెస్టులలో ఇంగ్లీష్ జట్టుకు  సారథ్యం వహిస్తున్న బెన్ స్టోక్స్  ఈ ఏడాది జులైలో వన్డేలకు గుడ్ బై చెప్పాడు. వన్డేల నుంచి తప్పుకుంటున్నా  టెస్టులు, టీ20లలో కొనసాగుతున్నాడు. 

భారత్ తో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో విజయం తర్వాత జరిగిన  వన్డే సిరీస్ లో చివరి మ్యాచ్ ఆడిన  స్టోక్స్.. వర్క్ లోడ్ వల్ల వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు. రిటైర్మెంట్ సందర్భంగా స్టోక్స్..  తాము కూడా మనుషులమే కాదని డీజిల్ పోసి ఎక్కడకు పడితే అక్కడికి తీసుకెళ్లే వాహనాలం కాదని  ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

వన్డే సిరీస్ ముగిశాక ఇంగ్లాండ్  ఆడిన టీ20 జట్టులో కూడా పెద్దగా కనిపించని  స్టోక్స్.. టీ20 ప్రపంచకప్ మీదే ఫోకస్ పెట్టాడు.   జో రూట్ సారథ్యంలో  అబాసుపాలైన ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ ను తిరిగి నిలబెట్టేందుకు గాను  కివీస్ మాజీ సారథి బ్రెండన్ మెక్‌కల్లమ్  మార్గదర్శకత్వంలో టెస్టు క్రికెట్ ను కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. 

తాజాగా  పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన స్టోక్స్..  రావల్పిండిలో టెస్టు మ్యాచ్ ప్రారంభం సందర్భంగా  వన్డే ఫార్మాట్ కు తిరిగి రావడంపై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఈఎస్సీఎన్ క్రిక్ ఇన్ఫో కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టోక్స్ స్పందిస్తూ.. ‘ఏమో. ఆ టైమ్ (వన్డే వరల్డ్ కప్ - 2023) వరకు  నేను అందుబాటులో ఉంటానేమో ఎవరికి తెలుసు..?’ అని  తన మనసులో మాట బయటపెట్టాడు. 

అంతేగాక ‘దేశం తరఫున   ప్రపంచకప్ ఆడటం అనేది గొప్ప విషయం. ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం  పాకిస్తాన్ సిరీస్ మీదే ఉంది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత కూడా హెడ్ కోచ్ రాబ్ కీ నన్ను పక్కకు తీసుకుపోయి.. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉంది అనగానే నేను అక్కడ్నుంచి జారుకున్నా..’ అని తెలిపాడు. 

అయితే స్టోక్స్ తన నిర్ణయాన్ని మార్చుకోవడం ఖాయమని.. భారత్ లో వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్  వరకు ఇంగ్లాండ్ జట్టులో అతడు తప్పుకుండా ఉంటాడని ఇంగ్లీష్ క్రికెట్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇంగ్లాండ్ గెలిచిన  2019 వన్డే ప్రపంచకప్ తో పాటు ఇటీవలే ముగిసిన  2022 టీ20  ప్రపంచకప్  విజయాలలో  స్టోక్స్ కీలక పాత్ర పోషించిన జగద్విదితమే. 

click me!