ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని చూసిన సెలక్టర్లు.. అయితే బీసీసీఐ ప్రెసిడెంట్ అండతో...

First Published Nov 20, 2022, 12:25 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా పరాజయంతో భారత క్రికెట్ బోర్డులో ప్రక్షాళన మొదలైంది. రోహిత్ శర్మను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించి, హార్ధిక్ పాండ్యా పగ్గాలు ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. 2024 టీ20 వరల్డ్ కప్‌కి పెద్దగా సమయం లేకపోవడంతో కెప్టెన్సీ మార్పు అనివార్యమైంది...

Rohit Sharma

2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ, ఏడాది కూడా కాకుండానే వాటిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాడనే ఉద్దేశంతో రోహిత్‌కి టీమిండియా కెప్టెన్సీ ఇచ్చిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఇప్పుడు బోర్డులో లేడు...

టీ20 వరల్డ్ కప్ 2021 పరాభవం తర్వాత విరాట్ కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ. ఈ సమయంలో విరాట్ కోహ్లీ, బీసీసీఐ ప్రెసిడెంట్ (మాజీ) సౌరవ్ గంగూలీ మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. ఇది జరిగిన తర్వాత కొన్ని రోజులకే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ...

Dhoni-Gambhir

విరాట్ కోహ్లీ కంటే ముందు టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీని కూడా ఒకానొక సమయంలో సెలక్టర్లు, కెప్టెన్సీ నుంచి తప్పించాలని ప్రయత్నించారట. మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన ధోనీని తప్పించాలని బోర్డు సభ్యులంతా ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారట. ఈ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు మాజీ సెలక్టర్ మోహిందర్ అమర్‌నాథ్...

2011లో టీమిండియా వరుస సిరీస్‌లు ఓడిపోయింది. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుల్లో ధోనీ సేన, భారీ తేడాతో చిత్తుగా ఓడింది. ధోనీ కూడా ఈ సిరీసుల్లో పేలవ ప్రదర్శన ఇచ్చాడు. ఈ పరాజయాలతో ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ సెలక్షన్ కమిటీ...
 

ms dhoni

కృష్ణమాచారి శ్రీకాంత్ ఛీఫ్ సెలక్టర్‌గా ఉన్న సమయంలో మోహిందర్ అమర్‌నాథ్‌ సభ్యుడిగా ఉండేవాడు. ‘ఛీఫ్ సెలక్షన్ కమిటీ సభ్యులందరూ ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే బోర్డు ప్రెసిడెంట్ ఎన్. శ్రీనివాసన్ మాత్రం మా నిర్ణయాన్ని అంగీకరించలేదు. ధోనీ కెప్టెన్‌గా కొనసాగాల్సిందేనని తేల్చిపడేశారు. ధోనీని ఎందుకు కెప్టెన్‌గా కొనసాగాలని పట్టుబట్టాడో అందరికీ తెలుసు...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మోహిందర్ అమర్‌నాథ్...

ధోనీని టార్గెట్ చేసిన కొన్ని రోజులకే మోహిందర్ అమర్‌నాథ్, సెలక్షన్ కమిటీ నుంచి తప్పించబడ్డాడు. కృష్ణమాచారి శ్రీకాంత్ స్థానంలో సందీప్ పాటిల్‌ని ఛీఫ్ సెలక్టర్‌గా నియమించిన బీసీసీఐ, అమర్‌నాథ్ స్థానంలో విక్రమ్ రాథోడ్‌ని నార్త్ జోన్ సెలక్టర్‌గా నియమించింది. దీనికి కారణం ఎన్ శ్రీనివాసన్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ సీఎస్‌కేకి ధోనీ కెప్టెన్‌గా ఉండడమేనని అందరికీ తెలిసిన విషయమే...

click me!