నిన్న బౌలర్.. నేడు కెప్టెన్.. బంగ్లాదేశ్‌కు గాయాల బెడద.. వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న తమీమ్

First Published Dec 2, 2022, 12:41 PM IST

INDvsBAN: ఇండియాతో  వన్డే సిరీస్ కు ముందు బంగ్లాదేశ్ కు గాయాలు వేధిస్తున్నాయి. గురువారం ఆ జట్టు  ప్రధాన  పేసర్ టస్కిన్ అహ్మద్ గాయం కారణంగా  తొలి వన్డేకు దూరమవగా తాజాగా ఆ జట్టు సారథి కూడా.. 

టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత  బంగ్లాదేశ్ ఆడుతున్న తొలి వన్డే సిరీస్ లో ఆ జట్టుకు ఏదీ కలిసిరావడం లేదు. బంగ్లా స్టార్ ఆటగాళ్లంతా గాయాల బారీన పడుతున్నారు.  ఇదివరకే ఆ జట్టు  ప్రధాన పేసర్ టస్కిన్ అహ్మద్  గాయంతో  తొలి వన్డేకు దూరమయ్యాడు. రెండో వన్డే వరకు కోలుకోకుంటే అతడు  మొత్తం సిరీస్ కు దూరమయ్యే  అవకాశాలున్నాయి. 

టస్కిన్ గాయంపై  బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)   చీఫ్ సెలక్టర్ మిన్హాజుల్ అబెడిన్ క్రిక్ బజ్ తో స్పందిస్తూ.. ‘అవును. వెన్నునొప్పి కారణంగా టస్కిన్  భారత్ తో జరిగే తొలి వన్డేలో ఆడటం లేదు.  మేం అతడిని పర్యవేక్షిస్తున్నాం. తొలి వన్డే ముగిశాక అతడు మిగిలిన రెండు వన్డేలు ఆడాలా..? లేదా..? అనేది నిర్ణయం తీసుకుంటాం..’ అని చెప్పాడు.   
 

టస్కిన్ గాయంతోనే సతమతమవుతున్న బంగ్లాదేశ్ కు మరో షాక్ తాకింది. ఏకంగా ఆ జట్టు సారథి   తమీమ్ ఇక్బాల్ కూడా  గాయంతో బాధపడుతున్నాడు. తమీమ్ కు గజ్జల్లో గాయమైనట్టు తెలుస్తున్నది. దీంతో అతడు ఏకంగా వన్డే సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. 

భారత్ తో వన్డే సిరీస్ కు ముందు నవంబర్ 30న ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో  జరిగిన వార్మప్ మ్యాచ్ లో   తమీమ్ కు గాయమైంది.   అతడి గాయాన్ని పరిశీలించిన వైద్యులు తమీమ్ కు రెండు వారాల విశ్రాంతి అవసరమని తేల్చి చెప్పారు. 

దీంతో  తమీమ్ భారత్ తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వన్డే సిరీస్ తో పాటు అతడు  తొలి టెస్టుకు కూడా అందుబాటులో ఉండేది అనుమానంగానే ఉంది.   డిసెంబర్ 14  నుంచి తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అప్పటివరకు  తమీమ్ కు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత అతడిని తుది జట్టులోకి తీసుకోవాలా..? లేదా..? అనేది నిర్ణయం తీసుకుంటామని  బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. 

బంగ్లాదేశ్ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. వన్డేలు డిసెంబర్ 4, 7, 10 తేదీలలో జరుగనుండగా  డిసెంబర్ 14-18 మధ్య  తొలి టెస్టు,  22-26 మధ్య  రెండో టెస్టు  జరగాల్సి ఉంది.  ఈ మేరకు భారత జట్టు ఇదివరకే ఢాకా చేరుకుంది. 
 

click me!